TSRTC unions indefinite strike in Telangana | (File Photo)

Hyderabad, November 15: ఆర్టీసీ సమ్మె (TSRTC Strike) నేటితో 42వ రోజుకు చేరింది, హైకోర్టు వాయిదాలతో 50 రోజుల వైపు పరుగులు తీస్తుంది. అయితే ఈ సమ్మెకు ముగింపు ఎప్పుడు, ఎలా అనే దానిపై మాత్రం ఇప్పటికీ స్పష్టత లేదు. గురువారం జేఏసీ నేత అశ్వత్థామ రెడ్డి (Ashwatthama Reddy) మాట్లాడుతూ, ఆర్టీసీ విలీనం (RTC Merge)పై తాత్కాలికంగా వెనక్కి తగ్గుతున్నామని ప్రకటించారు. మిగతా డిమాండ్లపై ప్రభుత్వం చర్చలు జరిపి పరిష్కరించాలని, లేనిపక్షంలో సమ్మెను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. అయితే ఈ ప్రకటనకు ప్రభుత్వం నుంచి ఇంతవరకూ ఎలాంటి స్పందన రాలేదు. ఒకవేళ ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మె అర్థాంతరంగా ముగించినా, వారికి ప్రభుత్వం నుంచి పిలుపు వస్తుందా? అనే దానిపై కూడా అనుమానాలే ఉన్నాయి. అసలు ఇప్పుడు ఆర్టీసీ నేతలకు మరియు ప్రభుత్వానికి మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. వీరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు కూడా ఏ రాజకీయ పక్షానికి అవకాశం లేదు. ప్రతిపక్ష పార్టీలతో కలిసి జేఏసీ నేతలు వ్యవహరించిన తీరు పట్ల ప్రభుత్వ పెద్దలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. సమ్మె విరమించాలని సీఎం కేసీఆర్ స్వయంగా 2సార్లు గడువులు విధించినా, జేఏసీ నేతలు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. విలీనం సహా ఏ ఒక్క డిమాండును వదులుకోము, హైకోర్టులో తేల్చుకుంటాం అని సవాల్ చేశారు. దీంతో ప్రభుత్వం కూడా తేల్చుకోవడానికే సిద్ధమైంది.

ఆర్టీసీకి చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలపై హైకోర్ట్ ప్రారంభంలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంతో జేఏసీ నేతల్లో ఆశలు చిగురించాయి. అయితే ప్రభుత్వం కూడా అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితే బాగాలేదు, ఆర్టీసీకి ఎలాంటి బకాయిలు చెల్లించేది లేదు అంటూ తేల్చి చెప్పడంతో సమ్మె అంశం అనేక మలుపులు తిరుగుతూ వచ్చింది. ఇక హైకోర్టు కూడా చేసేదేం లేక, ఇరు వర్గాల మధ్య చర్చలు జరపడానికి ప్రయత్నించింది. కానీ, ప్రభుత్వం మాత్రం ఇక జేఏసీ నేతలతో ఎంతమాత్రం చర్చలు జరపడానికి సిద్ధంగా లేనట్లు హైకోర్టులో అడ్వొకేట్ జనరల్ వినిపిస్తున్న వాదనల ద్వారా స్పష్టం అవుతుంది. ఇంతకాలంగా విచారణ జరుగుతున్నా, ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో ఇక నవంబర్ 19 లోపు ఏదో ఒకటి తేల్చేయాలని హైకోర్ట్ నిర్ణయించుకుంది. ఇప్పటివరకూ హైకోర్ట్ ఎన్ని సూచనలు చేసినా ప్రభుత్వం నుంచి ఆ దిశగా ముందడుగు పడకపోవడంతో, ఈ సారి కార్మికులనే అడుగు వెనకడు వేయమని చెప్పే అవకాశాలు ఉన్నాయి. విషయం అర్థమవడంతో, ఆర్టీసీ జేఏసీ నేతలు కూడా విలీనంపై వెనక్కి తగ్గినట్లు అర్థమవుతుంది.

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అనే ప్రధాన డిమాండ్ తో ఆర్టీసీ జేఏసీ గత అక్టోబర్ నెలలో సమ్మెకు పిలుపునిచ్చింది. ఆ సమయంలో ప్రభుత్వం ముగ్గురు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లతో ఒక కమిటీ వేసి చర్చలకు పిలిచింది. అయితే, విలీనం చేస్తామని లిఖితపూర్వక హామీ ఇస్తేనే సమ్మె ఆలోచన విరమించుకుంటామని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. అయితే ఇప్పటికిప్పుడు హామి ఇవ్వలేమని, అధ్యయనం చేయడానికి కొంత సమయం పడుతుందని కమిటీ తేల్చి చెప్పింది. దీంతో అక్టోబర్ 05 నుంచి ఆర్టీసీ సమ్మె ప్రారంభమైంది. నేడు, నవంబర్ 15 నాటికి 42వ రోజుకు చేరుకుంది. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు, రేపు రిలే నిరాహార దీక్షలు, 18న డిపోల ఎదుట దీక్ష, 19న సడక్ బంద్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.