Hyderabad, December 20: 1980-90ల వారికి ఎర్రబస్సు (Erra Bus / Red Bus) అంటే సుపరిచితమే, ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లాలంటే ఆర్టీసీలో ఎర్రబస్సులే ఉండేవి. కాలక్రమేనా ప్రజారవాణా వ్యవస్థలో మార్పులు చోటుచేసుకుంటూ ఎక్స్ ప్రెస్, డీలక్స్ అంటూ సర్వీసులు అప్ గ్రేడ్ అవుతూ వచ్చాయి. ఎర్రబస్సులు పూర్తిగా కనుమరుగై పోయాయి. ఇప్పుడైతే వివిధ రంగుల్లో వోల్వో, గరుడ ప్లస్ అంటూ అత్యంత సౌకర్యవంతమైన ప్రయాణం కోసం బస్సులు అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ ఒకప్పటి ఎర్రబస్సు అంటే ఎంతో మందికి ఇప్పటికీ అభిమానమే. ఎర్రబస్సుతో అప్పటి జనాలకు ఒక ఆత్మీయ అనుబంధం ఉంది. వారికి ఎర్రబస్సంటే ఒక ఎమోషన్.
అయితే, తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) మరోసారి ఎర్రబస్సులను ప్రవేశపెట్టబోతుంది. ఆర్టీసీ (TSRTC)ని నష్టాల నుంచి గట్టెక్కించే ప్రయత్నంలో భాగంగా సీఎం కేసీఆర్ (CM KCR) సూచన మేరకు సామాను రావాణా చేసే కార్గో (Cargo) సర్వీసులను టీఎస్ ఆర్టీసీ అందుబాటులోకి తీసుకురానుంది. 2020, జనవరి 1 నుంచి కార్గో సేవలను ప్రారంభించాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు.
ఈ కార్గో సర్వీసుల కోసం ఒకప్పుడు ప్రజలకు సుపరిచితమైన ఎర్రబస్సు తరహాలోనే తీర్చిదిద్దాలని అధికారులు నిర్ణయించారు. డిసెంబర్ 23 వరకు ఈ కార్గో సర్వీసులు సిద్ధమవుతాయని అధికారులు వెల్లడించారు. సిబ్బందికి కూడా ప్రత్యేక డ్రెస్ కోడ్ రూపకల్పన చేయనున్నారు. ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ వరాల జల్లు, సంస్థను లాభాల్లోకి తెచ్చేందుకు కీలక నిర్ణయాలు
రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఈ ఆర్టీసీ కార్గో సర్వీసులకు సంబంధించి గురువారం ఆర్టీసీ ఎండి సునీల్ శర్మ మరియు ఇతర ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆర్టీసీపై సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల అమలు మరియు కార్యాచరణపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం, సంస్థ ఆదాయం పెంచే అంశాలపై చర్చించారు. ఉద్యోగులలో సుహృద్భావ వాతావరణాన్ని పెంపొందించడానికి గ్రేటర్ హైదరాబాద్ రీజియన్‌లో ఈ నెల 24న వనభోజన కార్యక్రమం నిర్వహించనున్నట్లు మంత్రి అజయ్ తెలిపారు.
.