Cylcone Gulab. (Photo Credits: IANS)

Visakhapatnam/Bhubaneswar, September 27: కళింగపట్నం-గోపాలపూర్‌ మధ్య గులాబ్‌ తుపాను తీరం (Cyclonic storm Gulab crosses coast) దాటింది. జిల్లా కలెక్టర్లను విపత్తు నిర్వహణ శాఖ అప్రమత్తం చేసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నారు. తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు (Heavy Rains Along With Strong Winds) వీస్తున్నాయి.

దీంతో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భావనపాడు, నౌపాడ ప్రాంతాల్లో పలు చెట్లు నేల కూలాయి. తుపాను దెబ్బకు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. విశాఖపట్నం- విజయనగరం- శ్రీకాకుళం వైపు వచ్చే వాహనాలను కూడా నిలిపివేశారు. అక్కునపల్లి బీచ్‌లో ఓ పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు గల్లంతు కాగా, నలుగురు మత్స్యకారులు సురక్షితంగా ఈ ప్రమాదం నుంచి బయట పడ్డారు.

శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా కుంభవృష్టితో తుపాను ప్రభావం తీవ్రంగా కనిపించింది. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో తుపాను బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావం వల్ల ఉత్తరాంధ్రలో తీరం వెంట గంటకు 80–90 కిలో మీటర్లు వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. గులాబ్‌ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి.

నన్ను కూడా లాగావు పవన్, నీ వ్యాఖ్యలకు తప్పకుండా బదులిస్తానని తెలిపిన మోహన్ బాబు, టికెట్ల వ్యవహారంపై ఏపీ ప్రభుత్వంపై మండిపడిన జనసేన అధినేత

కోస్తాంధ్ర జిల్లాల్లోనూ అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. జోరు వర్షాలతో నాగావళి పరవళ్లు తొక్కుతోంది. తోటపల్లి ప్రాజెక్ట్‌ వద్ద నీటి ప్రవాహం పెరుగుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మడ్డువలస వద్ద కూడా అదే పరిస్థితి ఉంది. హిర మండలం గొట్టాబ్యారేజీ వద్ద వంశధారలో నీటి ప్రవాహం పెరగడంతో 22 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడిచిపెడుతున్నారు.

గులాబ్‌ తుఫాన్‌ ప్రభావంతో విశాఖ జిల్లాలోనూ భారీ వర్షాలు ముంచెత్తాయి. భారీ వర్షాలతో విశాఖపట్నం రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రైల్వే స్టేషన్ సమీపంలో రోడ్ల మీదికి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. ప్రజలు రోడ్లమీదకు వచ్చి రోడ్డు దారి కనిపించక వాహనదారులు వెనుకకు తిరిగి వెళ్తున్నారు.

కేసీఆర్‌ని తిట్టాలంటే నీ ఫ్యాంట్లో కారిపోతాయి పవన్, నీ వకీల్ సాబ్ సినిమాకి ఏపీలో ఎంత వచ్చిందో తెలుసా, నువ్విచ్చే డబ్బులతో జగన్ ప్రభుత్వం ఏమైనా నడుస్తోందా, పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడిన పేర్ని నాని

గులాబ్ తుఫాన్ పై విశాఖ కేంద్రంగా ఏపీ చీఫ్ సెక్రటరీ ఆదిత్య నాథ్ దాస్ సమీక్ష నిర్వహించగా, విశాఖ కలెక్టరేట్‌లో అధికారులతో విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు సమీక్ష చేపట్టారు. తుపాను తీరం దాటే సమయంలో పరిస్థితిని ఎదుర్కోవడానికి ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. సీఎం జగన్‌ ఆదేశాల మేరకు విశాఖ జిల్లాలోని 15 మండలాల్లో ప్రత్యేక అధికారుల్ని నియమించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సీఎం కార్యాలయానికి అందజేస్తూ సీఎస్‌ అదిత్య నాథ్‌ చర్యలు చేపడుతున్నారు. కృష్ణా జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో గన్నవరం విమానాశ్రయం జలమయమైంది. భారీ వర్షానికి విమానాల రాకపోకలకు ఇబ్బంది ఎదురవుతోంది.

