Telangana CM KCR Lunch Meeting With RTC Employees Regarding Telangana RTC Issues (Photo-Twitter)

Hyderabad,December 1: తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ (Telangana CM KCR) శుభవార్తను అందించారు. ప్రగతి భవన్‌లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా.. ఆర్టీసీ కార్మికులతో కలిసి కేసీఆర్‌ భోజనం (Lunch Meeting) చేశారు. అనంతరం కార్మికులపై వరాల జల్లు కురిపించారు. ఆర్టీసీ(RTC)ని లాభాల్లోకి తెస్తే సింగరేణి తరహాలో బోనస్‌లు ఇస్తామని వెల్లడించారు.

52 రోజుల సమ్మె (TSRTC Strike) కాలానికి వేతనాలు ఇస్తామని ప్రకటించారు. సెప్టెంబర్ నెల జీతాన్ని (September Salary) డిసెంబర్ 02వ తేదీ సోమవారం చెల్లించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్మికుల రిటైర్మెంట్ వయస్సు 60 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

ప్రగతి భవన్‌లో కార్మికులతో కేసీఆర్ సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశానికి మాత్రం ఆర్టీసీ జేఏసీ యూనియన్ నేతలను మాత్రం పిలవలేదు. మూడు నెలలుగా జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడిన కార్మికులకు సీఎం కేసీఆర్ నిర్ణయంతో బిగ్ రిలీఫ్ ఇచ్చినట్లైంది.

మహిళా ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. రాత్రి 8 గంటలకే విధులు ముగిసేలా మహిళా కార్మికులకు డ్యూటీ వేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రసూతి సెలవులు ఇవ్వడానికి అంగీకరించారని తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికుల తల్లిదండ్రులు వైద్య సేవలు అందించాలని సీఎం ఆదేశించారని సమాచారం.

ఆర్టీసీ సమస్యలు, స్థితిగతులపై ప్రభుత్వం తరఫున కేసీఆర్ స్వయంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారని సమాచారం. ఆర్టీసీని లాభాల బాట పట్టించాలంటే ఏయే చర్యలు తీసుకోవాలనే దిశగా సీఎం కార్మికులతో చర్చలు జరిపారు. యూనియన్ల వైపు కార్మికులు వెళ్లొద్దని కేసీఆర్ సూచించారు. ఒక్కో డిపో నుంచి ఐదుగురి చొప్పున 90 డిపోల నుంచి 750 మంది కార్మికులు, 150 మంది అధికారులతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో భేటీ అయ్యారు.

బస్సుల్లో టికెట్ తీసుకోకపోతే కండక్టర్‌కు విధిస్తున్న పెనాల్టీని ప్రయాణీకులపై వేయాలని డిసైడ్ అయ్యారు. ఆర్టీసీ మనుగడ కోసం కష్టించి పనిచేయాలని కార్మికులకు సూచించారు. మహిళా కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని, వీరికి డిపోల్లో ప్రత్యేక వసతులు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

తమ డిమాండ్లు పరిష్కరించాలని 52 రోజులుగా కార్మికులు చేసిన సమ్మెపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే సానుకూలంగా స్పందించింది. అప్పటి వరకు కఠినంగా వ్యవహరించిన సీఎం కేసీఆర్..కార్మికులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని విధుల్లో చేరాలని సూచించారు. దీంతో కార్మికుల్లో సంతోషం పెల్లుబికింది.