High Court for the state of Telangana. | Photo- Wikimedia Commons.

Hyderabad, November 11: తెలంగాణ ఆర్టీసీ సమ్మె  (TSRTC Strike) వ్యవహారంలో సోమవారం హైకోర్టు (High Court of Telangana) లో విచారణ జరిగింది. ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలు, రూట్ల ప్రైవేటీకరణపై మంత్రివర్గం తీర్మానం మరియు తదితర అంశాలను ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించింది. న్యాయస్థానం సూచన మేరకు రూ.47 కోట్లపై ప్రభుత్వం సానుకూలంగానే స్పందించినా, అంతటితో ఆర్టీసీ సమస్యకు పరిష్కారం దొరకదని, అధ్యయనం చేస్తే రూ. 2209 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. అలాగే విలీనంపై మొండిపట్టు పడుతూ, సంస్థను మరింతంగా నష్టాల్లోకి నెట్టివేస్తూ, ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చేలా, ప్రజలకు అసౌకార్యాన్ని కల్పించేలా వ్యవహరిస్తున్న యూనియన్లతో చర్చలు సాధ్యం కాదని ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేసింది. సమ్మె చట్టవిరుద్ధమైనది, దీనిని దృష్టిలో ఉంచుకొని తగిన ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా హైకోర్టును ప్రభుత్వం కోరింది.

అయితే, అందుకు స్పందించిన హైకోర్టు సమ్మె చట్ట విరుద్ధం అని నిర్ణయించాల్సింది ఎవరు? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించాల్సింది ప్రభుత్వమా? ట్రిబ్యునలా లేక కోర్టులా? అని హైకోర్టు ప్రశ్నించింది. ఎస్మా చట్టం అత్యవసర సర్వీసులకు వర్తిస్తుందని హైకోర్ట్ తెలిపింది. ఆర్టీసీని అత్యవసర సర్వీసుగా ప్రభుత్వం జారీ చేసిన జీవోను చూపించాల్సిందిగా హైకోర్ట్ అడిగింది. అయితే ఆర్టీసీని ప్రజాప్రయోజన సేవగా ప్రకటించినందున 'ఎస్మా' పరిధిలోకి వస్తుంది, కాబట్టి ఈ సమ్మె చట్ట విరుద్ధమని ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదించగా, ప్రజా ప్రయోజన సేవలన్నీ అత్యవసర సర్వీసులోకి రావని హైకోర్ట్ జవాబు ఇచ్చింది. ఆర్టీసీని అత్యవసర సర్వీసుగా పేర్కొంటూ ప్రభుత్వం జీవో ఇస్తేనే అది ఎస్మా పరిధిలోకి వస్తుందని హైకోర్ట్ స్పష్టం చేసింది.

ప్రజాప్రయోజనాల పేరుతో చిత్రమైన సమస్యలను కోర్టు వద్దకు తీసుకొస్తే కోర్ట్ అందుకు ఎలాంటి పరిష్కారం చూపదని తెలిపింది. ప్రజాప్రయోజనాల పేరిట 'సమ్మె చట్ట విరుద్ధం' అని ప్రకటించలేమని హైకోర్ట్ వ్యాఖ్యానించింది. అదే సమయంలో చట్ట సమ్మతమైందని కూడా చెప్పలేమని పేర్కొంది. కార్మికులతో చర్చలు జరపాలని అనేకసార్లు తాము ప్రభుత్వానికి సూచించామని, అయితే ఈ విషయంలో ప్రభుత్వాన్ని ఆదేశించే అధికారం తమకు లేదని, తమకూ కొన్ని పరిమితులుంటాయని హైకోర్ట్ పేర్కొంది.   తదుపరి విచారణను హైకోర్ట్ నవంబర్ 12కు వాయిదా వేసింది.

ఇంతకాలంగా జరుగుతున్న విచారణను బట్టి చూస్తే ఆర్టీసీ వ్యవహారంలో హైకోర్ట్,  తెలంగాణ ప్రభుత్వానికి ఏమాత్రం అనుకూలంగా లేనట్లుగా అర్థమవుతుంది. విచారణ సందర్భంగా ప్రతీసారి ప్రభుత్వానికి హైకోర్ట్ నుంచి చుక్కెదురవుతుంది.

అశ్వత్థామ రెడ్డి నిరాహార దీక్ష వాయిదా: ఇక హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడిన నేపథ్యంలో తాము తలపెట్టిన నిరాహార దీక్షను తాత్కాలికంగా వాయిదా వేసుకుంటున్నట్లు ఆర్టీసీ జేఎసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి తెలిపారు. 'ఛలో ట్యాంక్ బండ్' సందర్భంగా ఆర్టీసీ కార్మికులపై పోలీసులు జరిపిన లాఠీఛార్జిని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు. కాగా, యధాతతంగా సమ్మె కొనసాగుతుందని అశ్వత్థామ రెడ్డి స్పష్టం చేశారు.