Black Fungus in Telangana: తెలంగాణను వణికిస్తున్న బ్లాక్ ఫంగస్, ఆదిలాబాద్‌ జిల్లాలో ఒకరు మృతి, పలువురుకి కొనసాగుతున్న చికిత్స, కామారెడ్డి లోనే బ్లాక్ ఫంగస్ కేసులు బయటకు, నాలుగవ రోజుకు చేరుకున్న లాక్‌డౌన్

ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడకు చెందిన వస్త్రవ్యాపారి రాకొండే రాంకిషన్‌ (60) బ్లాక్‌ ఫంగస్‌తో మృతి చెందినట్టు స్థానిక వైద్యాధికారి ఆకుదారి సాగర్‌ ధ్రువీకరించారు.

virus Representational Image (Photo Credits: File Image)

Hyderabad, May 15: కరోనా వైరస్‌ దాడి నుంచి తేరుకోకముందే తెలంగాణలో పలు జిల్లాల్లో బ్లాక్‌ ఫంగస్‌ (Black Fungus in Telangana) కలకలం రేపుతోంది. ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడకు చెందిన వస్త్రవ్యాపారి రాకొండే రాంకిషన్‌ (60) బ్లాక్‌ ఫంగస్‌తో మృతి చెందినట్టు స్థానిక వైద్యాధికారి ఆకుదారి సాగర్‌ ధ్రువీకరించారు. రాంకిషన్‌ కొంతకాలంగా మధుమేహంతోపాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. 25 రోజుల క్రితం కరోనా టెస్ట్‌ చేయించగా, పాజిటివ్‌ వచ్చింది. చికిత్స అనంతరం కోలుకున్నాడు.

వారం తర్వాత షుగర్‌ లెవెల్స్‌ పెరగడంతో నిజామాబాద్‌లోని ఓ ఆస్పత్రికు వెళ్లాడు. అక్కడ అన్ని రకాల పరీక్షలు చేయించగా, బ్లాక్‌ ఫంగస్‌ సోకినట్టు వైద్యులు గుర్తించారు. అక్కడినుంచి హైదరాబాద్‌లోని దీనదయాళ్‌ ఆస్పత్రికు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. శుక్రవారం రాంకిషన్‌ చికిత్స రిపోర్టులను పరిశీలించిన వైద్యాధికారి సాగర్‌.. బ్లాక్‌ ఫంగస్‌గా నిర్ధారించారు.

ఇక కామారెడ్డి జిల్లాలో (Black Fungus in Kamareddy) బీర్కూర్ మండలం బరం గెడిగిలో ఓ వ్యక్తికి బ్లాక్ ఫంగస్ ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. సదరు వ్యక్తికి కరోనా తగ్గాక బ్లాక్ ఫంగస్ సోకినట్టు వైద్యులు గుర్తించారు. వెంటనే చికిత్స నిమిత్తం అతడిని హైదరాబాద్‌కు తరలించారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రస్తుతం బాధితుడికి చికిత్స జరుగుతోంది.

కరోనా మాటున మరో పెను ముప్పు, కోలుకున్నవారిపై బ్లాక్‌‌ ఫంగస్‌ దాడి, మ్యుకోర్‌‌మైకోసిస్‌ సోకి చూపును కోల్పోతున్న పేషెంట్లు, ఈ వ్యాధి ఎలా సోకుతుంది, బ్లాక్‌‌ ఫంగస్‌ లక్షణాలు ఎలా ఉంటాయో ఓ సారి తెలుసుకోండి

ఇక ఫంగస్ లక్షణాలతో నిర్మల్ జిల్లా భైంసా డివిజన్‌లో ఇద్దరు మృతి చెందారని వార్తలు వస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా బోథ్ ప్రాంతానికి చెందిన మహిళ మృతి చెందినట్లు సమాచారం. అలాగే పలువురు బాధితులు కంటి చూపు కోల్పోయారు. బ్లాక్ ఫంగస్‌తో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

తెలంగాణలో మూడు ప్రమాదకర వేరియంట్లు

కరోనా తీవ్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ (TS Lockdown) నాలుగవ రోజుకు చేరుకుంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు లాక్‌డౌన్ మినహాయింపులో భాగంగా ఈరోజు కూడా రోడ్లపైకి భారీగా జనం వచ్చి చేరారు. దీంతో పలు కూడళ్ళలో ట్రాఫిక్ జామ్ ఏర్పండి. అటు సూపర్ మార్కెట్‌లు, రైతు బజార్‌లు కిటకిటలాడుతున్నాయి. సూపర్ మార్కెట్‌ల దగ్గర భారీగా క్యూ లైన్లు ఏర్పడ్డాయి. మలక్ పేట, బేగంబజార్, బడిచౌడి ప్రాంతాల్లో ఎలాంటి కరోనా జాగ్రత్తలు కనిపించని పరిస్థితి నెలకొంది.