CM KCR Review: తెలంగాణలో లాక్‌డౌన్ ఉండదు! స్పష్టం చేసిన సీఎం కేసీఆర్, కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేస్తామని వెల్లడి, స్వీయ రక్షణే శ్రీరామ రక్షగా పేర్కొన్న ముఖ్యమంత్రి, రాష్ట్ర అవసరాలపై ప్రధానితో సంభాషణ
CM KCR displays medicines being distributed public. | Photo: CMO

Hyderabad, May 7: తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించబోమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. లాక్ డౌన్ విధించడం వలన ప్రజాజీవనం స్థంభించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదమున్నదని తెలిపారు. గత అనుభవాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించినా కూడా పాజిటివ్ కేసులు తగ్గడం లేదనే విషయాన్ని పరిశీలించిన సీఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి వాటిని, మైక్రోలెవల్ కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి కరోనా నిరోధక చర్యలను తక్షణమే చేపడుతాం అని సీఎం వివరించారు.

" లాక్ డౌన్ తో కొన్ని లక్షల కుటుంబాలు ఉపాధికోల్పోయే పరిస్థితి తలెత్తి మొత్తం వ్యవస్థ కుప్పకూలే ప్రమాదమున్నది. కరోనా ఏమోగాని ఆకలి సంక్షోభం తలెత్తే ప్రమాదమున్నది. గొంతు పిస్కినట్టు చేస్తే మొత్తం రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదమున్నది. కాబట్టి గత అనుభవాలను దృష్టిలో ఉంచుకోని లాక్ డౌన్ ను విధంచకూడదని ప్రభుత్వం నిర్ణయించింది.’’ అని సీఎం స్పష్టం చేశారు.

కరోనా నియంత్రణ కోసం ప్రజలు కూడా పూనుకోవాలనీ, ప్రతి వ్యక్తీ స్వచ్ఛందంగా కరోనా మీది యుద్ధంలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు. సమిష్టిగా అందరం కలిసి కొట్లాడితేనే కరోనా అంతమౌతుందని అన్నారు.

కరోనా పరిస్థితుల పై  ప్రగతిభవన్ లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని సీఎం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులను కూలంకషంగా సమీక్షించారు. రాష్ట్రానికి కావాల్సిన వ్యాక్సిన్లు, ఆక్సిజన్ మరియు రెమిడెసివిర్ సరఫరా గురించి ప్రధాని నరేంద్ర మోదీతో టెలిఫోన్లో మాట్లాడిన సీఎం కేసీఆర్, తెలంగాణకు అవసరమున్న వాటిని తక్షణమే రాష్ట్రానికి సమకూర్చాల్సిందిగా అభ్యర్థించారు.

మెడికల్ హబ్ గా హైదరాబాద్ మారినందున సరిహద్దు రాష్ట్రాల ప్రజలు కూడా హైదరాబాద్ మీదనే వైద్యసేవలకు ఆధారపడుతున్నారని తెలిపారు. మహారాష్ట్ర, ఛత్తీస్ గడ్, కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్ తదితర రాష్ట్రాలనుంచి హైదరాబాద్ కు కోవిడ్ చికిత్సకోసం చేరుకోవడం వలన హైదరాబాద్ మీద భారం పెరిగిపోయిందని సీఎం వివరించారు. తెలంగాణ జనాభాకు అదనంగా 50 శాతం కరోనా పేషెంట్లు ఇతర రాష్ట్రాలనుంచి రావడం వలన హైదరాబాద్ మీద ఆక్సిజన్, వ్యాక్సిన్, రెమిడెసివిర్ వంటి మందుల లభ్యతమీద పడుతున్నదని ప్రధానికి సీఎం వివరించారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకొని రోజుకు 500 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్, రోజుకి 25,000 రెమెడిసెవిర్ ఇంజక్షన్లు మరియు రోజుకి 2 నుంచి 2.5 లక్షల డోసులు అవసరం పడుతున్నదని వాటిని సత్వరమే సరఫరా చేయాలని ప్రధాని మోదీకి సీఎం విజ్జప్తి చేశారు.

ఇక, కరోనా విషయంలో ప్రజలు భయాందోళన గురికావద్దని సీఎం కోరారు. ఎవరికైనా ఏమాత్రం అనుమానం వచ్చినా టెస్టుల కోసం ఆందోళన చెందకుండా ముందస్తుగా ప్రభుత్వం అందించే కోవిడ్ మెడికల్ కిట్లను వినియోగించుకోవాలన్నారు. ఆశా వర్కర్లు, ఎఎన్ఎం ల ద్వారా ఇంటింటికీ అందచేస్తామన్నారు. ఇందులో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించే కరపత్రంతో పాటు మందులు అందజేస్తారని తెలిపారు.

Medicines in the Govt's COVID Kits

అలాగే మొదటి డోస్ వ్యాక్సిన్ వేసుకున్నవాల్లకు వారి నిర్ణీత సమయాన్ని అనుసరించి రెండో డోస్ వేసేందుకు ప్రాధాన్యతనివ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు.

కరోనా నియంత్రణలో ప్రాణాలకు తెగించి పాటుపడుతున్న వైద్య ఆరోగ్యశాఖకు సీఎం అభివందనాలు తెలియచేశారు. వైద్యులు, నర్సులు, ఆశా వర్కర్లు, ఎఎన్ఎంలు తదితర వైద్య సిబ్బంది గొప్ప సేవ చేస్తున్నారని వారి కృషి త్యాగం గొప్పదని కొనియాడారు. సెకండ్ వేవ్ మే 15 తర్వాత తీవ్రత తగ్గిపోతుందని రిపోర్టులు సూచిస్తున్నాయన్నారు. వ్యాధి నిరోధానికి ఎవరికివారే జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలే స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. గుంపులు గుంపులుగా తిరగొద్దని పెండ్లిల్లలో వందకు మించి జమ కావద్దని తెలిపారు. పరిశుభ్రత పాటించాలని, సానిటైజర్లు వాడాలని, మాస్కులు ధరించాలని, భౌతిక దూరాన్ని పాటించాలని తెలిపారు. ఇటువంటి జాగ్రత్తలే శ్రీరామ రక్షగా పేర్కొన్నారు.