SEC Ramesh Kumar: అన్ని పర్యటనలు రద్దు, ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, అధికారుల బదిలీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్న ఎస్ఈసీ
పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు, నిర్వహణపై సోమవారం సంబంధిత జిల్లాల అధికారులతో ఎస్‌ఈసీ (SEC Ramesh Kumar) సమీక్ష నిర్వహించాల్సి ఉండగా, ఆయనకు కంటి ఇన్ఫెక్షన్ కారణంగా ఈ పర్యటన రద్దు అయ్యింది. నేడు కంటి పరీక్షల కోసం హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి (lv prasad Hosptal for Eye treatment) నిమ్మగడ్డ వెళ్లనున్నారు.
Amaravati, Feb 8: ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ వైఎస్సార్ జిల్లా పర్యటన చివరి నిముషంలో వాయిదా పడింది. పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు, నిర్వహణపై సోమవారం సంబంధిత జిల్లాల అధికారులతో ఎస్‌ఈసీ (SEC Ramesh Kumar) సమీక్ష నిర్వహించాల్సి ఉండగా, ఆయనకు కంటి ఇన్ఫెక్షన్ కారణంగా ఈ పర్యటన రద్దు అయ్యింది. నేడు కంటి పరీక్షల కోసం హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి (lv prasad Hosptal for Eye treatment) నిమ్మగడ్డ వెళ్లనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా విజయనగరం మినహా మిగిలిన 12 జిల్లాల పరిధిలో తొలి విడతలో 2,723 గ్రామ పంచాయతీల్లో మంగళవారం పోలింగ్ జరగనుంది. ఉదయం 6.30 గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మినహా మిగిలిన చోట్ల మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 గంటల వరకే పోలింగ్ నిర్వహిస్తారు. ఆయా గ్రామాల్లో అభ్యర్థుల ప్రచారం ఆదివారం రాత్రి 7.30 గంటలతో ముగిసిందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం ప్రకటించింది.
కాగా పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పంచాయతీ ఎన్నికలు ముగిసే వరకు గృహ నిర్బంధం చేయాలని ఇచ్చిన ఆదేశాలను ఆదివారం హైకోర్టు కొట్టేసింది. ఇదిలా ఉంటే అధికారుల బదిలీకి సంబంధించి ఎస్ఈసీ నిమ్మగడ్డ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, ప్రభుత్వోద్యోగులను వారి సాధారణ పదవీకాలం పూర్తికాకుండా బదిలీ చేయటానికి వీల్లేదని.. అందుకు తగిన కారణాలు ఉండాలన్నారు. ఎన్నికల పరిశీలకుడిగా వ్యవహరిస్తున్న ఓ అధికారిని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రిలీవ్ చేశారని.. దీనికి తమ అనుమతి లేదని ఎస్ఈసీ తెలిపారు. ఎన్నికల పరిశీలకులుగా ఉన్నవారిని ఇకపై తమ అనుమతి లేకుండా బదిలీ చేయరాదని ప్రభుత్వానికి సూచించారు.
ఎవరినైనా ఒకవేళ బదిలీ చేస్తే.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243కే నుంచి 243జెడ్‌ఏ ద్వారా సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకుని వారిని మళ్లీ పాత స్థానాల్లోనే కొనసాగించేలా చేస్తామన్నారు. ఎన్నికల పరిశీలకులు, జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, పోలీసులు సహా ఎన్నికల సంఘం తరఫున బాధ్యతలు నిర్వర్తించే ఎవర్ని బదిలీ చేసినా ఈ నిబంధనలు వర్తిస్తాయన్నారు. కిషన్‌సింగ్ తోమర్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ ఆదేశాల్లో ప్రస్తావించారు.
ఎన్నికల అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటే రాష్ట్రాలు తమ ముందస్తు అనుమతి తీసుకోవాలంటూ జనవరి 15న ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. వారు ఎన్నికల సంఘం తరఫున బాధ్యతల నిర్వహణ పూర్తిచేసుకున్న తర్వాత ఏడాది వరకూ ఈ నిబంధన వర్తిస్తుందని అందులో వివరించింది. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగుల భయాందోళనలను తొలగించి..విశ్వాసాన్ని నింపేందుకు వీలుగా వారి రక్షణ కల్పించేలా మార్గదర్శకాలను జారీ చేయాలని కమిషన్ భావించిందని ఎస్ఈసీ అన్నారు.