Paddy Procurement: రైతులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన తెలంగాణ సర్కారు, యాసంగి ధాన్యం కొనుగోలు ప్రక్రియ యుద్ధప్రాతిపదికన ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు

ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని, యుద్ధప్రాతిపదికన గ్రామాల్లో ధాన్యం కొనుగోలు (paddy procurement centres) కేంద్రాలను ఏర్పాటుచేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.

CM KCR Meeting (Photo-TS CMO)

Hyderabad, April 10: యాసంగి ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు (CM KCR) ఆదివారం కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని, యుద్ధప్రాతిపదికన గ్రామాల్లో ధాన్యం కొనుగోలు (paddy procurement centres) కేంద్రాలను ఏర్పాటుచేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం సోమవారం కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించి, అవసరమైన ఏర్పాట్లు, కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి (CS Shanthi kumari), పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌కు సూచించారు. ఇప్పటికే పలు జిల్లాల్లో యాసంగి వరి కోతలు మొదలైన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ తాజా నిర్ణయంతో రైతులకు మేలు జరుగనున్నది. గతంలో మాదిరిగానే రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఏడు వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

సీఎం కేసీఆర్‌ నిర్ణయంపై రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. గతంలో రైతులు తమ ధాన్యం అమ్ముకోవాలంటే నరకయాతన పడేవారు. రైతుల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్‌ ధాన్యం కొనుగోలు ప్రక్రియను (paddy procurement centres) సులభతరం చేశారు. మార్కెట్‌ యార్డులకు ధాన్యం తరలించేందుకు రైతులపై ట్రాక్టర్‌ కిరాయి భారం కూడా పడొద్దనే ఉద్దేశంతో గ్రామాల ముంగిటకే ధాన్యం కొనుగోలు కేంద్రాలను తీసుకొచ్చారు. గత కొన్నేండ్లుగా ప్రతి గ్రామంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. కరోనా కష్టకాలంలో సైతం ఇది రైతులకు ఎంతో మేలు చేసింది. ఈ ఏడాది కూడా ప్రతి గ్రామంలోనూ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.

BRS Formation Day: అట్టహాసంగా బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, ఈనెల 27న తెలంగాణ భవన్‌లో సెలబ్రేషన్స్, అక్టోబర్‌ లో భారీ బహిరంగసభకు నిర్ణయం 

ఈ యాసంగిలో రికార్డు స్థాయిలో 56.44 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. దీంతో సుమారు 1.30 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అధికారుల అంచనా. ఇందులో సుమారు 80-90 లక్షల టన్నుల ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు. అంతకు మించి వచ్చినా సరే కొనుగోలు చేసేందుకు అధికారులు సకల ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ యాసంగిలో ధాన్యం కొనుగోలుకు సుమారు రూ.15 వేల కోట్ల నుంచి రూ.17 వేల కోట్ల నిధులు అవసరమని అంచనా. రైతులు తమ ధాన్యం విక్రయించిన వారం రోజుల్లో వారి ఖాతాల్లో డబ్బులు జమయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి కేంద్రంలోనూ అవసరమైన టార్పాలిన్లు, ధాన్యం తూర్పారపట్టే యంత్రాలు, హమాలీలు, గోనె సంచులు ఇలా అన్ని రకాల సౌకర్యాలను సిద్ధం చేస్తున్నారు. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన వెంటనే కాంటా పెట్టేలా చర్యలు తీసుకుంటున్నారు.

PM Modi Telangana Visit: వందే భారత్ ట్రైన్ ఎక్కడెక్కడ ఆగుతదో అక్కడకి పోయి జెండా ఊపు..ప్రధాని మోదీపై తలసాని ఘాటు విమర్శలు.. 

యాసంగి ధాన్యం కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించిన నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేసేందుకు మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌, నిరంజన్‌రెడ్డి సోమవారం ఎంసీఆర్‌హెచ్చార్డీలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ఎంత ధాన్యం వస్తుంది? క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి? వంటి అంశాలపై అధికారులకు మంత్రులు దిశానిర్దేశం చేయనున్నారు.