Mega Vaccination Drive in HYD: తెలంగాణలో 40 వేల మందికి ఒకేసారి టీకాలు, హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వేదికగా రేపు మెగా డ్రైవ్‌ను చేపట్టనున్న మెడికవర్ ఆస్పత్రి, టీకా కోసం బారులు తీరిన ఐటీ ఉద్యోగులు, నేటి నుంచి విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సిన్ కార్యక్రమం
ఒకేరోజు ఏకంగా 40 వేల మందికి టీకాలు (Mega Vaccination Drive in HYD) వేసేందుకు సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూ రిటీ కౌన్సిల్ (ఎస్‌సీఎస్‌సీ)తో కలసి మెడికవర్ ఆస్పత్రి ఈ మెగా డ్రైవ్‌ను చేపడుతోంది.
Hyderabad, June 5: దేశంలోకెల్లా అతి పెద్ద టీకా కార్యక్రమం రేపు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరగనుంది. ఒకేరోజు ఏకంగా 40 వేల మందికి టీకాలు (Mega Vaccination Drive in HYD) వేసేందుకు సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూ రిటీ కౌన్సిల్ (ఎస్‌సీఎస్‌సీ)తో కలసి మెడికవర్ ఆస్పత్రి ఈ మెగా డ్రైవ్‌ను చేపడుతోంది.
ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిరాటంకంగా టీకాల కార్యక్రమం (Mega Coronavirus vaccination drive) జరుగుతుందని, ఇందుకోసం 500 కౌంటర్లను ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. టీకాలకు అర్హులైన (18 ఏళ్లు నిండిన) వారు http://medicoveronline.com/vaccination వెబ్‌సైట్‌లో స్లాట్ బుక్ చేసుకోవచ్చని, కోవాగ్జిన్ టీకా వేస్తామని పేర్కొన్నారు. టీకా ధరను అన్ని చార్జీలతో కలిపి రూ.1,400గా నిర్ణయించామన్నారు. మరిన్ని వివరాలకు 040–6833 4455 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలన్నారు.
నగరంలోని హెచ్ఐసీసీలో ఐటీ ఉద్యోగుల వాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ రెండో రోజు కొనసాగుతోంది. వ్యాక్సిన్ వేయించుకునేందుకు కార్పొరేట్ సంస్థల ఉద్యోగులు పెద్ద ఎత్తున్న ఈ డ్రైవ్‌లో పాల్గొంటున్నారు. రోజుకు పది వేల మందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఐటీ ఉద్యోగులు కుటుంబ సభ్యులతో పాటు వచ్చి వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. వ్యాక్సిన్ కోసం నిర్వాహకులు పది కౌంటర్లను ఏర్పాటు చేశారు. వ్యాక్సిన్ వేయించుకునే ఉద్యోగులు కోవిన్ ఆప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని సంస్థ ఐడి కార్డు తప్పనిసరి సరిగా తీసుకురావాలని నిర్వాహకులు స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే కరోనా టీకా కోసం ఐటీ ఉద్యోగులు బారులు తీరారు. వ్యాక్సిన్ కోసం కొన్ని ఐటీ సంస్థలు అపోలో ఆస్పత్రితో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా శుక్రవారం హైటెక్స్‌లో వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించారు. ఐటీ ఉద్యోగులు ఈ ప్రాంతానికి భారీగా చేరుకుని టీకాలు వేయించుకున్నారు. వ్యాక్సిన్ కోసం కిలోమీటరు మేర వరుసలో నిల్చున్నారు. 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు వేస్తున్న నేపథ్యంలో శుక్రవారం ఒక్కరోజే ఐదువేల మంది వ్యాక్సిన్ వేయించుకున్నారని నిర్వాహకులు తెలిపారు.
ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులందరికీ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా శనివారం నుంచి టీకాలు వేయనున్నారు. టీకాలు వేసేందుకు శుక్రవారం పోర్టల్ అందుబాటులోకి తీసుకురాగా.. తొలిరోజు మూడువేలకుపైగా దరఖాస్తులు వచ్చాయని వైద్యశాఖ వర్గాలు తెలిపాయి. కేటగిరిలో రోజుకు 350 మందికి టీకాలు వేయాలని వైద్యశాఖ నిర్ణయించింది. శనివారం టీకాలు తీసుకోనున్న 350 మంది విద్యార్థులకు మెస్సేజ్‌లు పంపారు. విడుతల వారీగా విద్యార్థులందరికీ మెస్సేజ్‌లు వస్తాయని, ఎవరూ ఆందోళన చెందవద్దని అధికారులు సూచించారు.
మరో వైపు విద్యార్థుల సౌలభ్యం కోసం రెండో టీకా పొందే గడువును సైతం ప్రభుత్వం సడలించింది. తొలిడోసు తీసుకున్న నాలుగు వారాలకే రెండో డోసు పొందడానికి అవకాశం కల్పించింది. హైదరాబాద్ నారాయణగూడలోని ఐపీఎం ఆవరణలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకూ టీకా పంపిణీ కొనసాగనుంది. టీకా వేయించుకునేందుకు ప్రతి విద్యార్థి తన మొబైల్‌కు వచ్చిన సంక్షిప్త సందేశాన్ని, ఓటీపీని తప్పక చూపించాల్సి వ్యాక్సినేషన్ సెంటర్‌లో తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది.
పాస్‌పోర్టుతో పాటు వీసాను వెంట తెచ్చుకోవాలి, వీసా లేకపోతే.. ఏ విశ్వవిద్యాలయంలో చదువుతున్నారో ఆ సంస్థలో ప్రవేశపత్రాన్ని చూపించాలని అధికారులు స్పష్టం చేశారు. 18-44 ఏళ్ల మధ్య వయస్కులైన విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు మాత్రమే ఇక్కడ టీకా వేయనుండగా.. లాక్‌డౌన్ సందర్భంగా ఎక్కడైనా పోలీసులు ఆపితే.. మొబైల్‌లో ఉన్న సంక్షిప్త సందేశాన్ని చూపిస్తే అనుమతి ఇస్తారని అధికారులు తెలిపారు.