Tirupati Bypoll 2021: దొంగ ఓట్ల కలకలం, తిరుపతి ఉప ఎన్నిక రద్దు చేయాలని కోరిన చంద్రబాబు, టీడీపీ డ్రామాలాడుతోందని మంత్రి పెద్దిరెడ్డి మండిపాటు, నకీలీ ఓటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపిన ఎస్ఈసీ విజయానంద్, ప్రశాంతంగా ఉప ఎన్నిక కొనసాగుతుందని తెలిపిన డీజీపీ సవాంగ్
Assembly Elections 2021- Representational Image | (Photo-PTI)

Tirupati, April 17: తిరుపతి ఉప ఎన్నికలో దొంగ ఓట్ల అంశం కలకలం రేపుతోంది. దీనిపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య వార్ (Tirupati Lok Sabha Bypoll Election 2021 Updates) నడుస్తోంది. కాగా తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికలో ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్ నమోదైంది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ఠ మైన భద్రత ఏర్పాటు చేశారు.‌

ఇక ప‌లు చోట్ల అవ‌క‌త‌వ‌క‌లు జ‌రుగుతున్నాయంటూ ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారికి టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు లేఖ రాశారు. తిరుప‌తి పార్ల‌మెంట‌రీ నియోజ‌క వ‌ర్గంలోకి బ‌య‌టి వ్య‌క్తులు భారీగా చొర‌బ‌డ్డార‌ని ఆయ‌న ఫిర్యాదు చేశారు. పార్లమెంట్ ఉప ఎన్నికలో భాగంగా.. తిరుపతి అసెంబ్లీ స్థానం పరిధిలోని పోలింగ్‌ను రద్దు చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు.

ఈ నకిలీ ఓట్లపై ప్రధాన ఎన్నికల అధికారి విజయానంద్ స్పందించారు. చిత్తూరు, నెల్లూరు కలెక్టర్లు, ఎస్పీలు, రిటర్నింగ్ అధికారులతో విజయానంద్ మాట్లాడారు. నకిలీ ఓట్లు వేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఈసీ అదేశించారు. తిరుపతి ఉపఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని ఆయన సూచించారు.

తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గంలో ప్రశాంతంగా పోలింగ్ (Tirupati Lok Sabha Bypoll Election 2021) జరుగుతుందని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. శనివారం డీజీపీ మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి ఎన్నిక ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. రాష్ట్ర పోలీస్ బలగాలతో పాటు 69 ప్లటూన్ల కేంద్ర బలగాలతో భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని తెలిపారు.

కొనసాగుతున్న తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్, మొరాయిస్తున్న ఈవీఎంలు, ఎన్నికల విధులకు హాజరైన ఉద్యోగి గుండెపోటుతో మృతి, ఓటు హక్కును వినియోగించుకున్న పలువురు ప్రముఖులు

సరిహద్దుల్లో బయట వ్యక్తులు, వాహనాలు రాకుండా కఠిన చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. ఇప్పటికే సుమారు 250పైగా వాహనాలను తిప్పి పంపామన్నారు. ఉద్దేశపూర్వకంగా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తారనే సమాచారంతో... అనుమానితులపై నిరంతర నిఘాను ఏర్పాటు చేశామని డీజీపీ సవాంగ్ తెలిపారు. 33,966 మందిని బైండోవర్ చేశామన్నారు. 76 లక్షల నగదు, 6884 లీటర్ల మద్యం సీజ్, 94 వాహనాలు జప్తు చేసినట్లు డీజీపీ సవాంగ్‌ పేర్కొన్నారు.

నెల్లూరు జిల్లాలోని కలువాయి మండలం పేరంకొండ పోలింగ్ కేంద్రంలో కరోనా కలకలం సృష్టించింది. పోలింగ్ అధికారికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో పోలింగ్ ప్రక్రియ ప్రస్తుతానికి ఆగిపోయింది. ప్రస్తుతం ఆ పోలింగ్ అధికారిని ప్రత్యేక గదిలో ఉంచారు. ఈ విషయం పోలింగ్ కేంద్రం బయట బారులు తీరిన జనాలకు తెలియడంతో లోనికి వెళ్లాలంటే భయపడిపోతున్నారు. వెంటనే రంగంలోకి దిగిన శానిటైజేషన్ సిబ్బంది గ్రామంలో శానిటేషన్ చేస్తున్నారు. అయితే పోలింగ్ మధ్యాహ్నం తర్వాత మళ్లీ తిరిగి ప్రారంభం అవుతుందా..? లేకుంటే పూర్తిగా ఆపేస్తారా..? అనేది తెలియరాలేదు.

