Telangana: నేటి నుంచి ఆన్‌లైన్‌లో వాహనాల ఫ్యాన్సీ నెంబర్లు, నెంబర్ పోర్టబులిటీకి కూడా ప్రయత్నాలు, త్వరలోనే ఆర్టీసీ కార్గో సేవలు ప్రారంభం, టీఎస్ ఆర్టీసీకి ఇకపై సీఎం కేసీఆర్ బ్రాండ్ అంబాసిడర్
సీఎం కేసీఆర్ నే తమ టీఎస్ ఆర్టీసి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసుకున్నామన్న మంత్రి, ఇకపై ఆర్టీసీ బస్సులపై సీఎం కేసీఆర్ ఫోటోలతో పాటు, ప్రయాణికులు ఆర్టీసీ బస్సులనే ఇష్టపడేలా బస్సులపై నినాదాలు ప్రచారం చేస్తామని, ఆర్టీసీ సేవలు ...
Hyderabad, January 30: తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ (TS Vehicle Registration) కు సంబంధించి ఫాన్సీ నంబర్స్ కోరుకునే వారి కోసం నేరుగా ఆన్‌లైన్ లోనే ఇ-బిడ్డింగ్ సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) తెలియజేశారు. ఫాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ల (Fancy Vehicle Numbers) కోసం ప్రజలు ప్రజలు ట్రాన్స్ పోర్ట్ కార్యాలయానికి వచ్చే అవసరం లేకుండా ఎక్కడి నుండైనా ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. నేటి నుంచే ఈ విధానం అమలులోకి వస్తుందని దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు www.transport.telangana ని సందర్శించాలని మంత్రి సూచించారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఈ ఆన్‌లైన్ అభ్యర్థనలను స్వీకరిస్తారు.
అలాగే తమ వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్ మార్చుకోవాలనే వారి కోసం నెంబర్ పోర్టబిలిటీని కూడా త్వరలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ విధానం ద్వారా శాఖకు అదనపు ఆదాయం సమకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విధానం అమలులోకి వస్తే వాహనదారులు తమకు తమ వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ నచ్చకపోతే ఇంకో నంబర్ కు మార్చుకునే అవకాశం లభిస్తుంది, తదనుగుణంగా రవాణాశాఖ కొత్త ఆర్ సీని విడుదల చేస్తుంది. ఈ విధానం ఇప్పటికే దిల్లీ, ఛండీఘర్, ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలలో అమలులో ఉంది.
ఇదిలా ఉండగా, త్వరలోనే టీఎస్ ఆర్‌టిసి కార్గో సేవలను (TSRTC Cargo) ప్రారంభిస్తుందని మంత్రి అజయ్ తెలిపారు. కార్గో సేవలకు ఇప్పటికే 50 బస్సులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సమయం ఇచ్చిన వెంటనే ఫిబ్రవరి 10 లోపు కార్గో సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
రాష్ట్ర ప్రజల ముందుకు కొత్త ఆర్టీసీ రాబోతోందని మంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును టీఎస్ ఆర్టీసి బ్రాండ్ అంబాసిడర్‌గా చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అతి త్వరలో ఆర్టీసీ బస్సులపై సిఎం కేసిఆర్ (CM KCR) చిత్రపటాలతో పాటు ప్రజలు ఆర్టీసి బస్సులను ఇష్టపడేలా సూక్తులు, ప్రగతి నినాదాలు కనిపిస్తాయని మంత్రి చెప్పారు. చాలా నెలల తర్వాత తొలిసారి టీఎస్ ఆర్‌టిసి ద్వారా వచ్చిన ఆదాయంతో ఉద్యోగులకు జీతం అందించినట్లు మంత్రి తెలిపారు. సంక్రాంతి పండుగ ద్వారా కార్పొరేషన్ రూ .16.8 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది, గతేడాదితో పోలిస్తే రూ.6 కోట్లు ఎక్కువని మంత్రి తెలిపారు. మేడారం జాతర కోసం 4,000 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలిపారు.
ఇక కార్పొరేషన్ నష్టాలకు గల కారణాల అధ్యయనం మరియు దిద్దుబాటు చర్యల దిశగా కార్పొరేషన్‌లో అనేక సంస్కరణలు తీసుకువచ్చినట్లు పేర్కొన్న అజయ్, ఉద్యోగుల హక్కులను ప్రభుత్వం పరిరక్షిస్తుందని అన్నారు. ఉద్యోగులపై వేధింపులకు పాల్పడినట్లు తేలితే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 24 గంటల్లో చర్యలు తీసుకుంటామని పేర్కొంటూ 9849555778 అనే ఫోన్ నంబర్ ఇచ్చాడు. సమ్మె కాలంలో జరిగిన అవకతవకలపై విచారణకు ఆదేశిస్తామని తెలిపారు. ఉద్యోగుల 55 రోజుల సమ్మె కాలానికి సంబంధించిన జీతాలు మార్చి 31లోపు వారి ఖాతాల్లో జమ చేయబడతాయని మంత్రి స్పష్టం చేశారు.