Telangana CLP Meeting: తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిపై కొనసాగుతున్న సస్పెన్స్, ఇంకా అధికారికంగా ప్రకటించిన కాంగ్రెస్ హైకమాండ్, ఈ రోజు రాత్రికి సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లుగా వార్తలు
గచ్చిబౌలిలోని ఓ హోటల్‌లో ఆ పార్టీ ఎమ్మెల్యేలతో ఏఐసీసీ పరిశీలకులు సమావేశమయ్యారు. సీఎల్పీ నేత ఎంపికపై ఎమ్మెల్యేల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు
Hyd, Dec 4: తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) (Congress) సమావేశం ముగిసింది. గచ్చిబౌలిలోని ఓ హోటల్‌లో ఆ పార్టీ ఎమ్మెల్యేలతో ఏఐసీసీ పరిశీలకులు సమావేశమయ్యారు. సీఎల్పీ నేత ఎంపికపై ఎమ్మెల్యేల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలతో కూడిన నివేదికను అధిష్ఠానానికి పంపనున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ అధిష్ఠానం సీఎల్పీ నేత ఎంపికపై నిర్ణయం తీసుకోనుంది.
సమావేశం ముగిసిన అనంతరం ఏఐసీసీ పరిశీలకుడు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత (CLP Leader) ఎంపిక బాధ్యతను అధిష్ఠానానికి అప్పగిస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ మేరకు వారంతా తీర్మానం చేశారని తెలిపారు.ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) పార్టీకి అధికారం కట్టబెట్టిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానం చేశామని డీకే శివకుమార్ తెలిపారు.
సీఎల్పీ నేత ఎంపికపై ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని తీసుకున్నామని చెప్పారు. సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun kharge)కు ఇవ్వాలని ఎమ్మెల్యేలు చెప్పారని.. ఆ మేరకు సమావేశంలో తీర్మానం చేసినట్లు చెప్పారు. ఖర్గే నిర్ణయాన్ని శిరసావహిస్తామని ఎమ్మెల్యేలు ఆ తీర్మానంలో పేర్కొన్నట్లు డీకే శివకుమార్ తెలిపారు.
సుమారు గంటపాటు సీఎల్పీ భేటీ కొనసాగింది. ఈ సమావేశానికి ఏఐసీసీ పరిశీలకులుగా డీకే శివకుమార్‌తో పాటు దీప్‌దాస్ మున్షీ, జార్జ్, అజయ్, మురళీధరన్ హాజరయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనర్సింహతో పాటు పలువురు సీనియర్లు పాల్గొన్నారు.
ఇదిలా ఉంటే ఈ రోజు రాత్రి 8 గంటలకే తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.హైకమాండ్ నిర్ణయం వెలువడగానే ఈ రాత్రి 8 గంటలకే కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిసింది. ఈ మేరకు కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. కొత్త సీఎం ప్రమాణ స్వీకారం కోసం రాజ్‌భవన్‌లో 300 మంది కూర్చునేలా ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రమాణస్వీకారానికి హైకమాండ్‌కు చెందిన ముఖ్య నేతలు కూడా హాజరుకానున్నట్లు సమాచారం