Rain in Telugu States: తీరం దాటిన వాయుగుడం, తెలుగు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్, రెండు రాష్ట్రాల్లో అన్ని స్కూళ్లకు సెలవులు
ప్రస్తుతం వాయవ్య దిశగా పయనిస్తూ ఉత్తరాంధ్ర మీద ఆవరించి నేటి సాయంత్రం లేదంటే రేపు ఉదయానికి బలహీనపడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
Hyd, Sep 1: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గత అర్ధరాత్రి 12.30-2.30 గంటల మధ్య కళింగపట్నం సమీపంలో తీరం (Cyclone crossed the coast at Kalingapatnam) దాటింది. ప్రస్తుతం వాయవ్య దిశగా పయనిస్తూ ఉత్తరాంధ్ర మీద ఆవరించి నేటి సాయంత్రం లేదంటే రేపు ఉదయానికి బలహీనపడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలు (Rain in Telugu States) జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. రవాణా సౌకర్యాన్ని అస్తవ్యస్తం చేశాయి. విజయవాడలో కురుస్తున్న భారీ వర్షాలకు మొగల్రాజపురం సున్నపుబట్టి సెంటర్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేసింది. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాటు చేసింది. వర్షాలు తగ్గేవరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వీడియోలు ఇవిగో, హైదరాబాద్ విజయవాడ హైవేపై రాకపోకలు బంద్, రెండు అడుగుల మేర ప్రవహిస్తున్న వరద నీరు
భారీ వర్షాల నేపథ్యంలో పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు రెడ్ అలర్ట్, ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్టు ప్రకటించారు. ఉత్తరాంధ్ర తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని, ఈరోజు, రేపు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని తెలిపారు. గడిచిన 24 గంటల్లో అమరావతిలో 26 సెంమీ, తిరువూరులో 25, గుంటూరులో 23, తెనాలిలో 18, మంగళగిరిలో 17, విజయవాడలో 17.5 సెం.మీ చొప్పున అత్యధిక వర్షపాతం నమోదైనట్టు వివరించారు.
వరద ఉద్ధృతి కారణంగా సోమవారం (సెప్టెంబరు 2) విద్యా సంస్థలకు సెలవు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఆదేశాలు పాటించని ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు ఇప్పటి వరకు 9 మంది మృతి చెందగా, పలువురు గల్లంతైన విషయం తెలిసిందే. ప్రయాణికులకు అలర్ట్, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సుల నిలిపివేత, ఐతవరం వద్ద రోడ్డుపైకి భారీగా వరద నీరు
పలుచోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతున్నది. తెలంగాణ – ఏపీ మధ్య నిలిచిన వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణ – ఏపీ సరిహద్దు రామాపురం వద్ద చిమిర్యాల వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. కోదాడ నుంచి వరదనీరు దిగువకు ప్రవహిస్తుంది. నల్లబండగూడెం వద్ద జాతీయ రహదారిపైకి నీరు చేరడంతో అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఇక ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామం వద్ద జాతీయ రహదారిపై మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. హైవేపై మోకాళ్ల లోతు వరద ఉండడంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు.
విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు రాకుండా పోలీస్ రెవెన్యూ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ వైపు చిలకల్లు టోల్ ప్లాజా వద్ద, విజయవాడ వైపు కీసర టోల్ ప్లాజా వద్ద వాహనాలను నిలిపివేశారు. దీంతో హైవే పూర్తిగా స్తంభించిపోయింది. వరద ఉధృతి తగ్గే వరకు వాహనాలను హైవేపైకి అనుమతించబోమని నందిగామ ఆర్డీవో తెలిపారు.
వరదల నేపథ్యంలో రైళ్ల రాకపోలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి, ఇంటికన్నె మధ్య రైల్వేట్రాక్ కింద మట్టి కోతకు గురైంది. పట్టాల కింద నుంచి భారీగా వరద ప్రవహిస్తున్నది. ఈ క్రమంలో ఆ మార్గంలో అధికారులు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. వర్షాల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో దాదాపు 40 రైళ్లు వరకు రద్దయ్యాయి. అదే సమయంలో పెద్ద ఎత్తున రైళ్లను అధికారులు దారి మళ్లించారు.
తెలంగాణ వానలపై వాతావరణశాఖ కీలక ప్రకటన చేసింది. వర్షాలు మరో ఐదురోజుల పాటు కొనసాగుతాయని హెచ్చరించింది. ఆదివారం ఆదిలాబాద్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంటూ రెడ్ అలెర్ట్‌ను జారీ చేసింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడుతాయని చెప్పింది.
దాంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. మేడ్చల్ మల్కాజ్‌గిరి, జోగులాంబ గద్వాలతో పాటు పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. సోమవారం నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్క భారీ వర్షాలు నమోదవుతాయని అంచనా వేసింది. ఇక గడిచిన 24 గంటల్లో అతిభారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఖమ్మం జిల్లా కాకర్వాయ్‌లో అత్యధికంగా 52 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది. మహబూబాబాద్ ఇనగుర్తిలో 45.6, వరంగల్ జిల్లా రెడ్లవాడలో 45.4, మహబూబాబాద్ చిన్నగూడూర్‌లో 45.2 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైందని టీజీడీపీఎస్ వివరించింది.
భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. సోమవారం సాయంత్రం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.