Special Darshan Cancelled in Tirumala: వైకుంఠద్వార దర్శనానికి తిరుమల వెళ్తున్నారా? టీటీడీ కొత్త నిబంధనలు ఇవే! పలు దర్శనాలు రద్దు
ఈ నేపథ్యంలో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యమిస్తూ పలు నిర్ణయాలు తీసుకుంది. దర్శన టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తామని స్పష్టం చేసింది
Tirumala, DEC 14: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయంలో జనవరి 10 నుంచి 19వ తేది వరకు వైకుంఠ ద్వార దర్శనాలకు (Vaikuntha Dwara Darshan) టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యమిస్తూ పలు నిర్ణయాలు తీసుకుంది. దర్శన టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తామని స్పష్టం చేసింది. టోకెన్లు లేని భక్తులను తిరుమలకు అనుమతిస్తామని, దర్శనం అవకాశం ఉండదని వెల్లడించింది. ఈ పది రోజుల పాటు చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ శాఖ, ఎన్ఆర్ఐ మొదలైన విశేష దర్శనాలు(Special Darshan) రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు (VIP Break Darshan) రద్దు చేస్తున్నామన్నారు. భారీ క్యూలైన్లు నివారించి గరిష్ట సంఖ్యలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు చేయించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు. గోవిందమాల ధరించిన భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవని తెలిపారు.
భక్తులకు కేటాయించిన టైంస్లాట్ ప్రకారమే క్యూలైన్ల వద్దకు చేరుకోవాలని , మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ బ్యూరోక్రాట్లు, మాజీ చైర్మన్ లను వైకుంఠ ఏకాదశి రోజున దర్శనాలకు అనుమతించబోమని స్పష్టం చేశారు. 3వేల మంది యువ శ్రీవారి సేవకులను, అవసరమైన మేరకు యువ స్కౌట్స్, గైడ్స్ ను నియమించుకుని వారి సేవలను క్యూలైన్ల నిర్వహణకు వినియోగించుకోనున్నట్లు అధికారులు వివరించారు.