Vjy, June 1: ఏపీలో వాతావరణ శాఖ హై అలర్ట్ ప్రకటించింది. రాబోయే ఐదు రోజులూ అప్రమత్తంగా ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. రానున్న ఐదు రోజులు రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శుక్రవారం 302 మండలాల్లో వడగాడ్పుల ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు.
అనకాపల్లి జిల్లా అనకాపల్లి, బుచ్చయ్యపేట, చోడవరం, కె.కోటపాడు, కశింకోట, కోటవురట్ల, మాకవరపాలెం, నర్సీపట్నం, నాతవరం, సబ్బవరం మండలాలు, కాకినాడ జిల్లా కోటనందూరు, తుని మండలాలు, విజయనగరం జిల్లా జామి, కొత్తవలస మండలాలు, విశాఖలోని పద్మనాభం మండలంలో వడగాడ్పుల తీవ్రత ఉంటుందని తెలిపారు.
ఎండ తీవ్రత దృష్ట్యా ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. వడగాడ్పులు, అకాల వర్షాలు, పిడుగుపాటు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేటప్పుడు చెట్ల కింద నిలబడవద్దని విజ్ఞప్తి చేశారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.