Tirupati Bypoll 2021 Completed: తిరుపతి ఉప ఎన్నికలో 64.29 శాతం పోలింగ్ నమోదు, అత్యధికంగా సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 72.68 శాతం, అత్యల్పంగా తిరుపతిలో 50.58 శాతం ఓటింగ్ నమోదు, మే 2వ తేదీన ఓట్ల లెక్కింపు
తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో అక్కడక్కడా స్వల్ప ఘటనలు మినహా పోలింగ్ సజావుగా (Tirupati Bypoll 2021 Completed) కొనసాగింది. ఈ ఎన్నికల్లో మొత్తంగా 64.29 శాతం పోలింగ్ (64.29 per cent polling recorded) నమోదైంది.
Tirupati, April 18: తిరుపతి లోక్‌సభా స్థానానికి జరిగిన ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో అక్కడక్కడా స్వల్ప ఘటనలు మినహా పోలింగ్ సజావుగా (Tirupati Bypoll 2021 Completed) కొనసాగింది. ఈ ఎన్నికల్లో మొత్తంగా 64.29 శాతం పోలింగ్ (64.29 per cent polling recorded) నమోదైంది. అత్యధికంగా సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 72.68 శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా తిరుపతి సెగ్మెంట్‌లో 50.58 శాతం మేరకే పోలింగ్ జరిగింది.
సాయంత్రం 7 గంటలలోపు క్యూలైన్లో ఉన్నవారికి ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం కల్పించడంతో కొన్నిచోట్ల పోలింగ్ ప్రక్రియ రాత్రి 9.30 వరకు కొనసాగింది. పార్లమెంటరీ స్థానం పరిధిలో మొత్తం 17,10,699 మంది ఓటర్లుండగా.. 2,470 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 10,99,784 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. శనివారం ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలవద్ద పెద్దసంఖ్యలో ఓటర్లు బారులు తీరారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం వరకు పోలింగ్ వేగంగానే కొనసాగింది. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు 7.80 శాతం, 11 గంటల వరకు 17.39 శాతం పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 1 గంట వరకు 36.67 శాతం, 3 గంటలకు 47.42 శాతం, 5 గంటలకు 54.99 శాతం, రాత్రి 7 గంటలకు 64.29 శాతం పోలింగ్ నమోదైంది.
అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా (Tirupati Lok Sabha Bypoll Election 2021) చూస్తే.. నెల్లూరు జిల్లాలోని గూడూరు నియోజకవర్గంలో 63.81 శాతం, సర్వేపల్లిలో 66.19 శాతం, సూళ్లూరుపేటలో 70.93 శాతం, వెంకటగిరిలో 61.50 శాతం, చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో 50.58 శాతం, శ్రీకాళహస్తిలో 67.77 శాతం, సత్యవేడులో 72.68 శాతం చొప్పున పోలింగ్ నమోదైనట్లు రిటర్నింగ్ అధికారి కేవీఎన్ చక్రధర్‌బాబు తెలిపారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం మన్నసముద్రం గ్రామంలో ఓటు వేసిన వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి, అతని కుటుంబసభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల పోలింగ్ సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. బీఎస్‌ఎఫ్, స్ట్రైకింగ్ ఫోర్స్, ప్రత్యేక బలగాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన బలగాలతో సమ్యస్యాత్మక కేంద్రాల్లో పకడ్బందీగా పోలింగ్ చేపట్టారు. పోలింగ్ పూర్తయిన వెంటనే ఆయా పోలింగ్ కేంద్రాల నుంచి బందోబస్తు నడుమ ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లకు చేర్చారు. తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల ఈవీఎంలను తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కళాశాల స్ట్రాంగ్ రూమ్‌కు చేర్చారు.
సూళ్లూరుపేటకు సంబంధించి నాయుడుపేట బాలికల జూనియర్ కళాశాల వసతి గృహం, గూడూరు నియోజకవర్గానికి సంబంధించి గూడూరు పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల, వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి విశ్వోదయ పాత డిగ్రీ కళాశాల, సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి నెల్లూరు నగరంలోని డీకేడబ్ల్యూ మహిళా కళాశాల్లోని స్ట్రాంగ్ రూమ్‌ల్లో భద్రపరిచారు.
ఆదివారం ఉదయం సర్వేపల్లి మినహా మిగతా మూడు నియోజకవర్గాల్లోని స్ట్రాంగ్‌రూమ్‌ల్లో భద్రపరిచిన ఈవీఎంలను నెల్లూరులోని డీకేడబ్ల్యూ మహిళా కళాశాలకు తరలిస్తారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. సీఆర్‌పీఎఫ్ పోలీసు బలగాల అధీనంలో ఈ స్ట్రాంగ్‌రూమ్‌లు 24 గంటలు ఉండనున్నాయి. ఈ కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి జిల్లా అధికారులు వెబ్‌కాస్టింగ్‌కు అనుసంధానం చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. మే 2వ తేదీన ఓట్ల లెక్కింపు ఈ కేంద్రంలోనే జరుగుతుంది.
