Telangana Bandh Update: కేసీఆర్‌ని జైలుకు పంపిస్తాం, వదిలే ప్రసక్తే లేదు, జైలు నుంచి విడుదలైన బండి సంజయ్, జనవరి 10న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన బీజేపీ
రాష్ట్రంలో అక్రమ కేసులను నిరసిస్తూ, 317 జీవోను పునఃసమీక్షించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతాపార్టీ జనవరి 10న రాష్ట్ర బంద్‌కు (Telangana Bandh ) పిలుపునిచ్చింది.
Hyd, Jan 5: తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్‌తో (Bandi Sanjay Arrest) వాతావరణం మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్రంలో అక్రమ కేసులను నిరసిస్తూ, 317 జీవోను పునఃసమీక్షించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతాపార్టీ జనవరి 10న రాష్ట్ర బంద్‌కు (Telangana Bandh ) పిలుపునిచ్చింది. ఇటీవలే 317 జీవోను పునఃసమీక్షించాలని కరీంనగర్‌లో బండి సంజయ్ (MP Bandi Sanjay) జాగరణ దీక్షచేపట్టారు.
కోవిడ్ నేపథ్యంలో దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు ఎంపీ సంజయ్ దీక్షను భగ్నం చేసి లాఠీఛార్జీలు, తోపులాటల మధ్య అరెస్టు చేశారు. అనంతరం కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు. మరోవైపు కరీంనగర్ పోలీసులు తనను అక్రమంగా అరెస్టు చేశారంటూ బండి సంజయ్ మంగళవారం హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్‌కు బుధవారం హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా.. జైలు నుంచి విడుదలయ్యారు.
జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం మీడియాతో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. తెలంగాణలో ధర్మ యుద్దం ప్రారంభమైందని, సీఎం కేసీఆర్‌ను వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు జైలుకు వెళ్లడం కొత్త కాదని, అవసరమైతే మళ్లీ జైలుకు వెళ్లేందుకు కూడా బాధ లేదన్నారు. ఇప్పటి వరకు తాను తొమ్మిదిసార్లు జైలుకు వెళ్లినట్లు, తెలిపారు.జైలుకు పంపినా సరే కానీ ఉద్యోగులు నరకయాతన పడుతున్నారని, 317 జీవోను సవరించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
సీఎం కేసీఆర్‌ను (CM KCR) కూడా జైలుకు పంపుతామని హెచ్చరించారు. తాను ఉద్యోగులు, ఉపాధ్యాయులు కోసం జైలుకు వెళ్లానని, కేసీఆర్ మాత్రం వేరే ఇష్యూ మీద జైలుకు వెళ్తారని పేర్కొన్నారు. కేసీఆర్ జైలుకు పోతే ఆయన్ను ఎవరూ కాపాడలేరని తెలిపారు. జీవోను వెంటనే సవరించకుండా కేసీఆర్ సంగతి చూస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కార్యకర్తల చేతులు, కాళ్లు విరగొట్టారని, మహిళా కార్యకర్తలపై అసభ్యంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులు ఇప్పుడు కూడా స్పందించకుంటే జీవితాంతం ఇబ్బంది పడే ప్రమాదం ఉంటుందని సూచించారు.
‘ప్రజల సొమ్మును, తెలంగాణ సమాజాన్ని దోచుకున్నావు. హైకోర్టు మొట్టికాయలు వేసిన సిగ్గు లేదు. నా పార్టీ ఆఫీస్‌ను బద్దలు కొడతావా.. ఎవరూ ఇచ్చిండు నీకు అధికారం. సిగ్గుండాలి.. నీ కంటే సిగ్గుమాలిన వ్యక్తులు ఎవరూ ఉండరు. మేము ఏమైనా దుండగులమా, హంతకులమా దోపిడి దారులమా.. ధర్మం కోసం, తెలంగాణ సమాజం కోసం పనిచేసే వ్యక్తులం. భయపడతాం అనుకున్నావా అని ఫైర్ అయ్యారు.
బలిదానలకు సిద్ధమైన పార్టీ మాది. అయినా తెగించి కొట్లాడుతున్నాం. నీ తాటాకు చప్పుళ్లకు భయపడతామా.. కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేస్తావా.. నీ గోతి నువ్వే తవ్వుకుంటున్నావ్.. నీ కోసమే జైలుకు పోయినా.. జైళ్లన్నీ ఎట్లున్నాయో చూసిన.. ఇగ తరువాత నిన్నే జైలుకు లాక్కెళ్తారు. అవినీతి కుబేరుడివి అయ్యావ్. వేల కోట్ల రూపాయలు దోచుకున్నావ్. నిన్ను వదిలి పెట్టే ప్రసక్తే లేదు. ఎట్టి పరిస్థితుల్లో జీవో 317 సవరించాలి’ అని బండి సంజయ్ ధ్వజమెత్తారు.