Hyderabad, November 12: ఆర్టీసీ సమ్మె (TSRTC Strike) విషయంలో హైకోర్ట్ (High Court of Telangana) చేతేలెత్తేసినట్లే కనిపిస్తుంది. చట్టానికి అతీతంగా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్ట్ తేల్చి చెప్పింది, ఇకపోతే సమ్మె చట్ట విరుద్ధమా? కాదా అన్న విషయం తమ పరిధిలోనిది కాదని అభిప్రాయపడిన హైకోర్ట్, ఇందుకోసం సుప్రీం కోర్ట్ రిటైర్డ్ న్యాయమూర్తులతో కమిటీ వేయాలా? వివరించాలని అడ్వికేట్ జనరల్‌ను కోరింది. అయితే ప్రభుత్వాన్ని అడిగి రేపు వివరిస్తామని అడ్వొకేట్ జనరల్ బదులిచ్చారు.
ఆర్టీసీ 'ఎస్మా' (Essential Services Maintenance Act) పరిధిలోకి వస్తుందా? అందుకు సంబంధించిన ప్రభుత్వం జారీ జీవో చూపించాల్సిందిగా సోమవారం హైకోర్ట్ ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనికి కొనసాగింపుగా మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. 1998, 2015 లో ఆర్టీసీని ఎస్మా చట్టం కింద చేర్చిన జీవో వివరాలను ప్రభుత్వం కోర్టు ముందు ఉంచింది. దీనిపై స్పందించిన న్యాయస్థానం, 1998లో ఇచ్చిన జీవో ఏపీఎస్ ఆర్టీసీకి వర్తిస్తుందని అది టీఎస్ ఆర్టీసీకి వర్తించదని తెలిపింది, ఇక 2015లో ఇచ్చిన జీవో కేవలం 6 నెలల వరకే వర్తిస్తుందని పేర్కొంది. ఈ సమస్య పరిష్కారానికి ముగ్గురు సుప్రీం విశ్రాంత జడ్జీలతో కమిటీ వేస్తాము, ఇందుకు ప్రభుత్వ అభిప్రాయం చెప్పాల్సిందిగా అడ్వొకేట్ జనరల్ ను హైకోర్ట్ ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి అభిప్రాయం తీసుకున్న తర్వాత బుధవారం రోజు మరోసారి ఈ అంశంపై హైకోర్ట్ చర్చించనుంది.
ఆర్టీసీ సమ్మె సమ్మె చట్టవ్యతిరేకం, కార్మికులపై ఎస్మా ప్రయోగించేలా ఆదేశం ఇవ్వాలని ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించగా ఆర్టీసీ ప్రైవేటీకరణ మరియు కార్మికులతో చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని ఆదేశించాల్సిందిగా కార్మికుల తరఫు నుంచి వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో హైకోర్ట్ మరోసారి స్పష్టంగా సోమవారం వినిపించిన వాదనలనే వినిపించింది. సమ్మె ఇల్లీగల్ చెప్పే పరిధి తమది కాదని చెప్తూనే ఇటు వైపు బలవంతంగా ప్రభుత్వం చర్చలు జరపాలంటూ ఆదేశించే అధికారం తమకు లేదని పేర్కొంది. హైకోర్ట్ చట్టానికి అతీతం కాదు, చట్టం పరిధిని దాటి హైకోర్ట్ కూడా ఆదేశాలు ఇవ్వలేదని ధర్మాసనం పేర్కొంది. ఈ క్రమంలో తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. ఆర్టీసీ ప్రైవేటీకరణ అంశంపైనా బుధవారమే చర్చించనుంది.
ఇక పూర్తిగా హైకోర్టుపైనే ఆశలు పెట్టుకున్న ఆర్టీసీ జేఏసీ నాయకులకు, ప్రభుత్వాన్ని ఆదేశించలేం అని చెప్పిన హైకోర్ట్ వ్యాఖ్యలు వారికి ప్రతికూలాంశమే అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ ఇకపై ఏ విధంగా ముందుకెళ్తారనేది చూడాలి.