Andhra Pradesh: మీరిచ్చిన ప్రతి పైసాకు లెక్క ఉంది, సిగ్గు లేకుండా బ్రాందీ బుడ్డి 75 రూపాయలకే ఇస్తామంటున్నారు, ముందు పెట్రోల్, డీజీల్ రేట్లపై మాట్లాడండి, బీజేపీ నేతల వ్యాఖ్యలపై వైసీపీ మంత్రులు మండిపాటు
ఏపీలో ఉనికి కోసమే బీజేపీ విజయవాడలో బహిరంగ సభ (Prajagraha Sabha) నిర్వహిస్తోందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (State Municipal Minister Botsa Satyanarayana) ఎద్దేవా చేశారు.
Amaravati, Dec 28: ఏపీ ప్రభుత్వంపై బీజేపీ నేతలు ప్రజాగ్రహ సభ వేదికగా చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మంత్రులు (YSRCP Ministers) మండిపడ్డారు. ఏపీలో ఉనికి కోసమే బీజేపీ విజయవాడలో బహిరంగ సభ (Prajagraha Sabha) నిర్వహిస్తోందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (State Municipal Minister Botsa Satyanarayana) ఎద్దేవా చేశారు. దేశంలో బీజేపీ అధికారంలో ఉన్నా.. ఏపీలో ఆ పార్టీ లేదన్నారు. రాజకీయ పార్టీ కాబట్టి బహిరంగ సభ నిర్వహించుకుంటోందన్నారు. విజయవాడలో మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో మేము కూడా ఉన్నామని చెప్పుకోవడానికి తాపత్రయపడుతూ బీజేపీ ఈ రోజు సభ నిర్వహిస్తోందన్నారు.
ఉనికి కాపాడుకోవడానికి పెట్టే సభ తప్ప ఏమీ ఉపయోగం లేదన్నారు. గత నాలుగురోజులగా బీజేపీ నేతలు (BJP Leaders) ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆధ్వర్యంలోనే నీతి ఆయోగ్ రాష్ట్రాలకి ర్యాంకులు ఇచ్చిందని.. బీజేపీ పరిపాలిస్తున్న ఉత్తరప్రదేశ్ ఏ ర్యాంకులో ఉంది.. మన రాష్ట్రం ఏ ర్యాంకులో ఉందో చూసామన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రం ఎందుకు వెనుకుబాటులో ఉందో ముందు దానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఓటిఎస్ అనేది స్వచ్ఛంద పథకం.. ఎవరిపై బలవంతం లేదని పదే పదే చెబుతున్నా తప్పుడు విమర్శలు చేస్తున్నారని మంత్రి బొత్స అన్నారు.
బీజేపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని (Minister Perni Nani) మండిపడ్డారు. బీజేపీ నేతలవి ఓట్ల రాజకీయాలు అంటూ నిప్పులు చెరిగారు. బీజేపీ నేతలు.. చంద్రబాబు ఎజెండా అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. పెరుగుతున్న డీజిల్, పెట్రోలు ధరలపై బీజేపీ నేతలు బాధపడాలి. పెరుగుతున్న ఎరువుల రేట్లపై బీజేపీ నేతలకు బాధలేదా?. ఎక్కడ్నుంచో పిలుపు వస్తే.. ఇక్కడ సభ పెడతారు. ప్రజా సమస్యలపై బీజేపీకి దృష్టి లేదు. ప్రజాగ్రహ సభలో పెట్రోల్, డీజీల్ రేట్లపై మాట్లాడాలని’’ మంత్రి పేర్ని నాని హితవు పలికారు.
ఏపీ బీజేపీ ప్రజాగ్రహ సభ అంటూ పెద్ద ప్రహాసనానికి తెరలేపింది. బీజేపీకి ఏపీలో ఒక అజెండా, ఒక సిద్ధాంతం, ప్రజా సమస్యలపై దృష్టి ఏమీలేవు. ప్రజలు ఎవరి మీద ఆగ్రహంగా ఉన్నారు...? మీకు చంద్రబాబు ఎజెండా తప్ప మరో ఎజెండా ఉందా మీకు..? వాళ్లు ప్రభుత్వం రాగానే బ్రాందీ బుడ్డి 75 రూపాయలకే ఇస్తామని సిగ్గు లేకుండా చెప్తున్నారు. మీరు బ్రాందీ బుడ్డి గురించి బాధపడటం కాదు.. డీజిల్, పెట్రోల్ ధరల గురించి మాట్లాడండి.
మీరు పెట్టిన మీటింగులో డీజిల్, పెట్రోల్ గురించి మాట్లాడండి. పెరిగిన ఎరువుల ధరలు గురించి మీరు ఏ రోజైనా బాధ పడ్డారా...?. 2014లో ఎరువుల బస్తా రూ.800 ఉన్న ధర ఇవాళ రూ.1700కి వెళ్ళింది. రైతుల ధాన్యం కొనేది లేదంటారు...ఆంక్షలు పెడతారు. నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నందుకు మీరు బాధపడరా...?. కేంద్రమే కదా ధరలు నియంత్రణ చేయాల్సింది. రాష్ట్రాలు కేవలం బ్లాక్ మార్కెట్ పై మాత్రమే చర్యలు తీసుకోగలదు.
ఏపీ తెచ్చిన అప్పులో ప్రతి పైసాకి లెక్క ఉంది. మేము జీఎస్ డీపీలో 3 శాతం లోపు అప్పు తెస్తే గోల చేస్తున్నారు. జీడీపీలో 21 శాతం పైబడి అప్పు తెచ్చింది.. దీనికి కారణం ఎవరు..? 1.35 లక్షల కోట్ల అప్పు నేడు మన దేశానికి ఉంది. ఈ ఏడేళ్లలో 73 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చారు. మీరు ఏపీ అప్పుల గురించి మాట్లాడతారు.. మేము చట్టాలను అతిక్రమించి అప్పు తెస్తే మీరు ఊరుకునేవారా..?’’ అని పేర్ని నాని ప్రశ్నించారు.
బీజేపీ నేతల విమర్శలకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. టీడీపీ ఏజెంట్‌లు బీజేపీలో ఉండి జనాగ్రహ సభ పెట్టారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు వెనకుండి ఇదంతా నడిపిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ ఉనికే తక్కువ టీడీపీ సపోర్ట్ వల్లే ఆ పార్టీ ఉందనుకోవాలి. టీడీపీ నుంచి పోయిన వారే బీజేపీలో ఆపరేట్ చేస్తున్నారు. జనసేనలోనూ టీడీపీ వారే ఉండి ఆపరేట్ చేస్తున్నారు. ఏపీలో రామరాజ్యం నడుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మంచి సంబంధాలున్నాయని సజ్జల తెలిపారు.
బీజేపీపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ప్రజాగ్రహ సభలో విశాఖ స్టీల్‌ప్లాంట్, రైల్వేజోన్, ప్రత్యేక హోదా, వెనకబడిన జిల్లాలకు ప్యాకేజీపై మాట్లాడే దమ్ముందా? అని ప్రశ్నించారు. ఎందరో త్యాగాల వల్ల స్టీల్‌ప్లాంట్ ఏర్పడిందన్నారు. మహనీయుల త్యాగాలు ప్రైవేట్‌పరం కావడానికా అని మండిపడ్డారు. విభజన హామీలు ఎందుకు నెరవేర్చలేదో ప్రజలకు చెప్పాలని అన్నారు. ఏపీకి జరిగిన అన్యాయంపై మోదీ, నిర్మలాతో మాట్లాడాలని తమ్మినేని డిమాండ్ చేశారు.