Rains In AP And TS: రేపు మరో అల్పపీడనం.. ఏపీలో నేడు కూడా వర్షాలు.. తెలంగాణలోనూ రెండు రోజులు మోస్తరు వర్షాలు
దీని ప్రభావంతో నేడు దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమలలో కొన్ని చోట్లతో పాటు తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.
Hyderabad, Dec 12: ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh), తమిళనాడును (Tamilnadu) వణికించిన మాండూస్ (మాండౌస్) (Mandous) తుపాను అల్పపీడనంగా బలహీనపడి నిన్న ఉపరితల ఆవర్తనంగా మారింది. దీని ప్రభావంతో నేడు దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమ (Rayalaseema)లలో కొన్ని చోట్లతో పాటు తెలంగాణలో(Telangana) తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం ఉత్తర తమిళనాడు, దక్షిణ కర్ణాటక, ఉత్తర కేరళ మీదుగా సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇదే ప్రాంతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఏపీలో నిన్న కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉలవపాడులో అత్యధికంగా 92.75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తిరుపతి, విశాఖపట్టణం, బాపట్ల సహా పలు జిల్లాల్లో నిన్న వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు భయపెట్టాయి. తుపాను కారణంగా పలు జిల్లాల్లో వేలాది ఎకరాల్లోని పంటలు ధ్వంసమయ్యాయి. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం చిత్తూరు జిల్లాలు జలమయం అయ్యాయి. అయితే భారీ వర్షాలు ఆదివారం కాస్త తగ్గుముఖం పట్టాయి.
మరోవైపు మాండౌస్ తుపాను ఎఫెక్ట్ తెలంగాణపై కూడా ఉంది. ఆదివారం హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు పడ్డాయి. ఉదయం నుంచి ఆకాశం మేఘవృతం అయి.. అప్పుడప్పుడు చిరు జల్లులు కురిశాయి. ఈ చిరు జల్లులతో ప్రజలు అసౌకర్యానికి గురయ్యారు. నిన్న ఆదివారం అయినా చలి విపరీతంగా ఉండడంతో చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. పనుల కోసం బయటికొచ్చిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నేటి ఉదయం కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురిశాయి.
మాండౌస్ తుఫాన్ ప్రభావంతో నేడు, రేపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో తూర్పు ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అధికారులు తెలిపారు. శనివారం ఉదయం ఏర్పడిన తీవ్ర వాయుగుండం బలహీనపడి సాయంత్రానికి వాయుగుండంగా.. ఆదివారం ఉదయం తీవ్ర అల్పపీడనంగా మారిందన్నారు. ప్రస్తుతం అల్పపీడనం కూడా బలహీనపడిందని చెప్పారు. వర్షం, చలి నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.