Plasma Therapy in India for Coronavirus (Photo Credits: PTI)

Hyderabad, May 8: తెలంగాణలో గడచిన 24 గంటల్లో 65,375 కరోనా పరీక్షలు నిర్వహించగా 5,559 మందికి పాజిటివ్ (Telangana logs 5,559 Covid-19 cases) అని వెల్లడైంది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 984 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పలు జిల్లాల్లో రెండంకెల్లోనే కొత్త కేసులు రావడం తాజా బులెటిన్ లో చూడొచ్చు.

అదే సమయంలో 8,061 మంది కరోనా నుంచి కోలుకోగా 41 మంది (Covid Deaths) మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 4,87,199కి పెరిగింది. 4,13,225 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 71,308 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 2,666కి చేరింది.

కరోనా మహమ్మారి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం (TS Govt) కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వచ్చే వాహనాలను ఇక మీదట అనుమతిని నిరాకరించనున్నారు. కరోనా తీవ్రత తగ్గే వరకూ మహారాష్ట్ర నుంచి వచ్చే వాహనాలను మద్నూర్ మండలం సలబాత్‌పూర్ చెక్‌పోస్ట్ వద్ద నిలిపివేయనున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వేగంగా విస్తరించడానికి అత్యంత ప్రమాదకరమైన మహారాష్ట్ర, సౌత్‌ ఆఫ్రికా, యూకే వేరియంట్సే (Three New Variants) కారణమని నిర్ధారణ అయింది. వీటితోపాటు బ్రెజిల్‌, విచిత్రంగా నైజీరియా వేరియంట్‌ను సైతం గుర్తించినట్లు సీఎ‌స్ఐఆర్‌- సీసీఎంబీ పేర్కొంది. ఈ మేరకు జన్యు విశ్లేషణ వివరాలను గ్లోబల్‌ ఇన్షియేటివ్‌ ఆన్‌ షేరింగ్‌ ఆల్‌ ఇన్‌ఫ్లుయెంజా డేటా (జీఐఎ‌స్ఎఐడీ)లో ఉంచింది. తెలంగాణలో సెకండ్‌వేవ్‌ ప్రారంభమైన తర్వాత ఏప్రిల్‌ 1 నుంచి మే 7వ తేదీ మధ్య పలు ప్రాంతాల్లో శాంపిల్స్‌ను సేకరించి, జన్యు విశ్లేషణ చేశారు.

కరోనాతో కంటిచూపు కోల్పోతున్న పేషెంట్లు, తమిళనాడులో రెండు వారాల పాటు లాక్‌డౌన్, దేశంలో తాజాగా 4,01,078 మందికి కరోనా నిర్ధారణ, 24 గంటల్లో 4,187 మంది కరోనా కారణంగా మృతి

మొత్తం 206 నమూనాలు సేకరించగా.. ఇందులో మహారాష్ట్ర వేరియంటే 31 శాతం ఉంది. ఆ తర్వాత సౌత్‌ఆఫ్రికా వేరియంట్‌ 9.7శాతం, నైజీరియా వేరియంట్‌ 8.25 శాతం, యూకే వేరియంట్‌ 7.28 శాతం, ఇతర వేరియంట్స్‌ అన్నీ కలిపి 44 శాతం ఉన్నట్లు జన్యు విశ్లేషణలో తేలింది. ఇందులో ఎక్కువ నమూనాలు హైదరాబాద్‌ (138)లో సేకరించగా, యూకే, సౌత్‌ ఆఫ్రికా, మహారాష్ట్ర, నైజీరియా, బ్రెజిల్‌ వైరస్‌ వేరియంట్లు ఉన్నట్లు వెల్లడైంది.

అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకల వల్ల ఇక్కడ అనేక రకాల వేరియంట్స్‌ ఉన్నట్లు వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే, వికారాబాద్‌లో 6, గద్వాలలో 2, నాగర్‌ కర్నూల్‌లో ఒక నమూనాను పరీక్షించగా మహారాష్ట్ర వేరియంట్‌ ఉన్నట్లు గుర్తించారు.

