Swapnalok Fire Accident Update: సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాదంలో ఆరుగురి సజీవ దహనం.. మృతులందరూ కాల్ సెంటర్ ఉద్యోగులే.. బాధితుల్లో నలుగురు యువతులు, ఇద్దరు యువకులు.. ప్రమాదానికి గల కారణంపై ఇంకా అస్పష్టత
మొన్నటికి మొన్న రుబీ హోటల్ అగ్ని ప్రమాద ఘటనను మరిచిపోకముందే.. సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ లో గత రాత్రి మరో భారీ అగ్నిప్రమాదం జరుగడం తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఆరుగురు సజీవ దహనమయ్యారు.
Hyderabad, March 17: జంట నగరాల్లోని (Twin Cities) వాణిజ్య భవంతుల్లో (Commercial Buildings) వరుస అగ్ని ప్రమాద (Fire Accidents) ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. మొన్నటికి మొన్న రుబీ హోటల్ (Ruby Hotel) అగ్ని ప్రమాద ఘటనను మరిచిపోకముందే.. సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ (Secunderabad Swapnalok Complex) లో గత రాత్రి మరో భారీ అగ్నిప్రమాదం జరుగడం తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. వీరందరి వయసు కూడా 20 నుంచి 24 ఏళ్లలోపు ఉన్నట్టు భావిస్తున్నారు. మృతులు భవనంలోని ఐదో అంతస్తులో ఉన్న కాల్‌సెంటర్ ఉద్యోగులుగా అధికారులు తెలిపారు. గత రాత్రి ఏడు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. తొలుత 8వ అంతస్తులో మొదలైన మంటలు ఆ వెంటనే 7,6,5 అంతస్తులకు వ్యాపించాయి.
స్కై లెవల్ క్రేన్ సాయంతో
అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది భవనంలో చిక్కుకున్న దాదాపు 12 మందిని స్కై లెవల్ క్రేన్ సాయంతో రక్షించి కిందికి దించారు. పలు అంతస్తుల్లోని అద్దాలను పగలగొట్టారు. అలాగే, చుట్టుపక్కల నివాసాల్లోని వారిని ఖాళీ చేయించారు. ఈ క్రమంలో ఐదో అంతస్తుల్లో కాల్ సెంటర్‌లో పనిచేసే ఉద్యోగులు కొందరు చిక్కుకుపోయారని తెలియడంతో అగ్నిమాపక, డీఆర్ఎఫ్ సిబ్బంది అతి కష్టం మీద అక్కడికి వెళ్లారు. అయితే, హాలంతా పొగచూరుకుపోయి ఉండడంతో ఎవరు ఎక్కడ ఉన్నారో గుర్తించడం కష్టమైంది. లోపల పడివున్న మరో ఆరుగురిని రక్షించి గాంధీ ఆసుపత్రికి తరలించారు.
మూడు గంటల తర్వాత భవనంలో మళ్లీ మంటలు
మంటలు అదుపులోకి వచ్చాయని అందరూ భావిస్తున్న సమయంలో దాదాపు మూడు గంటల తర్వాత భవనంలో మళ్లీ మంటలు వ్యాపించడం అందర్నీ భయభ్రాంతులకు గురిచేసింది. దీంతో మొత్తం 15 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తెచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే నార్త్ జోన్ డీసీపీ చందనాదీప్తి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.
రాకెట్ వెళ్ళడంతోనే?
అగ్ని ప్రమాదానికి గల స్పష్టమైన కారణం తెలియరాలేదు. అయితే, రాత్రి ఏడు గంటల సమయంలో కింది నుంచి రాకెట్ (టపాకాయ) ఒకటి పైకి వెళ్లినట్టు అనిపించిందని, ఆ తర్వాత మంటలు వ్యాపించాయని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. భవనం కింది అంతస్తులోని ప్యానెల్ బోర్డులో మంటలు చెలరేగి వైర్ల ద్వారా అవి ఎనిమిదో అంతస్తులోకి చేరి ఉంటాయని అనుమానిస్తున్నారు. కాగా, మృతులను కాల్ సెంటర్ ఉద్యోగులు త్రివేణి, శ్రావణి, వెన్నెల, ప్రమీల, శివ, ప్రశాంత్‌గా గుర్తించారు.