Weather Alert: మరో మూడురోజుల పాటూ తీవ్రస్థాయిలో ఎండలు, హైదరాబాద్ తో పాటూ ఏపీలోని పలు ప్రాంతాల్లో ఎండలు మండిపోతాయంటూ వాతావరణశాఖ హెచ్చరిక, హైదరాబాద్‌లో ఇవాళ రికార్డుస్థాయి టెంపరేచర్
ఈ వేసవి కాలంలో శుక్రవారం రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Hyderabad, June 02: కిందిస్థాయి గాలులు వాయువ్య, పడమర దిశ నుంచి తెలంగాణ వైపునకు వీస్తుండడంతో గ్రేటర్ హైదరాబాద్ లో వాతావరణం (Hyderabad weather) రోజురోజుకు వేడెక్కుతోంది. ఈ వేసవి కాలంలో శుక్రవారం రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు (Summer Temperature) 41.0 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 28.4డిగ్రీలు, గాలిలో తేమ 21శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. రాగల మరో మూడు రోజులు హైదరాబాద్ నగరంలో ఉష్ణోగ్రతలు 42 – 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల మధ్య నమోదయ్యే అవకాశాలున్నట్లు అధికారులు హెచ్చరికలు జారీచేశారు.
మరోవైపు అసలే మండిపోతున్న ఎండలతో, వడగాల్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఏపీ ప్రజలకు విపత్తుల నిర్వహణ సంస్థ మరో హాట్ న్యూస్ చెప్పింది. ఏపీలో ఎండలు (AP Weather) మరింతగా మండిపోతాయంది. అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది. 3 రోజుల పాటు రాష్ట్రంలో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరించారు. పలు జిల్లాల్లో 45 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు (Summer Temperature) నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల సంస్థ వెల్లడించింది. జూన్ 3 పలు జిల్లాల్లో 45 నుం చి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందంది. 17 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 300 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని చెప్పింది.
ఇవాళ కోనసీమ జిల్లాలోని పామర్రు మండలంలో తీవ్రమైన వడగాల్పుల తీవ్రత కనిపించిందన్నారు. 286 మండలాల్లో వడగాల్పుల ప్రభావం పడిందని వెల్లడించారు. నిన్న పల్నాడు జిల్లా నరసరావుపేటలో 44.1 డిగ్రీలు, ఏలూరు జిల్లా కామవరపుకోటలో 44డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు. ప్రయాణాలు చేసే వారు కేర్ ఫుల్ గా ఉండాలన్నారు. ముఖ్యమైన పని ఉంటే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని కోరారు. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే తగిన జాత్రలు తీసుకోవాలన్నారు. వడదెబ్బ బారిన పడకుండా చూసుకోవాలన్నారు.
పామర్రులో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. గత 5 రోజులుగా పామర్రులో ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ.. శుక్రవారం మాత్రం తీవ్రమైన ఎండలతో జనం విలవిల లాడారు. మరోవైపు ఉక్కపోత, వేడిగాలులతో సతమతమయ్యారు. ఉదయం 8 నుంచే సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. నిప్పులు కురిపిస్తున్నాడు. మాడు పగిలే ఎండలతో జనం విలవిలలాడిపోతున్నారు. ఈ వేసవి కాలం ఎప్పుడెప్పుడు ముగుస్తుందా? ఈ మంటల నుంచి ఎప్పుడు ఉపశమనం లభిస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈ వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. పగటి పూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. రికార్డు స్థాయిలో టెంపరేచర్లు నమోదవుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది.