Tirupati Lok Sabha Bypoll 2021: కొనసాగుతున్న తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్, మొరాయిస్తున్న ఈవీఎంలు, ఎన్నికల విధులకు హాజరైన ఉద్యోగి గుండెపోటుతో మృతి, ఓటు హక్కును వినియోగించుకున్న పలువురు ప్రముఖులు
Polls 2021 | (Photo-PTI)

Tirupati, April 17: తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నిక పోలింగ్ (Tirupati Lok Sabha Bypoll Election 2021) ఉదయం 7 గంటలకే మొదలైంది. ఈ పోలింగ్‌.. సాయంత్రం 7 గంటల వరకు జరగనుంది. కోవిడ్‌ పాజిటివ్‌ లక్షణాలున్న ఓటర్లు ఓటు వేయడానికి సాయంత్రం ఆరు గంటల నుంచి అనుమతిస్తారు. గతంలో ప్రతి 1,500 మందికి ఒక పోలింగ్‌ బూత్‌ ఉండగా క్యూలైన్లలో ఒత్తిడిని తగ్గించడానికి ఇప్పుడు ప్రతి 1,000 మందికి ఒక పోలింగ్‌ బూత్‌ ఏర్పాటు చేశారు. పోటీలో ఉన్న 28 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 17,11,195 మంది ఓటర్లు తేల్చనున్నారు. 2,470 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. బరిలో 28 మంది అభ్యర్థులు ఉన్నారు.

ఎన్నికల విధులకు హాజరైన ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందారు. చిట్టమూరు మండలం అరవపాలెం దళితవాడ పోలింగ్ బూత్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఎన్నిక‌ల విధుల్లో ఉన్న ఏపీవో ఏంబేటి ర‌వి మృతి చెందారు. చాతిలో నొప్పి రావడంతో పోలింగ్ కేంద్రంలోనే కుప్పకూలిపోయాడు. అప్రమత్తమైన తోటి అధికారులు ఆస్పత్రి తరలించగా మార్గమధ్యలోనే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా.. సూళ్లూరుపేట మండంలోని నూకలపాలెంలో ఉపాధ్యాయుడిగా రవి విధులు నిర్వహిస్తున్నారు. ఆయన మృతితో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మానవత్వాన్ని చాటుకున్న తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తి, ప్రమాదంలో గాయపడిన వారికి ప్రథమచికిత్స, ఈ నెల 17న తిరుపతికి ఉప ఎన్నిక, మే 2న ఫలితం

శ్రీకాళహస్తిలో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. మన్నసముద్రంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డా.గురుమూర్తి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, సత్యవేడులో ఎమ్మెల్యే ఆదిమూలం ఓటు వేశారు. సత్యవేడులో రెండు ఈవీఎంలలో సాంకేతిక లోపం గుర్తించి అధికారులు సరిచేశారు. ఇప్పంతాంగాలు, తిరుమట్టియం కేంద్రాల్లో పోలింగ్ ప్రారంభమైంది.

సత్యవేడులో పోలింగ్‌ బూత్ వద్ద ఓటర్లు క్యూ కట్టారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ఠ మైన భద్రత ఏర్పాటు చేశారు. మూడు ప్రదేశాలలో ఈవీఎంలు మొరాయించాయి. వాటిని మార్చి అధికారులు పోలింగ్‌ ప్రారంభించారు. సత్యవేడు పోలింగ్‌ బూత్‌ను ఎమ్మెల్యే ఆదిమూలం పరిశీలించారు.

గూడూరులోని 47,48,49 కేంద్రాల్లోని సాంకేతిక లోపంతో ఈవీఎంలు మొరాయించాయి. అగ్రహారం పుత్తూరులో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాదలూరులో కిలివేటి సంజీవయ్య ఓటు వేశారు.

చంద్రబాబుపై తిరుపతిలో నేనే చొక్కా విసిరేశాను, ఆయన వల్ల నాకు ప్రాణ హాని ఉంది, తిరుపతి వెస్టు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆకుల వెంకటేశ్వరరావు, అచ్చెన్నాయుడుతో సంభాషణ వీడియోను లీక్ చేసిన వ్యక్తి ఇతనే..

చిత్తూరు జిల్లాలోని 3 అసెంబ్లీ నియోజకవర్గాల (Tirupati Lok Sabha Bypoll ) పరిధిలో 1,056 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లాలోని 4 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 1,414 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉప ఎన్నిక విధుల్లో మొత్తం 10,850 మంది సిబ్బందిని నియమించారు. ఈ ఏడు నియోజకవర్గాల పరిధిలో 2,470 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం ఓటర్ల సంఖ్య 17,11,195 మంది కాగా.. వీరిలో మహిళలు 8,38,540 మంది. పురుష ఓటర్లు 8,71,942 మంది, 216 మంది థర్డ్‌ జెండర్స్‌, 497మంది సర్వీస్‌ ఓటర్లు ఉన్నారు. 466 సమస్యాత్మక ప్రాంతాల్లో 877 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించారు. 1,241 వెబ్‌ కాస్టింగ్‌ సెంటర్లు, 475మంది వీడియోగ్రాఫర్లు, 816 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. 10,796 మంది పోలింగ్‌ సిబ్బంది, 13,827 పోలీసు సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నారు.

తిరుపతి పార్లమెంట్ పరిధిలో నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట అసెంబ్లీ సెగ్మెంట్లు, చిత్తూరు జిల్లాలోని తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు సెగ్మెంట్లు ఉన్నాయి. సీఎం జగన్మోహన్‌రెడ్డికి వ్యక్తిగత ఫిజియోథెరపిస్టు డాక్టర్‌ గురుమూర్తి వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉండగా.. టీడీపీ తరఫున కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా కర్ణాటక మాజీ సీఎస్‌ రత్నప్రభ, కాంగ్రెస్‌ నుంచి చింతా మోహన్‌, సీపీఎం తరఫున నెల్లూరు యాదగిరి సహా మొత్తం 28 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

ఈ ఎన్నికలను అమరావతి సచివాలయంలో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ద్వారా పర్యవేక్షిస్తామని, ఇందుకోసం అదనపు సిబ్బందిని నియమించామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి విజయానంద్‌ తెలిపారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పర్యవేక్షించడానికి 23 కంపెనీల కేంద్ర బలగాలు, 37 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలను నియమించినట్లు చెప్పారు. ఈ ఎన్నికలను పరిశీలించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ముగ్గురు అబ్జర్వర్లను నియమించింది.

దినేష్పాటిల్‌ సాధారణ అబ్జర్వర్‌గా, రాజీవ్‌కుమార్‌ పోలీసు అబ్జర్వర్‌గా, ఆనందకుమార్‌ ఎన్నికల వ్యయ అబ్జర్వర్‌గా నియమితులయ్యారు. వీరికి అదనంగా 816 మంది మైక్రో అబ్జర్వర్లు ఎన్నికల తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. దివ్యాంగులు, వృద్ధులు ఇబ్బందులు పడకుండా ఓటువేసే విధంగా ఏర్పాట్లు చేశామని విజయానంద్‌ చెప్పారు. అందరూ స్వేచ్ఛగా వచ్చి ఓటు వేయాల్సిందిగా కోరారు.