Telangana New Secretariat Inauguration: తెలంగాణ నూతన సచివాలయంలో ప్రారంభమైన చండీయాగం.. మధ్యాహ్నం 1.20 గంటలకు సచివాలయాన్ని ప్రారంభించనున్న కేసీఆర్.. లైవ్ వీడియో
ఈ భవనాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నేటి మధ్యాహ్నం 1.20-1.32 మధ్య ప్రారంభించనున్నారు.
Hyderabad, April 30: తెలంగాణ (Telangana) రాజసానికి నిలువుటద్దంలా నిలిచిన నూతన సచివాలయం (New Secretariat) ప్రారంభానికి సిద్ధమైంది. ఈ భవనాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు (Chief Minister K Chandrashekar rao) నేటి మధ్యాహ్నం 1.20-1.32 మధ్య ప్రారంభించనున్నారు. ఆ తర్వాత 1.56-2.04 గంటల మధ్య మంత్రులు (Ministers), అధికారులు (Officers) ఒకేసారి తమ సీట్లలో ఆసీనులవుతారు. 2.15 గంటలకు బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగిస్తారు. కాగా నూతన సచివాలయంలో ఈ తెల్లవారుజామున 5.50 గంటలకు పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 6.15 గంటలకు ప్రారంభమైన చండీయాగం, సుదర్శన యాగాల్లో మంత్రి ప్రశాంత్‌రెడ్డి దంపతులు పాల్గొన్నారు. అనంతరం జరగనున్న వాస్తు పూజలోనూ వారు పాల్గొంటారు.
110 మంది వేదపండితులు
హోమం, యాగ నిర్వహణ, సచివాలయంలో వివిధ చాంబర్లలో ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో 110 మంది వేదపండితులు, రుత్విక్కులు పాల్గొంటారు. శృంగేరీ పీఠానికి చెందిన గోపీకృష్ణ శర్మ, ఫణిశశాంక శర్మ, వాస్తు పండితుడు సుద్దాల సుధాకర తేజ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఎక్కడ ఎవరు?
నూతన సచివాలయంలోని ఆరో అంతస్తులో ముఖ్యమంత్రి కార్యాలయం ఉండగా, మూడో అంతస్తులో మంత్రి కేటీఆర్ కార్యాలయం ఉంది. రెండో అంతస్తులో మరో మంత్రి హరీశ్‌రావు కార్యాలయం ఉంది. కేసీఆర్ తన సీటులో ఆసీనులు అవగానే పోడుపట్టాల మార్గదర్శకాలపై తొలి సంతకం చేయనున్నారు.