TSRTC Strike Row: ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపలేం, సమ్మె చట్ట విరుద్ధమే, అంతా రాజకీయమే, దీనిపై ఎవరూ ప్రకటించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పిన ఆర్టీసీ యాజమాన్యం, హైకోర్టులో అఫిడఫిట్ దాఖలు

ఆర్టీసీ జేఏసీ నేతలు కేవలం రాజకీయ దురుద్దేశాలతోనే ఈ సమ్మెను ప్రారంభించారు. కార్మికుల డిమాండ్లను పరిష్కరించే ప్రయత్నం చేసినప్పటికీ యూనియన్ నేతలు ఓపిక పట్టకుండా అత్యుత్సాహంతో, బ్లాక్ మెయిల్ ధోరణితో సమ్మెకు వెళ్లారు....

TSRTC MD files an affidavit in High Court over ongoing strike. | Photo Credits ; PTI

Hyderabad, November 16:  సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపలేమని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేస్తుంది. ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యం శనివారం హైకోర్టు (High Court of Telangana) లో అఫిడవిట్  దాఖలు చేసింది. కార్మికులు చేపట్టిన సమ్మె చట్ట విరుద్ధం అని యాజమాన్యం పేర్కొంది. దీనిపై ఎవరూ ప్రకటించాల్సిన అవసరం లేదని తెలిపింది. పారిశ్రామిక వివాదాల చట్టం (Industrial Disputes Act, 1947) ప్రకారం ప్రజా సర్వీసుల్లో ఉన్న వారు సమ్మె చేయడం చట్ట విరుద్ధమేనంటూ అఫిడవిట్ లో పేర్కొంది. సమ్మె లీగలా, కాదా? అన్న విషయం తేల్చాల్సింది ఎవరూ? అని ఇంతకుముందు హైకోర్ట్ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యం అందుకు కౌంటర్ దాఖలు చేసింది.

అఫిడవిట్ లో పేర్కొన్న వివరాల ప్రకారం... ఆర్టీసీ జేఏసీ (TSRTC JAC) నేతలు కేవలం రాజకీయ దురుద్దేశాలతోనే ఈ సమ్మెను ప్రారంభించారు. కార్మికుల డిమాండ్లను పరిష్కరించే ప్రయత్నం చేసినప్పటికీ యూనియన్ నేతలు ఓపిక పట్టకుండా అత్యుత్సాహంతో, బ్లాక్ మెయిల్ ధోరణితో సమ్మెకు వెళ్లారు. దీనివల్ల దసరా సీజన్, పరీక్ష సీజన్ లో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

యూనియన్ నేతల వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆర్టీసీ కార్మికులు, ప్రజలు, యాజమాన్యం అందరూ నష్టపోతున్నారు. ప్రతిపక్ష పార్టీలతో కలిసి యూనియన్ నేతలు బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారు. విలీనం డిమాండ్ కూడా ప్రస్తుతానికి వెనక్కి పెడుతున్నామని చెప్పడం ద్వారా వారి అహంకార ధోరణి అర్థమవుతుంది. అంటే భవిష్యత్తులో మళ్ళీ ఈ విలీనం డిమాండ్ తెరపైకి రావొచ్చు, ప్రభుత్వాన్ని అస్థిర పరిచే కుట్రలు జరుగుతున్నాయి. 40 రోజులుగా జరుగుతున్న సమ్మె వల్ల ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి తీవ్ర సంక్షోభాన్ని ఎందుర్కొంటుంది. సమ్మె చేయడం కార్మికుల హక్కు అయినప్పటికీ, అది చట్టబద్ధంగా ఉండాలి. ఇలాంటి బెదిరింపు సమ్మెలను హైకోర్ట్ ప్రోత్సహించవద్దని ఆర్టీసీ యాజమాన్యం కోర్టుకు విన్నవించింది.

ఒకవేళ కార్మికులు సమ్మె విరమించి,  స్వచ్చందంగా విధుల్లో చేరేందుకు ముందుకొచ్చినా, వారిని తిరిగి కొనసాగించడంపై ఆర్టీసీ యాజమాన్యానికి కష్టంగా మారింది. రాష్ట్ర ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వీలైనంత త్వరగా ఆదేశాలివ్వాలని ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ (Sunil Sharma) హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు.

దీనిపై ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామ రెడ్డి స్పందన ఇలా ఉంది

 

కోర్టు చివాట్లు పెట్టినా ప్రభుత్వ వైఖరి మారలేదు,  ప్రభుత్వ విధానాల వల్లే ఆర్టీసీ నష్టపోయింది. తాము చేస్తున్న సమ్మె లీగలా, ఇల్లీగలా అనేది ఇప్పుడు అప్రస్తుతం.  ఆ అంశం హైకోర్టులో పెండింగ్ లో ఉంది.  43 రోజులుగా మా సమ్మె దిగ్విజయంగా కొనసాగుతుంది. మా వెనక ఏ రాజకీయ పార్టీ లేదు. ఆర్టీసీ ఎండీ రాజకీయ నాయకుడిలా మాట్లాడుతున్నారు. ఆయనకు ఆర్టీసీ గురించి ఎలాంటి అవగాహన లేదు.  సీఎం కేసీఆర్ నియంతృత్వ పోకడలకు ఇది నిదర్శనం, ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తుందంటూ  అశ్వత్థామ రెడ్డి స్పందించారు.

ప్రభుత్వం తప్పుడు అఫిడవిట్లను దాఖలు చేస్తుంది. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించని పక్షంలో కోర్టులే జోక్యం చేసుకుంటాయి. అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్తాం, సుప్రీం కోర్టులోనూ మాకోసం ఫ్రీగా వాదించే లాయర్లు ఉన్నారు. సుప్రీంకోర్టైనా, ప్రపంచ కోర్టైనా, ఏ న్యాయస్థానాలైనా కార్మికుల పక్షానే నిలుస్తాయనే నమ్మకం మాకు ఉందని ఆయన అశాభావం వ్యక్తం చేశారు.

కాగా, గృహ నిర్భంధంలో ఉన్న అశ్వత్థామ రెడ్డి, ఇంట్లో నుంచే తన నిరహార దీక్షను  కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం చర్చలకు పిలిచేంత వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now