రాష్ట్రంలో ఈ మూడు ప్రమాదకరమైన వేరియంట్స్‌ ఉండడం వల్లే వైరస్‌ వ్యాప్తి, మరణాల రేటు ఎక్కువగా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సౌత్‌ ఆఫ్రికా వేరియంట్‌ అత్యంత ప్రమాదకరమైందని, వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలోనూ దాని ప్రభావశీలత 40 శాతం తగ్గుతుందని చెబుతున్నారు. సౌత్‌ ఆఫ్రికా, మహారాష్ట్ర వేరియంట్స్‌ పరీక్షలకూ చిక్కడం లేదని, బాధితుల ఆరోగ్యం చాలా త్వరగా క్షీణిస్తోందని, మహారాష్ట్ర వేరియంట్‌ సోకిన వారిలో ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు.

తమిళనాడులో లాక్‌డౌన్‌, మే 10 నుంచి 24 వరకు లాక్‌డౌన్ ప్రకటిస్తున్నట్లు తెలిపిన స్టాలిన్ సర్కారు, మధ్యాహ్నం 12వరకు అత్యవసర సేవలకు అనుమతి

ఇదిలా ఉంటే గంటల వ్యవధిలో బెల్లంపల్లి ఐసొలేషన్‌ కేంద్రంలో 12 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. శ్వాస ఇబ్బందితో ఒకరివెంట ఒకరు ఊపిరి విడిచారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఐసొలేషన్‌ కేంద్రంలో బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం మధ్య వరుసగా రోగులు మృతిచెందారు. సింగరేణి ఏరియా ఆస్పత్రిలో వంద పడకలతో ఈ ఐసోలేషన్‌ కేంద్రం నిర్వహిస్తున్నారు. 67 మంది చికిత్స పొందుతున్నారు.

ఐదు రోజుల నుంచి కేంద్రానికి తీసుకొచ్చినవారిలో 12 మంది పరిస్థితి విషమంగా మారి చనిపోయారు. సరైన చికిత్స అందలేదని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మృతుల బంధువులు ఆరోపిస్తుండగా, వైద్యులు దానిని ఖండిస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొంది.. బతికే అవకాశం లేదని చెప్పిన తర్వాత ఐసొలేషన్‌ కేంద్రానికి తీసుకొచ్చారని వివరించారు.

కరోనా మహమ్మారి మరింతగా విజృంభిస్తుండటంతో రాష్ట్రంలో మరిన్ని ఆంక్షలను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో సామాజిక/రాజకీయ/క్రీడా/వినోద/విద్యా/మత/సాంస్కృతికపరమైన అన్ని రకాల సామూహిక కార్యక్రమాలను నిషేధించింది. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు గరిష్టంగా 100 మందికి మించవద్దని.. అంత్యక్రియలకు సంబంధించిన కార్యక్రమాల్లో 20 మందికి మించవద్దని స్పష్టం చేసింది. అదికూడా మాస్కులు, భౌతిక దూరం, ఇతర కోవిడ్‌ నిబంధనలను పాటిస్తూ కార్యక్రమాలను నిర్వహించాలని సూచించింది.

తెలంగాణలో లాక్‌డౌన్ ఉండదు! స్పష్టం చేసిన సీఎం కేసీఆర్, కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేస్తామని వెల్లడి, స్వీయ రక్షణే శ్రీరామ రక్షగా పేర్కొన్న ముఖ్యమంత్రి, రాష్ట్ర అవసరాలపై ప్రధానితో సంభాషణ

ఈ మేరకు విపత్తుల నిర్వహణ చట్టం–2005 కింద ఆంక్షలను విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆంక్షలను, రాత్రి కర్ఫ్యూను కఠినంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు/ఎస్పీలను ఆదేశించారు. కొన్ని వారాలుగా దేశంలో కరోనా కేసులు భారీగాపెరుగుతున్న నేపథ్యంలో, గత నెల 23న కేంద్ర హోంశాఖ జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూను మరో వారం రోజుల పాటు పొడిగిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 8వ తేదీన ఉదయం 5 గంటలతో రాత్రి కర్ఫ్యూ గడువు ముగియనుండగా.. ఈ నెల 15వ తేదీ ఉదయం 5 గంటల వరకు పొడిగిస్తున్నట్టు తెలిపారు. కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతిని కట్టడి చేయడానికి హైకోర్టు ఆదేశాల మేరకు.. ఏప్రిల్‌ 20 నుంచి రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. రాత్రి కర్ఫ్యూను సైతం కఠినంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు/ఎస్పీలను సీఎస్‌ఆదేశించారు.