ఉపఎన్నిక ప్రశాంతం: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కె.విజయానంద్
తిరుపతి లోక్‌సభ స్థానానికి శనివారం జరిగిన ఉప ఎన్నిక పోలింగ్ పటిష్ట బందోబస్తు ఏర్పాట్ల మధ్య ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కె.విజయానంద్ తెలిపారు. శనివారం రాత్రి పదిన్నర గంటల వరకు తమకు అందిన సమాచారం మేరకు 64.29 శాతం పోలింగ్ నమోదైందని చెప్పారు. పోలింగ్ ముగిసే సమయానికి అంటే రాత్రి ఏడు గంటలకు ఆయా పోలింగ్ కేంద్రాల్లో క్యూలైనులో ఉన్నవారందరికీ ఓటుహక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించామని చెప్పారు. దీంతో తుది పోలింగ్ శాతానికి సంబంధించి రిటర్నింగ్ అధికారుల నుంచి పూర్తి నివేదిక అందాల్సి ఉందన్నారు.
ఉప ఎన్నికలు సజావుగా జరిగాయి : డీజీపీ డి.గౌతమ్ సవాంగ్
తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికలు సజావుగా జరిగాయని, ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల విధుల్లో రాష్ట్ర పోలీస్ బలగాలతోపాటు 69 ప్లటూన్ల కేంద్ర బలగాలు పాలుపంచుకున్నాయని తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో బయట వ్యక్తులు, వాహనాలు రాకుండా తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ సరిహద్దుల్లో కఠిన చర్యలు తీసుకున్నామని వివరించారు. అనుమతి లేకుండా వచ్చిన 250పైగా వాహనాలను తిప్పి పంపించామన్నారు.
ఉప ఎన్నిక నేపథ్యంలో 33,966 మందిని బైండోవర్ చేశామన్నారు. రూ.76,04,970 నగదును, 6,884 లీటర్ల మద్యాన్ని, 94 వాహనాలను సీజ్ చేసినట్టు తెలిపారు. ఉద్దేశపూర్వకంగా శాంతిభద్రతలకు భంగం కలిగిస్తారనే సమాచారం మేరకు అనుమానితులపైన నిరంతర నిఘాను ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏ సమస్య తలెత్తినా తక్షణమే డయల్ 100, 112 ద్వారా సమాచారమివ్వాలని ప్రచారం చేసినట్టు చెప్పారు.
పెద్ద సంఖ్యలో దొంగ ఓట్లు: చంద్రబాబు
తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా పెద్ద సంఖ్యలో దొంగ ఓట్లు వేస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఇవాళ తిరుపతిలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందని, ఇక్కడికి భారీగా బయటి వ్యక్తులు వచ్చారని ఆరోపణలు చేశారు. బందిపోట్లను తలపించేలా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని విమర్శించారు. పోలింగ్ నేపథ్యంలో సరిహద్దులు మూసేసి, తనిఖీలు చేసి పంపించాల్సిందని అన్నారు. కానీ పోలీసులు ఎందుకు చెక్ పోస్టులు ఎత్తివేశారని ప్రశ్నించారు. ఇతర ప్రాంతాల నుంచి వేలమంది వస్తే పోలీసులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు, అధికారులు ఉన్నది జగన్ అనే వ్యక్తి కోసం కాదని... పోలీసులు, అధికారులు ప్రజాస్వామ్యం కోసం పనిచేయాలని హితవు పలికారు.
మంత్రి పెద్దిరెడ్డికి చెందిన పీఎల్ఆర్ కన్వెన్షన్ సెంటర్ లో వేలమందిని ఉంచారని చంద్రబాబు ఆరోపించారు. బయటి వ్యక్తులు తిరుపతిలో ఉంటే పోలీసులు ఎందుకు గుర్తించలేదని నిలదీశారు. దొంగ ఓటర్లను పట్టుకున్న టీడీపీ నేతలపై కేసులు పెట్టారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పుంగనూరుకు చెందిన పెద్దిరెడ్డి తిరుపతిలో ఎందుకున్నారని ప్రశ్నించారు. తిరుపతి ప్రాంతానికి పెద్ద సంఖ్యలో జనాన్ని తీసుకువచ్చి పర్యాటకులు అంటున్నారని విమర్శించారు.
ఉప ఎన్నిక పోలింగ్ కోసం కేంద్రం పంపిన బలగాలు ఏమయ్యాయి? వెబ్ కాస్టింగ్ నిర్వహణ ఏమైంది? మేం వందలమందిని రెండ్ హ్యాండెడ్ గా పట్టించాం అని అన్నారు. తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా చోటు చేసుకుంటున్న అన్ని అక్రమాలపై ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. విపక్షాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తుంటే, వైసీపీ మాత్రం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని విమర్శించారు.
పోలీసులు, పోలింగ్ సిబ్బంది ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యంపై నమ్మకం కలిగించే బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. తిరుపతి అసెంబ్లీ స్థానం పరిధిలో జరిగిన పోలింగ్ అక్రమాల మయం అని, ఇక్కడి పోలింగ్ ను రద్దు చేయాలని కోరుతున్నామని తెలిపారు. పూర్తిగా కేంద్ర బలగాలు, సిబ్బందితో మళ్లీ పోలింగ్ నిర్వహించాలని, తద్వారా ప్రజల్లో విశ్వాసం కలిగించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని, పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైందని అన్నారు.