Hyderabad Rains: అర్ధరాత్రి వరకు హైదరాబాద్‌లో కుండపోత వర్షం, పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షం కురిసే అవకాశముందని హెచ్చరిక, జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తం
అర్ధరాత్రి వరకు కుండపోత వర్షం పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో జీహెచ్‌ఎంసీ (GHMC) మాన్ సూన్ టీమ్స్ అప్రమత్తమయ్యాయి.
Hyderabad, SEP 06: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం (Hyderabad Rains) కురుస్తోంది. అర్ధరాత్రి వరకు కుండపోత వర్షం పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో జీహెచ్‌ఎంసీ (GHMC) మాన్ సూన్ టీమ్స్ అప్రమత్తమయ్యాయి. నిన్న ఉదయం కురిసిన అతిభారీ వర్షం కారణంగా పలు చోట్ల ఇండ్లు నీటమునిగాయి. నాళాలు పొంగిపొర్లాయి. జంటజలాశయాలు నిండుకుండల్లా మారాయి.
తాజాగా మరోసారి భారీ వర్షసూచన ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేశారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్రజల్ని ముందుజాగ్రత్తగా తరలించే యత్నం చేస్తున్నారు. ఇక వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఉన్న అల్పపీడనం బలహీనపడింది. దీని ప్రభావంతో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, మాదాపూర్, కూకట్‌పల్లి, నిజాంపేట, బాచుపల్లి, గాజులరామారం, మియాపూర్, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, రాయదుర్గం, కుత్బుల్లాపూర్ జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, జీడిమెట్ల, సూరారం, బేగంపేట, ఎస్సార్‌నగర్, బోయిన్‌పల్లి, కొంపల్లి, తార్నాక, హబ్సిగూడ, లాలాపేట, నాచారం, మల్లాపూర్, తిరుమలగిరి, అల్వాల్, జవహర్‌నగర్‌లో దాదాపు 30 నిమిషాల పాటు కుండపోత వర్షం కురిసింది. హైదరాబాద్‌తో పాటు సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోనూ భారీ వర్షం కురిసింది.
రాగల మూడురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది. ఈ మేరకు ఆ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసింది.