Andhra Pradesh: ఉపాధ్యాయుడు కాదు కామాంధుడు, విద్యార్థినులకు పాఠాలు చెబుతూ తాకరాని చోట తాకుతూ వేధింపులు, పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు
ఈ ఘటన ఉయ్యూరు మండలం పెద ఓగిరాల జెడ్పీ పాఠశాలలో చోటు చేసుకుంది. ఈ పాఠశాలలో పనిచేసే సాయిబాబు గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉయ్యూరులో నివాసం ఉంటారు.
Amaravati, August 3: విద్యా బుద్దులు నేర్పించాలని గురువు దారి తప్పాడు, పాఠాలు బోధించే నెపంతో విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన ఉయ్యూరు మండలం పెద ఓగిరాల జెడ్పీ పాఠశాలలో చోటు చేసుకుంది. ఈ పాఠశాలలో పనిచేసే సాయిబాబు గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉయ్యూరులో నివాసం ఉంటారు. 9, 10 తరగతులకు గణితం బోధిస్తారు. పాఠాలు బోధించే క్రమంలో విద్యార్థినులతో ప్రేమగా ఉన్నట్లు నటిస్తూ తాకరాని ప్రదేశాల్లో (misbehaving with students) చేతులు వేస్తున్నారు.రోజూ ఇలాగే ప్రవర్తిస్తుండటంతో భరించలేక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు.
సోమవారం సాయంత్రం పాఠశాలకు చేరుకున్న తల్లిదండ్రులు హెచ్‌ఎం సుధారాణికి ఫిర్యాదు చేసి ఘటనపై నిలదీశారు. హెచ్‌ఎం చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ క్రమంలో ఉపాధ్యాయుడు ఉడాయించటంతో దీనిపై తల్లిదండ్రులు ఉయ్యూరు రూరల్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఘటనపై మంగళవారం కేసు (School teacher booked ) నమోదు చేసిన పోలీసులు సదరు ఉపాధ్యాయుడుపై అసభ్యకర ప్రవర్తన, పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు.
హెచ్‌ఎం పైనా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి ఆందోళన చేశారు. ఎంఈఓ కనకమహాలక్ష్మి, రూరల్ ఎస్‌ఐ రమేష్ పాఠశాలకు వచ్చి విచారణ చేపట్టారు. సమగ్ర విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఎంఈఓ కనకమహాలక్ష్మి తెలిపారు. ఉపాధ్యాయుడు సాయి బాబును సస్పెండ్ చేస్తూ డీఈఓ తాహెరా సుల్తానా మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.