Janasena Chalo Vishakhapatnam: ఇసుక కొరతకు నిరసనగా జనసేన లాంగ్ మార్చ్,సేనకు బై చెప్పిన మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మద్దతు తెలిపిన టీడీపీ, హ్యాండిచ్చిన సీపీఐ, సీపీఎం, బీజేపీ, కీలక వ్యాఖ్యలు చేసిన వైసీపీ అనకాపల్లి ఎమ్మెల్యే అమరనాధ్
Pawan Kalyan to undertake long march in Visakhapatnam | File Photo.

Visakhapatnam, November 3: ఏపీ రాష్ట్రంలో ఇసుక కొరతను నిరసిస్తూ భవన నిర్మాణ కార్మిక సంఘాలకు సంఘీభావంగా జనసేన నిర్వహించతలపెట్టిన లాంగ్ మార్చ్ (Janasena Long March) కు సర్వం సిద్ధం అయింది. ఉక్కునగరం విశాఖ వేదిక( Visakhapatnam) గా ఏపీలో ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికుల పరిష్కారానికి జనసేనాని ఈ లాంగ్ మార్చ్ కార్యక్రమం చేపట్టారు. మధ్యాహ్నం 3 గంటలకు లాంగ్ మార్చ్ ప్రారంభం కానుందని, మద్దిలపాలెం తెలుగు విగ్రహం నుంచి మహిళా కళాశాల వరకు జరుగుతుందని జనసేన కీలక నేతలు నాదెండ్ల మనోహర్, జేడీ లక్ష్మీనారాయణలు తెలిపారు. కాగా ఈ మార్చ్ కు అనుమతి లేదంటూ వస్తున్న వ్యాఖ్యలను జనసేనాధినేత పవన్ కళ్యాణ్, పార్టీ నేతలు ఖండించారు.

తాము అక్టోబర్ 28వ తేదీన పర్మిషన్ కోసం దరఖాస్తు చేయగా అక్టోబర్ 30వ తేదీన పోలీసుల పర్మిషన్, జీవీఎంసీ అనుమతినివ్వడం జరిగిందంటూ నాదెండ్ల మనోహర్ పత్రాలు చూపించారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు అండగా భవన నిర్మాణ కార్మికులకు సంఘీభావంగా తాము ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని నాదెండ్ల తెలిపారు.

జనసేనాధినేత ట్వీట్ 

అనుమతి లేదనే వార్తలు పుకార్లేనని వాటిని నమ్మవద్దంటూ జనసేనాధినేత పవన్ కళ్యాణ్ ( Jana Sena Party chief Pawan Kalyan) ట్విట్టర్ వేదికగా తెలిపారు. పవన్ తన ట్వీట్‌లో ‘భవన నిర్మాణ కార్మికుల ఆవేదనను వినిపించేందుకు.. విశాఖలో నేడు జరిగే లాంగ్ మార్చ్‌కు పోలీసులు అనుమతి ఇచ్చారు. కానీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదంటూ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తోంది.. జనసైనికులు, పార్టీ నేతలు నమ్మొద్దు’అంటూ పవన్ కళ్యాణ్ కోరారు. విశాఖలో మద్దిలపాలెం జంక్షన్‌లోని తెలుగుతల్లి విగ్రహం నుంచి జీవీఎంసీ ఎదుట ఉన్న గాంధీ విగ్రహం వరకు రెండున్నర కిలోమీటర్ల మేర ర్యాలీ జరగనుందని జనసేనాధినేత తెలిపారు.

లాంగ్ మార్చ్ కు టీడీపీ మద్దతు, హ్యాండిచ్చిన సీపీఐ, సీపీఎం

ఇదిలా ఉంటే లాంగ్ మార్చ్ కు టీడీపీ మద్దతు తెలిపింది. ఈ లాంగ్ మార్చ్ లో టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు పాల్గొననున్నారు. భవన నిర్మాణ కార్మికుల కోసం అన్ని పార్టీలు సంఘటితం కావాలని పవన్ ఇప్పటికే పిలుపునిచ్చారు. పవన్ స్వయంగా విపక్ష నేతలకు ఫోన్ చేసారు. మద్దతునిస్తాయనుకున్న వామపక్షాలు పవన్ కు హ్యాండిచ్చాయి.

లాంగ్ మార్చ్ లో పాల్గొనడం లేదంటూ సీపీఐ, సీపీఎం ( CPI and CPM ) ప్రకటించాయి. లాంగ్ మార్చ్ ( Long March) కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ సహకారం కోరడంపై వాపమక్ష పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. మీ వైఖరి తమకు ఆమోదయోగ్యంగా లేదని, కావున ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధులు లేఖ రాశారు.

జనసేన పార్టీకి మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు రాజీనామా

ఇదిలా ఉంటే జనసేన (Jana Sena) పార్టీకి మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు ( Pasupuleti Balaraju) శనివారం రాజీనామా చేశారు. ఈ మేరకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు లేఖ రాశారు.ఐదు నెలలపాటు పార్టీలో కొనసాగానని.. అందుకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలని పవన్ కళ్యాణ్‌కు లేఖలో పేర్కొన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే పార్టీని వీడాల్సి వచ్చిందని పసుపులేటి బాలరాజు స్పష్టం చేశారు.

కాగా, ఇప్పటికే జనసేన పార్టీకి పలువురు సీనియర్ నేతలు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రావెల కిషోర్ బాబు, ఆకుల సత్యనారాయణ, చింతలపూడి వెంకట్రామయ్య, పార్థసారథి ఇప్పటికే జనసేన పార్టీని వీడారు. తాజాగా పసుపులేటి బాలరాజు కూడా జనసేనకు రాజీనామా చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. విశాఖలో లాంగ్ మార్చ్ ఉన్న నేపధ్యంలో ముందు ముందు రోజే కీలక నేత రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే, బాలరాజు ఏ పార్టీలో చేరతారనేది తెలియాల్సి ఉంది.

అనకాపల్లి వైసిపి ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్ కీలక వ్యాఖ్యలు

జనసేన లాంగ్ మార్చ్‌కు అచ్చెనాయుడు రావడంపై అనకాపల్లి వైసిపి ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్ ( Avss Amarnath Gudivada) కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఇసుక డాన్ గా పేరొందిన అచ్చెన్నాయుడును ముఖ్య అతిధిగా పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లాలో టిడిపి హయాంలో శ్రీకాకుళం జిల్లాలో ఇసుక మాఫియాకు నాయకత్వం వహించడమే కాకుండా ఇసుక లారీ ఒక్కో దానినుంచి పది వేలరూపాయల చొప్పున వసూలు చేసిన చరిత్ర అచ్చెన్నాయుడిది అని ఆయన అన్నారు.

అలాంటి వారితో పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ నడిపితే ప్రజలలో విశ్వసనీయత పూర్తిగా కోల్పోతారని ఆయన అన్నారు.పవన్ కళ్యాణ్ గత ఐదేళ్లలో చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన ఇసుక మాఫియా గురించి ప్రశ్నించలేదని, ఇప్పుడు కూడా ఆయన చంద్రబాబు Chandrababu) ట్రాప్ లో పడ్డారని అమరనాద్ అన్నారు.