TSRTC Hikes Student Passes: తెలంగాణలో విద్యార్థులకు ఆర్టీసీ షాక్, అమాంతం పెరిగిన స్టూడెంట్ బస్ పాస్ చార్జీలు, ఏ పాస్ ఎంత పెరిగిందో తెలుసా?

డీజిల్ సెస్ (Diesel Cess) పేరుతో బస్సు ఛార్జీలను భారీగా పెంచిన తెలంగాణ ఆర్టీసీ ఇప్పుడు రూట్ బస్ పాస్ ఛార్జీలను కుడా పెంచింది.

TSRTC Bus- Image used for representational purpose | Photo: Wikimedia Commons

Hyderabad, June 10: చమురు ధరలు విపరీతంగా పెరగడంతో విద్యార్థుల బస్‌పాస్‌లపై (Bus pass) పెను ప్రభావం చూపింది. ఆర్టీసీ (RTC) పిడుగుపాటులా పెంచిన చార్జీలతో విద్యార్థి లోకంపై అశనిపాతమే అయింది. కోవిడ్‌ (Covid) కారణంగా రెండేళ్ల పాటు ఆఫ్‌లైన్‌ చదువులతో ఢక్కామొక్కీలు తిన్న విద్యార్థులు.. ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న పరిస్థితులతో స్కూళ్లు, కాలేజీలకు వెళ్లి చదువుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ పెంచిన బస్‌పాస్‌ చార్జీలు (Bus pass Charges) గ్రేటర్‌లోని లక్షలాది మంది విద్యార్థులను బెంబేలెత్తిస్తున్నాయి. డీజిల్ సెస్ (Diesel Cess) పేరుతో బస్సు ఛార్జీలను భారీగా పెంచిన తెలంగాణ ఆర్టీసీ ఇప్పుడు రూట్ బస్ పాస్ ఛార్జీలను కుడా పెంచింది.

Covid in TS: తెలంగాణలో పెరుగుతున్న కేసులు, గత వారం 555 కేసులు నమోదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపిన హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు  

ఇప్పటి వరకు కేవలం రూ.165 తో నెల రోజుల పాటు ప్రయాణం చేసినవారు.. ఇక నుంచి ఏకంగా రూ.400 చెల్లించాల్సి ఉంటుంది. తాజాగా బస్‌పాస్‌ చార్జీలను పెంచడంతో పాటు రెండు దశాబ్దాల క్రితం నాటి రాయితీలను కూడా సవరించడంతో భారం రెండింతలైంది. దీంతో పేద, మధ్యతరగతి విద్యార్థుల చదువులకు ఇప్పుడు ఆర్టీసీ చార్జీలే గుదిబండగా మారాయి. మరోవైపు విద్యార్థుల బస్‌పాస్‌ రాయితీల నుంచి ఆర్టీసీ క్రమంగా తప్పుకొనేందుకే ఈ భారాన్ని మోపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిణామం పట్ల విద్యార్ధి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పెంచిన చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

Telangana Schools:తెలంగాణలో స్కూళ్ల ప్రారంభంపై కీలక ఆదేశాలు, ఎప్పటి నుంచి స్కూళ్లు తెరుస్తారో తెలుసా? జులై 1 నుంచే అన్ని తరగతుల విద్యార్ధులకు పాఠాలు  

సుమారు 5 లక్షల మంది విద్యార్ధులు నెలవారీ, మూడు నెలల సాధారణ బస్‌పాస్‌లతో పాటు గ్రేటర్‌ హైదరాబాద్‌ పాస్‌లు,రూట్‌ పాస్‌లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. జిల్లా బస్సుల్లో నగర శివార్ల వరకు అనుమతించే బస్‌పాస్‌లు కూడా ఉన్నాయి. మూడు నెలల పాటు సిటీ బస్సుల్లో ప్రయాణం చేసేందుకు తీసుకొనే క్వార్టర్లీ పాస్‌ ధర రూ.490 నుంచి ఇప్పుడు ఏకంగా రూ.1200కు పెరిగింది. ప్రతి రోజు ఒకే మార్గంలో రాకపోకలు సాగించేందుకు తీసుకొనే రూట్‌పాస్‌లు 8 కిలోమీటర్ల వరకు రూ.200 ఉండగా ప్రస్తుతం రూ.600కు పెంచారు.

ప్రస్తుతం వివిధ రకాల విద్యార్థుల పాస్‌లపై ఆర్టీసీకి ప్రతి నెలా రూ.8 కోట్ల వరకు ఆదాయం లభిస్తుండగా చార్జీల పెంపుతో మరో రూ.15 కోట్లకుపైగా అదనంగా లభించనుంది. ప్రతి సంవత్సరం విద్యార్థులపై రూ.180 కోట్లకుపైగా అదనపు భారం పడనుంది. ఈ విద్యా సంవత్సరం కోసం విద్యార్థుల నుంచి ఆర్టీసీ బస్‌పాస్‌ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ నెల 10 నుంచి దరఖాస్తులను స్వీకరించి 15 నుంచి జారీ చేయనుంది. కొత్త చార్జీల ప్రకారమే ఈ పాస్‌లను అందజేయనున్నారు.