Telangana: మిస్టరీగా మారిన మొండెం లేని మనిషి తల, నల్గొండ జిల్లాలో మహంకాళి దేవాలయం వద్ద షాకింగ్ ఘటన, మరో ఘటనలో.. వరంగల్ జిల్లాలో భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్యపై కేసు నమోదు
జిల్లాలోని చింతపల్లి మండలం గొల్లపల్లిలో దుండగులు... గుర్తుతెలియని వ్యక్తిని హత్యచేశారు. ఆ తర్వాత.. తలను, మొండెంను వేరు చేసి విరాట్‌నగర్‌లోని మహంకాళి ఆలయం (Mahankali temple) వద్ద పడేశారు.
Nalgonda, Jan 10: నల్లగొండ జిల్లాలో దారుణ ఘటన (Nalgonda Horrific Incident) చోటుచేసుకుంది. జిల్లాలోని చింతపల్లి మండలం గొల్లపల్లిలో దుండగులు... గుర్తుతెలియని వ్యక్తిని హత్యచేశారు. ఆ తర్వాత.. తలను, మొండెంను వేరు చేసి విరాట్‌నగర్‌లోని మహంకాళి ఆలయం (Mahankali temple) వద్ద పడేశారు. మరుసటి రోజు తెల్లవారిన తరువాత దేవాలయం వద్ద తలను (Decapitated head found ) చూసిన భక్తులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆలయం చుట్టుపక్కల సీసీ కెమెరాలు లేకపోవడంతో పోలీసులకు దర్యాప్తునకు ఆటంకంగా మారింది. పోలీసులు ఇప్పటికే ప్రత్యేక బృందాలను, డాగ్‌స్వ్కాడ్‌లను రంగంలోకి దింపారు. హత్యకు ఏదైన వివాహేతర సంబంధం ఉందా?.. రాత్రి నరబలి చేశారా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
ఇక వరంగల్ జిల్లాలో భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్యపై కేసు నమోదు చేసినట్లు సీఐ తిరుపతి తెలిపారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం కట్టుగుట్టతండాకు చెందిన భూక్యా శంకర్(30) తన భార్యతో తరచూ గొడవ పడుతుండేవాడు. ఈనెల 2న మద్యం సేవించిన శంకర్ ఇంట్లో మత్తుగా పడుకున్నాడు. భర్తను హతమార్చాలని పక్కా ప్లాన్ వేసుకున్న అతడి భార్య అర లీటరు పెట్రోల్ కొనుక్కొని వచ్చింది.
మద్యం మత్తులో నిద్రలో ఉన్న శంకర్‌పై పెట్రోల్ పోసి పోయిలోని నిప్పు తెచ్చి అంటించి పరారయ్యింది. మంటలు చెలరేగడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి నీరు పోసి ఆర్పారు. క్షతగాత్రుడిని 108 వాహనంలో ఖమ్మం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శంకర్ శనివారం రాత్రి మృతిచెందాడు. మృతుడి తండ్రి బావ్‌సింగ్ ఫిర్యాదు మేరకు శంకర్ భార్య కవితపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తిరుపతి తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.