AP&TS Water Dispute: 203 జీవోపై స్టే విధించిన ఎన్‌జీటీ, పోతిరెడ్డిపాడు,రాయలసీమ ఎత్తిపోతల పథకానికి తాత్కాలిక బ్రేక్, తెలంగాణ ప్రాజెక్టులపై డీపీఆర్‌ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరిన కృష్ణా బోర్డు

ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విడుదల చేసిన 203 జీవోపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌(NGT) స్టే విధించింది. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి ఎలాంటి పనులు చేపట్టవద్దని ఎన్జీటీ (National Green Tribunal) ఆదేశాలు జారీ చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై కేంద్ర పర్యావరణ శాఖకు సంబంధించిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.

Srisailam reservoir (Photo-Twitter)

Hyderabad, May 20: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీ పెంపు, రాయలసీమ ఎత్తిపోతల పథకానికి తాత్కాలిక బ్రేక్ పడింది. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విడుదల చేసిన 203 జీవోపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌(NGT) స్టే విధించింది. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి ఎలాంటి పనులు చేపట్టవద్దని ఎన్జీటీ (National Green Tribunal) ఆదేశాలు జారీ చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై కేంద్ర పర్యావరణ శాఖకు సంబంధించిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. మలుపులు తిరుగుతున్న నీటి వివాదం, రాయలసీమకు గోదావరి మిగులు జలాలు తీసుకుపొమ్మన్న కేసీఆర్, మా నీళ్లను మేము వాడుకుంటామని స్పష్టం చేసిన ఏపీ సర్కారు

ఈ కమిటీలో కృష్ణా నదీ జలాల నిర్వహణ బోర్డు సీనియర్ సభ్యుడు, హైదరాబాద్ ఐఐటీ నుంచి ఒక సభ్యుడు, కాలుష్య నివారణ బోర్డు సభ్యుడు ఉంటారు. రెండు నెలల్లో దీనిపై నివేదిక సమర్పించాలని కమిటీని గ్రీన్ ట్రైబ్యునల్ కోరింది. రెండు నెలల్లో నివేదిక అందజేయాలని కమిటీని ట్రిబ్యునల్‌ ఆదేశించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ప్రాజెక్టు పనులు ప్రారంభించొద్దని ఏపీకి ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది.

దీంతో పాటుగా కృష్ణా నదీ జలాలను వినియోగించుకుంటూ చేపట్టిన ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం (AP Govt) చేసిన ఫిర్యాదుపై అభిప్రాయాలు చెప్పాలని కృష్ణా బోర్డు తెలంగాణను (Telangana) కోరింది. కొత్తగా నిర్మిస్తున్నారని ఏపీ (Andhra Pradesh) చెబుతున్న ప్రాజెక్టులతో పాటు మరింత నీటిని వినియోగించుకునేలా విస్తరించిన ప్రాజెక్టుల డిటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్టు (డీపీఆర్‌) ఇవ్వాలని సూచించింది.

బోర్డు, కేంద్ర జల సంఘం, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతులు లేకుండానే తెలంగాణ పాలమూరు–రంగారెడ్డి, డిండి, భక్త రామదాస ఎత్తిపోతలతో పాటు మిషన్‌ భగీరథ, తుమ్మిళ్ల ఎత్తిపోతలు చేపట్టిందని ఏపీ చేసిన ఫిర్యాదుపై కృష్ణా బోర్డు (krishna board) స్పందించింది. ఈ ఫిర్యాదుపై అభిప్రాయాలు వెంటనే తెలపాలని తెలంగాణను కోరుతూ బోర్డు సభ్యుడు హరికేశ్‌ మీనా మంగళవారం లేఖ రాశారు.

తెలంగాణ చేపట్టిన 5 కొత్త ప్రాజెక్టులతో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల తాగు, సాగు నీటి అవసరాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని, ఉమ్మడి రాష్ట్రంలోనే చేపట్టిన ప్రాజెక్టులకు నీటి అవసరాలు తీరడం కష్టతరంగా మారుతుందని ఏపీ ఫిర్యాదు చేసిన అంశాన్ని ప్రస్తావించారు. దీంతో పాటు కల్వకుర్తి, నెట్టెంపాడు, శ్రీశైలం లెఫ్ట్‌ బ్యాంకు కెనాల్‌ (ఎస్‌ఎల్‌బీసీ) ప్రాజెక్టుల నుంచి నీటిని తీసుకునే సామర్థ్యాన్ని సైతం పెంచారని ఏపీ చేసిన ఫిర్యాదును గుర్తుచేసింది.

నాగార్జునసాగర్‌ కుడి కాల్వ, హంద్రీ–నీవా ఎత్తిపోతల, ముచ్చుమర్రి ఎత్తిపోతలకు కేటాయింపుల కంటే ఎక్కువగా నీటిని వాడుకున్న నేపథ్యంలో ఆ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయడాన్ని ఆపేయాలని ఏపీ జలవనరుల శాఖ ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డికి కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి ఎ.పరమేశం కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన లేఖ రాశారు. నాగార్జునసాగర్‌ కుడి కాల్వకు 158.225 టీఎంసీలు కేటాయిస్తే 158.264 టీఎంసీలు వాడుకున్నారని, హంద్రీ–నీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతలకు 47.173 టీఎంసీలు కేటాయిస్తే 47.328 టీఎంసీలు వినియోగించుకున్నారని లేఖలో పేర్కొన్నారు.

కేటాయించిన నీటి కంటే అధికంగా వాడుకున్న నేపథ్యంలో ఆ ప్రాజెక్టులకు నీటిని విడుదలను ఆపేయాలని కోరారు. రుతుపవనాలు ప్రవేశించి.. వర్షాలు కురిసే వరకూ అందుబాటులో ఉన్న నీటిని తాగునీటి అవసరాల కోసం వినియోగించుకోవాల్సి ఉంటుందని లేఖలో పేర్కొన్నారు. నీటి కేటాయింపు ఉత్తర్వులను విధిగా పాటించాలని.. ఎలాంటి ఫిర్యాదులకు అవకాశం ఇవ్వరాదని సూచించారు.

ఇదిలా ఉంటే కృష్ణా నదీ జలాల వినియోగంలో తెలుగు రాష్ట్రాలు ఈ ఏడాది వాటర్‌ ఇయర్‌లో రికార్డు సృష్టించాయి. ఈ ఏడాది రెండు రాష్ట్రాలు కలిపి 920.405 టీఎంసీలు వినియోగించుకున్నాయి.ఆంధ్రప్రదేశ్‌ 647.559 టీఎంసీలు వినియోగించుకోగా, తెలంగాణ 272.846 టీఎంసీలు ఉపయోగించుకుంది.