
Tirupati, April 14: తిరుపతిలో రాజకీయం వేడెక్కింది. ఎవరికి వారే ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక తిరుపతి ఎంపీ స్థానానికి వైసీపీ నుంచి డా. గురుమూర్తి (Dr Gurumoorthy YSRCP) పోటీ చేస్తున్న సంగతి విదితమే. ఆయన స్వతహాగా ఫిజియోథెరపిస్ట్. ఇప్పుడు ఆయన ప్రమాదంలో గాయపడిన వారికి ప్రథమచికిత్స చేసి మానవత్వం చాటుకున్నారు. బుధవారం వెంకటగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని ఎంపీ ఆభ్యర్ధి గురుమూర్తి, హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాదవ్ శ్రీకాళహస్తి ప్రచారానికి బయలుదేరారు.
మార్గం మధ్యలో ఏర్పేడు వద్ద ఓ ద్విచక్ర వాహనం అదుపు తప్పి పడిపోయి ఉండటాన్ని గమనించారు. ఈ రోడ్డు ప్రమాదాన్ని చూసి మనసు చెలించిపోయిన ఎంపీ అభ్యర్థి గురుమూర్తి (YSRCP MP Tirupati Candidate Gurumurthy), హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌లు వారికి సహాయం చేయటానికి పూనుకున్నారు. డా.గురుమూర్తి రంగంలోకి దిగి గాయపడిన వారికి ప్రథమ చికిత్స చేశారు. అనంతరం అంబులెన్సులో దగ్గరలోని ఆసుపత్రికి పంపారు.
కాగా సాధారణ ఫిజియోథెరపిస్ట్ అయిన గురుమూర్తి మొదటి నుంచి వైఎస్సార్ కుటుంబానికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉంటూ వస్తున్నారు. వైసీపీ పెట్టినప్పటి నుంచి సీఎం జగన్ వెంట సామాన్య కార్యకర్తగా పని చేస్తూ వస్తున్నారు. ఫిజియోథెరపిస్ట్ కెరీర్‌నే వదులుకుని వైఎస్ ఫ్యామిలీ వెంట నిలిచారు. జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లిన సమయంలో ఆయన సోదరి షర్మిల రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టగా ఆమె వెంటే నిలిచారు.
ఆ తర్వాత ప్రతిపక్ష నేతగా జగన్ పాదయాత్ర చేపట్టగా, వ్యక్తిగత ఫిజియోథెరపిస్ట్‌గా గురుమూర్తి ఆయన వెంటే రాష్ట్రమంతా తిరిగారు. దీంతో సీఎం జగన్‌కు గురిమూర్తి అంటే ప్రత్యేక అభిమానం ఉందని అందరూ చెబుతుంటారు. పలు సందర్భాల్లో మంచి స్థానంలో నిలబెడతానని సీఎం జగన్ గురుమూర్తికి చెప్పారని తెలుస్తోంది. అందులో భాగంగానే తిరుపతి ఎంపీ స్థానానికి బరిలో నిలిపారని వార్తలు వస్తున్నాయి.
తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి ఉప ఎన్నిక పోలింగ్ ఏప్రిల్ 17న జరగనున్న సంగతి తెలిసిందే. ఐదు అసెంబ్లీ ఎన్నికలతోపాటు తెలుగు రాష్ట్రాలలో రెండు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఏపీలో తిరుపతి లోక్‌సభ సీటుతోపాటు తెలంగాణలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ సెగ్మెంటుకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఉప ఎన్నికల ఫలితాలు మే 2న వెలువడనున్నాయి.