15 నిమిషాల్లో ఆరుమందిని ఇష్టం వచ్చినట్లు నరికిన కిరాతకుడు, వరుస హత్యలతో ఉలిక్కిపడిన జుత్తాడ గ్రామం, వివాహేతర సంబంధం, ఆస్తి గొడవలే కారణమంటున్న పోలీసులు, ఘటనపై తీవ్రంగా స్పందించిన ఏపీ ప్రభుత్వం, నిందితుడి అప్పలరాజుకి 14 రోజుల రిమాండ్

ఓ పోలింగ్ కేంద్రం వద్ద దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని బీజేపీ అభ్యర్థి రత్నప్రభ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె.. తిరుపతి లోకసభ ఎన్నికల్లో వైసీపీ నాయకులు దొంగ ఓట్లను యథేచ్ఛగా వేస్తున్నారని ఆరోపణలు చేశారు. దీనిపై పోలీసులతో పాటు ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేశామని రత్నప్రభ వెల్లడించారు. కాగా.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కన్వెన్షన్ సెంటర్‌లో దొంగ ఓటర్లు ఉన్నారని ఉదయం నుంచీ వార్తలొస్తున్నాయి. వందలాది వాహనాల్లో ఇతర ప్రాంతాల నుంచి దొంగ ఓటర్లు వచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ఈ అంశంపై మంత్రి పెద్ది రెడ్డి (Peddireddi Ramachandra Reddy) స్పందించారు. దొంగ ఓట్ల పేరుతో తెలుగుదేశం డ్రామాలు ఆడుతోందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయంతో ప్లాన్‌ ప్రకారమే ఆరోపణలు చేస్తున్నారని పెద్దిరెడ్డి చెప్పారు. తిరుపతి పుణ్యక్షేత్రం.. చాలా ప్రైవేటు బస్సులు వస్తుంటాయన్నారు. బస్సుల్లో వెళ్లే ప్రయాణికులను టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

టీడీపీ కుట్రలపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. తనపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోనని టీడీపీ నాయకులను హెచ్చరించారు. దొంగ ఓట్ల పేరుతో టీడీపీ డ్రామాలు ఆడుతోందన్నారు. ప్రజల్లో బలంలేక టీడీపీ నాటకాలు ఆడుతోందన్నారు. తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి ప్రజలే బుద్ధి చెబుతారని పెద్దిరెడ్డి పేర్కొన్నారు.

త‌న‌పై ఇష్టం వచ్చినట్లు ఆరోప‌ణ‌లు చేస్తే ఊరుకోనని చెప్పారు. రాజకీయ లబ్ధి కోసమే త‌మ‌పై ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని తెలిపారు. ఓటమి భయంతోనే టీడీపీ అధినేత‌ చంద్రబాబు నాయుడు కుట్రలకు పాల్ప‌డుతున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. త‌న‌పై నారా లోకేశ్ చేస్తోన్న ఆరోప‌ణ‌లు స‌రికాద‌ని చెప్పారు.

తిరుమల దర్శనం కోసం ప్రైవేట్ బస్సుల్లో వచ్చిన భక్తులను టీడీపీ అడ్డుకుంటుందని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్‌కు వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దొంగ ఓటర్లంటూ ఆందోళన చేస్తూ ఓటర్లను టీడీపీ తప్పుదోవ పట్టిస్తోందని వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా మాజీ ఛైర్మన్ నరసింహయాదవ్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

ఇక ఓ వార్తా చానెల్‌లో వ‌చ్చిన వీడియోను పోస్ట్ చేస్తూ వైసీపీ నేత‌ల‌పై టీడీపీ నేత నారా లోకేశ్ విమ‌ర్శ‌లు చేశారు. 'పుంగ‌నూరు వీర‌ప్ప‌న్ పెద్దిరెడ్డి.. ఎర్ర‌చంద‌నం చెట్ల‌ను న‌రికేస్తున్న‌ట్టే ప్ర‌జాస్వామ్యాన్నీ ఖూనీ చేస్తున్నాడు. తిరుపతి పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గానికి బ‌య‌టి నుంచి త‌న ముఠాల‌ను తీసుకొచ్చి పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేయిస్తున్నాడు' అని ఆరోపించారు.

'పెద్దిరెడ్డి మ‌నుషులు 5 వేల మంది పెద్దిరెడ్డికే చెందిన పీఎల్ఆర్ క‌ల్యాణ మండపంలో మ‌కాం వేసి దొంగ ఓట్లు వేయ‌డానికి వెళ్తుంటే టీడీపీ నాయ‌కులు అడ్డుకున్నారు. రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ప‌ర్య‌వేక్ష‌ణ‌లో జ‌రిగిన పంచాయ‌తీ, మున్సిప‌ల్‌, ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో పోలీసులు అధికార యంత్రాంగాన్ని వాడుకుని ఎల‌క్ష‌న్ జ‌ర‌గ‌కుండా సెల‌క్ష‌న్ చేయించుకున్న మంత్రి పెద్దిరెడ్డి.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న తిరుపతి ఎన్నిక‌ని అక్ర‌మార్గంలో గెల‌వాల‌ని నేరుగా తానే రంగంలోకి దిగారు' అని లోకేశ్ విమర్శించారు.

పొదలకూరు మండలం తోడేరు గ్రామంలో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రశాంత వాతావరణంలో పోలింగ్ పక్రియ జరుగుతోందన్నారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఏడు నియోజకవర్గాల పరిధిలో సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ఎక్కువ పోలింగ్ శాతం నమోదైందని కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు.

తిరుపతి పార్లమెంట్‌ ఉపఎన్నికలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు వరకు పోలింగ్‌

సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలో 38.1 శాతం

గూడూరు నియోజకవర్గ పరిధిలో 36.84 శాతం

సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలో 40.76 శాతం

వెంకటగిరి నియోజకవర్గ పరిధిలో 35 శాతం

తిరుపతి నియోజకవర్గ పరిధిలో 24 శాతం

శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో 35 శాతం

సత్యవేడు నియోజకవర్గ పరిధిలో 36 శాతం