Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి సర్వ దర్శన టోకెన్ల జారీ కేంద్రం వద్ద తోపులాట, ముగ్గురికి గాయాలు, 5 రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తూ టీటీడీ కీలక నిర్ణయం
సర్వదర్శనాల టోకెన్లు జారీ చేస్తున్న కేంద్రాల వద్ద భక్తులు భారీ సంఖ్యలో బారులు తీరారు. ఈ క్రమంలో తోపులాట జరిగి, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక నిర్ణయం తీసుకున్నది.
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. సర్వదర్శనాల టోకెన్లు జారీ చేస్తున్న కేంద్రాల వద్ద భక్తులు భారీ సంఖ్యలో బారులు తీరారు. ఈ క్రమంలో తోపులాట జరిగి, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక నిర్ణయం తీసుకున్నది. భక్తుల రద్దీతో 5 రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు (TTD cancels VIP break darshan) చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ఆదివారం వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. టోకెన్లు లేకుండానే శ్రీవారి దర్శనానికి టీటీడీ అనుమతి ఇచ్చింది.
అలిపిరి నుంచి దర్శన టోకెన్లు లేకపోయినా తిరుమలకు (Tirumala) అనుమతి ఇచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్‌మెంట్లలోకి రెండేళ్ల తర్వాత భక్తులను టీటీడీ అనుమతించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. టికెట్లు లేకున్నా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని స్పష్టం చేసింది. సర్వదర్శనం టోకెన్లు కూడా పెంచాలని టీటీడీ నిర్ణయించింది. ప్రస్తుతం రోజుకు 30 వేల టోకెన్లు జారీ చేస్తుండగా, ఆ సంఖ్యను 45 వేలకు పెంచాలని టీటీడీ నిర్ణయం తీసుకున్నది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని అధికారులు కోరారు.
Here's Video
శ్రీవారి సర్వదర్శన టోకెన్ల జారీ కేంద్రం వద్ద మంగళవారం ఉదయం భక్తుల మధ్య గోవిందరాజస్వామి సత్రాల వద్ద జరిగిన తోపులాటలో ముగ్గురికి గాయాలయ్యారు. దీంతో ఆ ముగ్గురు భక్తులను తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. పలువురు భక్తులు సొమ్మసిల్లి పడిపోయారు. రెండు రోజుల విరామం అనంతరం సర్వదర్శనం టోకెన్లను ఇవాళ జారీ చేస్తున్నారు.
ఈ క్రమంలో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. గోవిందరాజస్వామి సత్రాలు, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్‌ల వద్ద సర్వదర్శనం టోకెన్లను జారీ చేస్తున్నారు. అయితే భక్తుల తోపులాటలో క్యూలైన్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఈ మూడు కేంద్రాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు.