Cyclone Gulab: తెలుగు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్, అవసరమైతే బయటకు రావాలని ఐఎండీ సూచన, గులాబ్ తుపాన్ ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌కు 65 కిలోమీటర్లు, తెలంగాణలోని భద్రాచలానికి 120 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ కేంద్రం (IMD) తెలియజేసింది.
Vishaka/Hyd, Sep 27: కళింగపట్నం వద్ద తీరాన్ని దాటిన గులాబ్ తుపాను తీవ్రత తగ్గి వాయుగుండంగా బలహీన పడిందని వాతావరణశాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌కు 65 కిలోమీటర్లు, తెలంగాణలోని భద్రాచలానికి 120 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ కేంద్రం (IMD) తెలియజేసింది. రానున్న 24 గంటల్లో తుపాన్ మరింత బలహీనపడి అల్పపీడనంగా మారుతుందని ఐఎండీ స్పష్టం చేసింది.
గడచిన 6 గంటలుగా ఇది గంటకు 6 కిలోమీటర్ల వేగంతో కదులుతూ అరేబియా సముద్రంలోకి ప్రవేశించే అవకాశముందని అంచనా వేసింది. సెప్టెంబరు 30వ తేదీ నాటికి మహారాష్ట్ర-గుజరాత్‌కు సమీపంలో అరేబియా సముద్రంలోకి ప్రవేశించి మళ్లీ బలపడే సూచనలు ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయి. అలాగే కోస్తాంధ్ర జిల్లాలు, రాయలసీమ, తెలంగాణల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోనూ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. ఉత్తర కోస్తా-ఒడిశా తీరప్రాంతాల్లో సముద్రం ఇంకా అలజడిగానే ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. విశాఖ, గజపతినగరం, నెల్లిమర్లలో అత్యధికంగా 28 సెం.మీ వర్షపాతం నమోదయ్యింది.
తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. గులాబ్ తుపాన్ (Cyclone Gulab) ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు మరో రెండు రోజుల పాటు కురుస్తాయని, ఈ పరిస్థితుల్లో ఏవిధమైన, ప్రాణ ఆస్తి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్ సోమేష్ కుమార్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. పోలీస్, రెవెన్యూ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించారు.
తెలంగాణలోని 14 జిల్లాల్లో వాతావరణశాఖ రెడ్ అలర్ట్ (Telangana, Andhra Pradesh on red alert) ప్రకటించింది. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు రెడ్ అలర్ట్ జోన్‌లో ఉన్నాయి. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, పెద్దపల్లి, కరీంనగర్, జనగామ, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘గులాబ్’ తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరంగల్, హనుమకొండలో ఎడతెరపిలేని వర్షం కురుస్తుంది. భారీ వర్షానికి రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఏటూరునాగారం, మంగపేట, తాడ్వాయి మండలాల్లో తెల్లవారుజాము నుంచి ఎడతెరిపిలేని వాన కురుస్తోంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షానికిలోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
హైదరాబాద్ అంతా భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానతో పలు ప్రాంతాల్లోని రోడ్లపైకి, కాలనీల్లోకి వరద నీరు చేరింది. మరో అయిదారు గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో చీకటి అలుముకుంది. పట్టపగలే కారు చీకటి అలముకుంది. కుండపోతగా వర్షం పడుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
హైదరాబాదీలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ నేడు, రేపు హై అలర్ట్ ప్రకటించింది. వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో నగర వాసులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. తుఫాన్ నేపథ్యంలో హైదరాబాద్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. అవసరమైతే 040-23202813 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.