Pongal Tragedy: సంక్రాంతి పండుగ వేళ రెండు కుటుంబాల్లో విషాదం.. బైక్ వస్తుండగా చైనా మాంజా మెడకు చుట్టుకొని జవాను బలి.. పతంగి కోసం వెళ్లి భవనంపై నుంచి కాలుజారిపడి ఏఎస్సై కుమారుడు మృతి
వ్యాపారులు అమ్మొద్దని, ప్రజలు వాడొద్దని నిషేధించిన చైనా మాంజా మెడకు చుట్టుకొని ఆర్మీ జవాన్ ప్రాణాలు కోల్పోయాడు. పతంగి ఎగరేస్తూ ఏఎస్సై కుమారుడు భవనంపై నుంచి పడి చనిపోయాడు.
Hyderabad, Jan 15: సంక్రాంతి (Pongal) పండుగ వేళ రెండు కుటుంబాల్లో విషాదం (Tragedy) అలుముకున్నది. వ్యాపారులు అమ్మొద్దని, ప్రజలు వాడొద్దని నిషేధించిన చైనా మాంజా (China Manja) మెడకు చుట్టుకొని ఆర్మీ జవాన్ ప్రాణాలు కోల్పోయాడు. పతంగి ఎగరేస్తూ ఏఎస్సై కుమారుడు భవనంపై నుంచి పడి చనిపోయాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని విశాఖకు చెందిన కోటేశ్వర్‌రెడ్డి (29) ఆర్మీలో పనిచేస్తూ 20 రోజుల క్రితం బదిలీపై హైదరాబాద్ కు వచ్చాడు. అత్తాపూర్ సమీపంలోని నలందనగర్ లో తన భార్య, రెండేండ్ల కూతురుతో కలిసి నివాసముంటూ లంగర్ హౌస్ లోని గోల్కొండ మిలటరీ దవాఖానలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం సాయంత్రం లంగర్ హౌస్ ఫ్లై ఓవర్ పై తన ద్విచక్రవాహనంపై వెళ్తుండగా, అకస్మాత్తుగా గొంతుకు చైనా మాంజా తగిలి కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం ఆయనను ఉస్మానియా దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచాడు.
పతంగి కోసం..
ఇక, అల్వాల్ పోలీస్ స్టేషన్ లో ఏఎస్‌ఐగా పని చేస్తున్న రాజశేఖర్ చిన్న కుమారుడు ఆకాశ్ (20) అల్వాల్ లోని లయోల కళాశాలలో డిగ్రీ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. కొంపల్లిలోని ఎన్ సీఎల్ కాలనీలో గ్యాస్ గెడ్ గ్రీన్స్ అపార్ట్ మెంట్‌లో ఐదో అంతస్థు భవనంపై నుంచి ఆదివారం మధ్యాహ్నం అపార్ట్ మెంట్‌వాసులతో కలిసి పతంగి ఎగురవేస్తున్నాడు. ఈ క్రమంలో పతంగి కింద చిక్కుకున్నది. ఆ పతంగిని బయటకు తీసేందుకు భవనంపై నుంచి కిందకు దిగేందుకు ప్రయత్నిస్తూ ప్రమాదవశాత్తూ కాలుజారీ కిందపడిపోయాడు. తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించగా అప్పటికే ఆకాశ్ చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు.