Telangana: ఈ సమయాలు తప్పక గుర్తించుకోవాలి..బస్సులు,మెట్రో రైళ్లు తిరిగే వేళలు, మందుబాబులు మందు కొనుగోలు చేయాల్సిన సమయం, బార్లకు వెళ్లే వారు ఏ సమయంలో వెళ్లాలి, తెలంగాణ లాక్‌డౌన్ నేపథ్యంలో వీటి సమయాల గురించి తెలుసుకోండి
అయితే అన్ని రకాల కార్యకలాపాలకు అనుమతినిచ్చిన ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్య మాత్రమే వైన్ షాపులు, బార్, రెస్టారెంట్‌లు (iquor-shops-timings) తెరుచుకోవచ్చని స్పష్టం చేసింది.
Hyderabad, May 12: తెలంగాణలో లాక్‌డౌన్ కాలంలోనూ మద్యం విక్రయాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే అన్ని రకాల కార్యకలాపాలకు అనుమతినిచ్చిన ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్య మాత్రమే వైన్ షాపులు, బార్, రెస్టారెంట్‌లు (iquor-shops-timings) తెరుచుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం విక్రయించే సమయంలో కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఆదేశించింది.
అన్ని దుకాణాల ముందు భౌతికదూరం పాటించేలా రింగులు ఏర్పాటు చేసి వినియోగదారులు వాటిలో నిలబడి మద్యం కొనుగోలు చేసేలా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. పర్మిట్ రూమ్స్ తెరిచేందుకు వీల్లేదని, కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తే షాపులను సీజ్ చేస్తామని ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మద్యం కొనుగోలు చేసేందుకు వచ్చిన ప్రజలను అదుపు చేసే బాధ్యత కూడా షాపు యజమాన్యమే తీసుకోవాలని తెలిపారు. అయితే దీనిపై బార్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ఉదయం పూట బార్లకు ఎవరు వస్తారని ప్రశ్నిస్తున్నారు.
గత లాక్‌డౌన్ (Lockdown) సమయంలోనే తాము తీవ్రంగా నష్టపోయామని, లైసెన్సు ఫీజులు కూడా కట్టలేని పరిస్థితుల్లోకి వెళ్లామని, మళ్లీ ఇప్పుడు లాక్‌డౌన్‌కు వెళితే అసలు బార్లు నడిపే పరిస్థితి కూడా ఉండదంటున్నారు. దీంతో బార్ల నుంచి కూడా మద్యాన్ని రిటైల్‌గా అమ్ముకునే అవకాశం ఇవ్వాలని, లేదంటే వైన్ షాపులు బంద్ చేసిన తర్వాత బార్ల నుంచి డోర్ డెలివరీకి అనుమతివ్వాలని నిర్వాహకులు కోరుతున్నారు.
లాక్‌డౌన్ నేపథ్యంలో నేటి నుంచి ఉదయం 6 నుంచి ఉదయం 10 గంటల వరకే బస్సులు (bus-service) నడుస్తాయని ఆర్టీసీ పేర్కొంది. సిటీ బస్సులు, జిల్లా సర్వీసులు కూడా ఈ సమయంలోనే నడుస్తాయని, ఆయా డిపోల పరిధిలో బస్సుల సమయాల్లో మార్పులు చేస్తారని పేర్కొంది. ఇతర రాష్టాలకు బస్సులు నడపమని వెల్లడించింది. ఈ సడలింపు 4 గంటల వ్యవధిలో గమ్యస్థానాలకు వెళ్లగలిగిన ప్రాంతాలకే బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది.
ఇక మెట్రో రైళ్లు ఉదయం 7 నుంచి 9:45 గంటల వరకు రాకపోకలు (metro service) సాగించనున్నాయి. తొలి రైలు ఉదయం 7 గంటలకు ఎల్‌బీనగర్ నుంచి మొదలుకానుంది. చివరి రైలు 8:45 ఎల్‌బీ నగర్ నుంచి బయలుదేరి 9:45కు మియాపూర్ చేరుకుంటుందని ఎల్‌అండ్‌టీ మెట్రో మేనేజింగ్ డైరెక్టర్ కేవీబీ రెడ్డి తెలిపారు. ప్రయాణికులు విధిగా మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని, సురక్షిత మెట్రో ప్రయాణానికి ఏర్పాట్లు చేశామని తెలిపారు.
ప్రభుత్వం 4 గంటలు మాత్రమే ప్రజారవాణాకు అనుమతి ఇవ్వడంతో.. ప్రైవేట్ బస్సులు, క్యాబ్‌లు, ఇతర రవాణా వాహనాలకు బ్రేక్ పడనుంది. హైదరాబాద్‌లో సుమారు 1.40 లక్షల ఆటో రిక్షాలు, 50 వేల క్యాబ్‌లు లాక్‌డౌన్ తో స్తంభించనున్నాయి. ఆటో రిక్షాలు, క్యాబ్‌లు కూడా లాక్‌డౌన్ మార్గదర్శకాల్లో భాగంగా ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే రాకపోకలు సాగించనున్నాయి. ఈ రంగంపై ఆధారపడ్డ 2 లక్షల మంది కార్మికులు లాక్‌డౌన్ తో ఉపాధి కోల్పోయే అవకాశముంది. నగరంలో 2,750 ఆర్టీసీ బస్సులు ఉండగా, లాక్‌డౌన్ వల్ల 1,000 బస్సులకు మించి తిరిగే అవకాశం లేదు. దీంతో గ్రేటర్‌లో ఆర్టీసీకి రూ.2 కోట్ల నష్టం వాటిల్లనున్నట్లు తెలుస్తోంది.
విమానాలు, రైళ్లలో ప్రయాణించే వారు టికెట్‌ను చూపడం ద్వారా విమానాశ్రయం, రైల్వేస్టేషన్లకు చేరుకోవచ్చని అధికారవర్గాలు తెలిపాయి.