Palamuru Rangareddy Lift Irrigation: తెలంగాణలో మరో భారీ సాగునీటి ప్రాజెక్టుకు లైన్ క్లియర్, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు జారీ, ఇకపై చకచకా పనులు పూర్తిచేసేందుకు కార్యాచరణ
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణమేకాకుండా, అనుమతుల సాధనలోనూ సాటిలేని మేటి రాష్ట్రంగా నిలిచింది. పాలమూరు బిడ్డల దశాబ్దాల కలను సాకారం చేసింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి (Palamuru Rangareddy Lift Irrigation) పర్యావరణ అనుమతులను సాధించింది
HyderabadHyderabad, AUG 11: సీఎం కేసీఆర్ (CM KCR) నేతృత్వంలో తెలంగాణ సర్కారు మరో అపూర్వ, చారిత్రక విజయాన్ని సాధించింది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణమేకాకుండా, అనుమతుల సాధనలోనూ సాటిలేని మేటి రాష్ట్రంగా నిలిచింది. పాలమూరు బిడ్డల దశాబ్దాల కలను సాకారం చేసింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి (Palamuru Rangareddy Lift Irrigation) పర్యావరణ అనుమతులను సాధించింది (Environmental Clearance). ఈ మేరకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ పరిధిలోని ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ (ఈఏసీ) కేంద్ర జల్‌శక్తిశాఖకు సిఫారసు చేయగా, అనుమతులు ఇక లాంఛప్రాయమే కావడం విశేషం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి (Palamuru Rangareddy Lift Irrigation) సంబంధించి పర్యావరణ అనుమతుల కోసం తెలంగాణ ప్రభుత్వం 34వ ఈఏసీ సమావేశం నుంచి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. ఈఏసీ సభ్యులు సందేహాలను లేవనెత్తుతూ, నివేదికలను కోరుతూ వాయిదా వేస్తూ వచ్చారు. ఒక దశలో ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల మంజూరును సైతం తిరస్కరిస్తూ ప్రాజెక్టు ప్రతిపాదనలను పక్కనపెట్టింది. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం మొక్కవోని దీక్షతో ఈఏసీ కోరిన విధంగా సంబంధిత డాటాను సమర్పించింది. దీంతో ఎట్టకేలకు ఈ ఏడాది జూన్ 27న నిర్వహించిన ఈఏసీ (EAC) 48వ సమావేశంలోనే పాలమూరు ప్రాజెక్టు ప్రతిపాదనలపై సుదీర్ఘమైన చర్చ కొనసాగింది. అయిప్పటికీ ఈఏసీ సభ్యులు పలు అంశాలపై పూర్తి వివరాలను ఇవ్వాలని కోరుతూ అనుమతుల మంజూరును పెండింగ్‌లో పెట్టారు. దీంతో గత నెల 24న నిర్వహించిన 49వ ఈఏసీలో మరోసారి తెలంగాణ సర్కారు తరఫున తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ వాదనలు వినిపించారు.
ప్రాజెక్టు నిర్మాణ ఆవశ్యకతను బలంగా నొక్కి చెప్పారు. ప్రాజెక్టుకు త్వరితగతిన పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని, కరువు పీడిత ప్రాంతాల దాహార్తిని తీర్చాలని ఈఏసీకి (EAC) తెలంగాణ సర్కారు గతంలో విజ్ఞప్తి చేసింది. అయితే ప్రాజెక్టు పర్యావరణ ప్రభావ అంచనాలను సమర్పించాలని ఈఏసీ గతంలో తెలంగాణకు సూచించింది. ఈ నేపథ్యంలో ఇటీవలే ఇరిగేషన్ అధికారులు అందుకు సంబంధించిన నివేదికలను సైతం ఈఏసీకి అందజేశారు. వాటన్నింటిపై సంతృప్తి వ్యక్తం చేసిన ఈఏసీ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయాలని కేంద్రానికి సిఫారసు చేయడం విశేషం. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని ఈఏసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇంజినీరింగ్ అధికారులతోపాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు సంబురాలు చేసుకొంటున్నారు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు మంజూరుకు ఈఏసీ గ్రీన్‌సిగ్నల్ (EAC Green signal) ఇవ్వడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. పథకం తొలిదశ పనులు తుదిదశకు చేరుకొన్న తరుణంలో పర్యావరణ అనుమతులు సైతం మంజూరు కానుండటంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈసీ రాకతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతోపాటు రంగారెడ్డి జిల్లాలో 12.30 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే రెండో దశ పనులు కూడా చకచకా ముందుకు సాగే అవకాశం ఏర్పడిందని సంతోషం వ్యక్తం చేశారు. ఎన్నో కేసులను ఎదుర్కొని, మరెన్నో అడ్డంకులను అధిగమించి అనుమతులు సాధించామని, ఇది తెలంగాణ సాధించిన మరో అద్భుత, చారిత్రక విజయమని సీఎం కేసీఆర్ అభివర్ణించారు. ప్రాజెక్టుల నిర్మాణమే కాకుండా, అనుమతుల సాధనలోనూ తెలంగాణ ప్రభుత్వం మరోసారి సాటిలేదని నిరూపించుకొన్నదని తెలిపారు. ఇది తెలంగాణ సరారు సంకల్పానికి నిలువెత్తు నిదర్శమని పేర్కొన్నారు. కృష్ణమ్మ నీళ్లను తెచ్చి పాలమూరు బిడ్డల పాదాలు కడిగే రోజు ఆసన్నమైనదని తెలిపారు. పాలమూరుకు పర్యావరణ అనుమతుల సాధనకు కృషి చేసిన సాగునీటిశాఖ ఇంజినీరింగ్ అధికారులను అభినందించారు.