Mumbai, JAN 01: కొత్త సంవత్సరం సందర్భంగా పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌లు (Mumbai Police Special Drive) చేపట్టారు. రికార్డు స్థాయిలో సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు రూ.89 లక్షల మేర చలాన్లు జారీ చేశారు. (Traffic Challans) మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. దేశ వాణిజ్య రాజధాని ముంబై, న్యూ ఇయర్ వెల్‌కమ్ పార్టీలతో హోరెత్తింది. ఈ నేపథ్యంలో నగరంలో భారీగా పోలీసులను మోహరించారు. డిసెంబర్ 31న సాయంత్రం, రాత్రి వేళ ఎనిమిది మంది అదనపు కమిషనర్లు, 29 మంది డిప్యూటీ కమిషనర్లు, 53 మంది అసిస్టెంట్ కమిషనర్లు, 2184 మంది ఇన్స్పెక్టర్లు, 12,000 మందికి పైగా కానిస్టేబుళ్లు విధుల్లో ఉన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై నిఘా పెట్టారు.
కాగా, న్యూ ఇయర్ ఈవ్ వేళ రూ.89 లక్షల మేర జరిమానాలను ముంబై ట్రాఫిక్ (Mumbai Traffic Police) పోలీసులు విధించారు. ట్రాఫిక్ నేరాలకు సంబంధించి మొత్తం17,800 ఈ-చలాన్‌లు జారీ చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించినందుకు 2,893 చలాన్లు, హెల్మెట్ లేకుండా రైడింగ్‌కు 1,923, సిగ్నల్స్ జంపింగ్‌కు 1,731, ప్రజా రవాణా వాహనాలకు సంబంధించి 1,976, స్పీడ్ లిమిట్ ఉల్లంఘనలకు 842, సీటు బెల్ట్ లేకుండా డ్రైవింగ్ చేసినందుకు 432 చలాన్లు జారీ చేశారు.
మరోవైపు మద్యం తాగి వాహనాలు నడిపే వారిని గుర్తించేందుకు రద్దీ ప్రాంతాల్లో చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. డ్రంకన్ డ్రైవ్ నిర్వహించారు. దీంతో మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి 153 చలాన్లు జారీ చేశారు. అలాగే డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడటంపై 109, ట్రిపుల్ రైడింగ్‌కు 123, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడంపై 40, ప్రమాదకరంగా డ్రైవింగ్ చేసినందుకు రెండు చలాన్లు జారీ చేశారు. ఇలా న్యూ ఇయర్ ఈవ్ వేళ జారీ చేసిన చలాన్ల మొత్తం రూ.89,19,750 అని ట్రాఫిక్ పోలీస్ అధికారి వెల్లడించారు.