CJI NV Ramana: చేతికి ఎముక లేదనడానికి ట్రేడ్‌మార్క్ సీఎం కేసీఆర్, న్యాయాధికారుల సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రిపై ప్రశంసలు కురిపించిన సీజేఐ ఎన్వీ రమణ
తెలంగాణ ఏర్పడిన తర్వాత న్యాయాధికారుల సమావేశం జరగడం ఇదే తొలిసారని వెల్లడించారు. న్యాయవ్యవస్థను బలపరిచేందుకు ఈ సమావేశం ఉపయోగపడుతుందన్నారు.
Hyd, April 15: హైదరాబాద్ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్‌లో జరిగిన న్యాయాధికారుల సదస్సు (Telangana State Judicial Officers Conference) జరిగింది. ఈ సదస్సుకు సీజేఐ ఎన్వీ రమణ, హైకోర్టు సీజే జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, ఏపీ హైకోర్టు సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, సీఎం కేసీఆర్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ ( Justice NV Ramana) మాట్లాడుతూ న్యాయవ్యవస్థ బలోపేతానికి కేసీఆర్ కృషిచేస్తున్నారని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత న్యాయాధికారుల సమావేశం జరగడం ఇదే తొలిసారని వెల్లడించారు. న్యాయవ్యవస్థను బలపరిచేందుకు ఈ సమావేశం ఉపయోగపడుతుందన్నారు.
చేతికి ఎముక లేదనడానికి ట్రేడ్‌మార్క్ సీఎం కేసీఆర్ (a man without a bone in his hand ) అని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య తగ్గించాలని కేంద్రం, ఇతర రాష్ట్రాలు భావిస్తుంటాయని, తెలంగాణలో మాత్రం (CJI NV Ramana praised Telangana CM) సీఎం కేసీఆర్ 4320కిపైగా ఉద్యోగాలు సృష్టించారన్నారు. హైకోర్టులో ఇటీవల జడ్జీల సంఖ్య పెంచామని చెప్పారు. కేసుల త్వరితగతిన పరిష్కారానికి జడ్జిల పెంపు అవసరమన్నారు. రెండేండ్లుగా పెండింగ్‌లో ఉన్న జడ్జిల సంఖ్య పెంపు అంశాన్ని పరిష్కరించామన్నారు.
న్యాయవ్యవస్థను ఇంకా బలపరచాలని భావిస్తున్నామని చెప్పారు. జిల్లా కోర్టుల్లోనూ జడ్జిల సంఖ్య పెంచుతున్నామని వెల్లడించారు. ఇటీవల హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ వచ్చిందని చెప్పారు. వివాదాల సత్వర పరిష్కారానికి ఈ కేంద్రం ఉపయోగపడుతుందన్నారు. తమ రాష్ట్రాల్లోనూ ఇలాంటి కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతున్నారని వెల్లడించారు.
సీఎం కేసీఆర్ (CM KCR) మాట్లాడుతూ.. ఎనిమిదేండ్ల క్రితం అవతరించిన తెలంగాణ రాష్ట్రం అందరి సహకారంతో పురోగమిస్తున్నదని అన్నారు. చక్కటి ఆర్థిక క్రమశిక్షణతో అన్నిరంగాల్లో దూసుకుపోతున్నామని చెప్పారు. విద్యుత్ రంగంలో అద్భుతమైన పురోగతి సాధిస్తున్నామని, వ్యవసాయ, పారిశ్రామిక రంగంలో ముందుకెళ్తున్నామన్నారు. పరిపాలన సంస్కరణలు తీసుకొచ్చి 33 జిల్లాలు ఏర్పాటు చేశామన్నారు. ఆర్‌బీఐ లెక్కల ప్రకారం తెలంగాణ తలసరి ఆదాయం రూ.2.78 లక్షలు అని చెప్పారు.తెలంగాణ రాష్ట్ర న్యాయ పరిపాలన విభాగం ఇంకా ముందుకెళ్లాలని, దేశానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
హైదరాబాద్ పట్ల జస్టిస్ ఎన్వీ రమణకు చాలా ప్రేమ ఉన్నదని చెప్పారు. సుదీర్ఘకాలం హైదరాబాద్‌లో పనిచేసినందున ఆయనకు అన్ని విషయాలు తెలుసున్నారు. హైకోర్టు విడిపోయిన తర్వాత బెంచీల సంఖ్య పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినప్పటికీ పెండింగ్‌లో పెట్టారని చెప్పారు. అయితే సీజేఐ రమణ చొరవతో హైకోర్టు బెంచీలను 24 నుంచి 42కు పెంచారన్నారు. న్యాయ వ్యవస్థలో గతంలో 780 పోస్టులు మంజూరు చేశామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. మరో 885 అదనపు పోస్టులు హైకోర్టుకు మంజూరు చేశామన్నారు. జిల్లా కోర్టులకు అదనంగా 1730 పోస్టులు మంజూరు చేశామన్నారు. జిల్లా కోర్టులలో పనిభారం ఉందని తెలిసిందన్నారు. జిల్లా కోర్టుల్లో జడ్జిలు, మెజిస్ట్రేట్ సిబ్బందిని నియమిస్తే పనిభారం తగ్గుతుందని చెప్పారు. 23 జిల్లాల్లో జిల్లా కోర్టు భవనాలు చేపడతామని, వాటికోసం స్థల సేకరణ జరుగుతున్నదని వెల్లడించారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు కోటి 52 లక్షల ఎకరాల భూములను డిజిటలైజ్ చేశామన్నారు. రెవెన్యూ కోర్టులను ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. న్యాయమూర్తులు హోదాకు తగ్గట్లుగా 42 మంది జడ్జిలకు 30 ఎకరాల్లో క్వార్టర్స్ నిర్మిస్తామని, సీజేఐ రమణతో శంకుస్థాపన చేయిస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు ఆకర్షించడంలో పోటీ నెలకొందని సీఎం కేసీఆర్ అన్నారు. పారిశ్రామికవేత్తలు న్యాయవ్యవస్థ గురించే అడుగుతారని చెప్పారు. సమస్యలు వెంటనే పరిష్కరిస్తే మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.