తెలంగాణ రాజధానిని ముంచెత్తిన వర్షాలు

హైదరాబాద్‌ మహా నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. బంగాళాఖాతాంలో ఏర్పడిన గులాబ్‌ తుపాను ప్రభావంతో పాటు, ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇళ్లలోకి నీరుచేరి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక వాహనదారులు రోడ్లపైకి రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. దిల్ సుఖ్ నగర్, చైతన్య పురి, కొత్తపేట్, సరూర్ నగర్, మీర్‌పేట్‌, పంజాగుట్ట, బంజారాహిల్స్‌, సికింద్రాబాద్‌ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.

రాష్ట్రంలో వరుసగా రెండ్రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, వరంగల్, కామారెడ్డి తదితర జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఈ నెల 28న మరో అల్పపీడనం

ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో సోమవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఈశాన్య బంగాళాఖాతంలో 28వ తేదీన అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారి ఉత్తరాంధ్ర జిల్లాల్లో తీరం దాటే సూచనలున్నాయని భావిస్తున్నారు.

గులాబ్‌ తుపాను కారణంగా పలు రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు, మరికొన్నింటిని రీషెడ్యూల్‌ చేస్తున్నట్లు రెల్వే అధికారులు తెలిపారు.

దారి మళ్లించిన రైళ్లు

25వ తేదీన అగర్తలలో బయలుదేరిన అగర్తల–బెంగళూరు (05488) రైలు, 26న హౌరాలో బయలుదేరిన హౌరా–సికింద్రాబాద్‌ (02703, హౌరా–యశ్వంత్‌పూర్‌ (02245),హౌరా–హైదరాబాద్‌ (08645), హౌరా–చెన్నై (02543), హౌరా–తిరుపతి (02663), సంత్రాగచ్చిలో బయలుదేరిన సంత్రాగచ్చి– తిరుపతి (02609), టాటాలో బయలుదేరిన టాటా ఎర్నాకుళం (08189) రైళ్లు ఖరగ్‌పూర్, ఝార్సుగుడ, బల్హార్షా మీదుగా ప్రయాణిస్తాయి.

26న భువనేశ్వర్‌లో బయలుదేరిన భువనేశ్వర్‌–ముంబై(01020) రైలు సంబల్‌పూర్, టిట్లాగఢ్‌ రాయ్‌పూర్‌ మీదుగా నడుస్తుంది. 25న అలప్పుజాలో బయలుదేరిన అలప్పుజా–ధన్‌బాద్‌ (03352), 26న చెన్నైలో బయలుదేరిన చెన్నై–హౌరా (02544) రైళ్లు బల్హార్షా, ఝార్సుగుడ మీదుగా నడుస్తాయి.

25న యశ్వంత్‌పూర్‌లో బయలుదేరిన యశ్వంత్‌పూర్‌–పూరి (02064), 26న తిరుపతిలో బయలుదేరిన తిరుపతి–భువనేశ్వర్‌ (08480) రైళ్లు బల్హార్షా, సంబల్‌పూర్‌ మీదుగా ప్రయాణిస్తాయి.

25న త్రివేండ్రం సెంట్రల్‌లో బయలుదేరిన త్రివేండ్రం–షాలిమార్‌ (02641), 26న హైదరాబాద్‌లో బయలుదేరిన హైదరాబాద్‌–హౌరా (08646) రైళ్లు బల్హార్షా, ఝార్సుగుడ, ఖరగ్‌పూర్‌ మీదుగా నడుస్తాయి.

రీషెడ్యూల్‌ చేసిన రైళ్లు

26న పలు స్టేషన్లలో బయలుదేరే ప్రత్యేక రైళ్లను రీషెడ్యూల్‌ చేశారు. పూరిలో బయలుదేరే పూరి–తిరుపతి (07480) 11 గంటలు ఆలస్యంగా బయలుదేరుతుంది.

హౌరా నుంచి హౌరా–యశ్వంత్‌పూర్‌ (02873), హౌరా–పాండిచ్చేరి (02867) రైళ్లు 2 గంటలు ఆలస్యంగా బయలుదేరతాయి.

సికింద్రాబాద్‌లో సికింద్రాబాద్‌–హౌరా (02704), యశ్వంత్‌పూర్‌లో యశ్వంత్‌పూర్‌–హౌరా (02246), యశ్వంత్‌పూర్‌–హౌరా (02874), తిరుపతిలో తిరుపతి–బిలాస్‌పూర్‌ (07481), తిరుపతి–హౌరా (08090) రైళ్లు 3 గంటలు ఆలస్యంగా బయలుదేరతాయి.