Representational Image | (Photo Credits: IANS)

Hyd, Jan 7: హైదరాబాద్ నగరంలో వనస్థలిపురంలో గతంలో సంచలనం రేపిన గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసును వనస్థలిపురం పోలీసులు ( Vanasthalipuram Police) ఛేదించారు. గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసి, దుప్పట్లో చుట్టి నిర్మానుష్య ప్రదేశంలో పడేసిన ఘటనలో ఇద్ధరినీ అరెస్టు (Woman, paramour arrested in murder case) చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా హతుడి జేబులో లభించిన ఓ ఏటీఎం కార్డు నిందితులను పట్టించిందని పోలీసులు తెలిపారు.

వనస్థలిపురం ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... నల్గొండ జిల్లా బొమ్మకల్‌ గ్రామానికి చెందిన కె. ప్రియాంక కి పెళ్లి కాగా, భర్తకు విడాకులు ఇచ్చి ఉదయ్‌కుమార్‌ అనే వ్యక్తిని రెండోపెళ్లి చేసుకుంది. రెండో భర్త గతేడాది కరోనాతో మృతి చెందాడు. దీంతో ప్రియాంక మిర్యాలగూడలో ఇల్లు అద్దెకు తీసుకుని ఒంటరిగా ఉండేది. ఈ క్రమంలో ఫిలింనగర్‌కు చెందిన ఎ. సాయికుమార్‌తో షేర్‌ చాట్‌ యాప్‌ ద్వారా పరిచయం ఏర్పడి తదనంతరం అది వివాహేత సంబంధానికి దారితీసింది.

గత అక్టోబర్‌లో మిర్యాలగూడ నుంచి వనస్థలిపురం కమలానగర్‌ కాలనీకి ప్రియాంక మకాం మార్చింది. అక్కడ ఉంటూ సాయికుమార్‌తో పాటు మరో వ్యక్తితో ప్రియాంక సంబంధం పెట్టుకుంది. చనిపోయిన రెండో భర్త స్నేహితుడు సూర్యాపేటకు చెందిన గుడిపాటి శ్రీనివాస్‌ ఆమె యోగ క్షేమాలు చూసుకుంటూ వచ్చాడు. గత డిసెంబర్‌ 10న శ్రీనివాస్‌... ప్రియాంక ఇంటికి రాగా అక్కడ సాయికుమార్‌ కనిపించాడు. దీంతో ఇద్దరితో ఎలా సంబంధం కొనసాగిస్తున్నావని నిలదీశాడు.

ఖర్చులకు డబ్బులు లేవని భర్త కిడ్నాప్ నాటకం, రూ 2 లక్షలు అకౌంట్లో వేయాలని భార్యకు మెసేజ్, ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో షాక్

ఇరువురి మధ్య గొడవ పెరగడంతో సాయికుమార్‌ ఇంట్లో ఉన్న రోకలిబండతో శ్రీనివాస్‌ తలపై బలంగా కొట్టడంతో చనిపోయాడు. ఈ విషయాన్ని ప్రియాంక తనతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మరో వ్యక్తికి ఫోన్‌లో చెప్పింది. అతడి సలహా మేరకు శ్రీనివాస్‌ మృతదేహాన్ని దుప్పట్లో మూటగట్టి అదే రోజు రాత్రి బైక్‌పై విజయపురికాలనీ బస్టాప్‌ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఇద్దరూ పడేశారు. ఘటనా స్థలంలో ఎలాంటి ఆధారాలు పోలీసులకు లభించకుండా జాగ్రత్త పడ్డ నిందితులు మృతుడి జేబులో ఉన్న ఏటీఎం కార్డును మాత్రం గుర్తించలేదు. పోలీసులకు ఈ కార్డు లభించింది. దీని ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి నిందితులు సాయికుమార్, ప్రియాంకలను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.