TS Assembly Passes 8 Bills: రైతు రక్షణే తమ ధ్యేయమని తెలిపిన సీఎం కేసీఆర్, 8 కీలక బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం, శాసనసభ రేపటికి వాయిదా
అనంతరం జీరో అవర కొనసాగింది. ఆ తర్వాత పలు బిల్లులపై సభలో చర్చ జరిగింది. ఆయా శాఖల మంత్రులు బిల్లులపై వివరణ ఇవ్వడంతో సభ ఆమోదం (Telangana Assembly passes Eight bills) తెలిపింది. అనంతరం సభ రేపటికి వాయిదా పడింది.
Hyderabad, Sep 14: పలు బిల్లులకు సభ ఆమోదం తెలిపిన అనంతరం తెలంగాణ శాసనసభ సమావేశాలు (TS Assembly 2020) మంగళవారానికి వాయిదా పడ్డాయి. సభను రేపు ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ప్రశ్నోత్తరాల్లో భాగంగా సింగరేణి కార్మికుల సమస్యలు, కారుణ్య నియామకాలపై సభ్యులు లేవనెత్తిన అంశాలపై సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు.
సింగరేణి కార్మికుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని, కారుణ్య నియామకాలను అర్హతలను బట్టి భర్తీ చేస్తామని సీఎం స్పష్టం చేశారు. అనంతరం జీరో అవర కొనసాగింది. ఆ తర్వాత పలు బిల్లులపై సభలో చర్చ జరిగింది. ఆయా శాఖల మంత్రులు బిల్లులపై వివరణ ఇవ్వడంతో సభ ఆమోదం (Telangana Assembly passes Eight bills) తెలిపింది. అనంతరం సభ రేపటికి వాయిదా పడింది.
తెలంగాణలోని ప్రతి రైతు రక్షణే తమ ధ్యేయమని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (CM KCR) స్పష్టం చేశారు. కొత్త రెవెన్యూ బిల్లుపై శాసనమండలిలో చర్చ సందర్భంగా సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సీఎం వివరణ ఇచ్చారు. పట్టాదారు పాసుపుస్తకంలో అనుభవదారు కాలమ్ పెట్టేదే లేదని సీఎం తేల్చిచెప్పారు. రైతుల రక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని.. ఇది తమ పార్టీ పాలసీ కూడా అని స్పష్టం చేశారు. వేల ఎకరాల భూస్వాములు ఉన్నప్పుడు అనుభవదారుల కాలమ్ పెట్టారు. అప్పటి పరిస్థితులకు అది కరెక్ట్.
గ్రామాల్లో ఎంతో కష్టం వస్తే తప్ప భూమి అమ్ముకోరు. భూమి ఎవరికి కౌలుకు ఇవ్వాలనేది రైతు ఇష్టమని సీఎం అన్నారు. ఏ ప్రాపర్టీకి లేని అనుభవదారు కాలమ్.. రైతు భూమి ఎందుకు? అని ప్రశ్నించారు సీఎం. ప్రతి ఎకరం వివాదంలో ఉందని భావించడం సరికాదు. వివాదాస్పద భూములు కేవలం ఒక శాతం లోపే అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. పేదల హక్కులను కాపాడేందుకు తమ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి కార్యక్రమం వట్టిదే.. జోక్ అని సీఎం కేసీఆర్ తెలిపారు.
మెడికల్ కాలేజీల్లో అధ్యాపకుల వయోపరిమితిని పెంచుతూ రూపొందించిన బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. ఈ బిల్లును మంత్రి హరీశ్‌రావు (Minister Harish Rao) అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మెడికల్ కాలేజీల్లో నిపుణుల కొరత ఉన్నందువల్ల అధ్యాపకుల వయోపరిమితి పెంచుతున్నామని మంత్రి అన్నారు. దీనిద్వారా ఐదు మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న అధ్యాపకుల వయోపరిమితిని 58 నుంచి 65 ఏండ్లకు పెంచుతున్నామని చెప్పారు.
తద్వారా 52 మంది ప్రొఫెసర్లను కొనసాగించడానికి, అనుభవజ్ఞుల సేవలు వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. పదవీ విరమణ పొందుతున్నవారు ఎక్కువతుండటం, కోర్టు కేసులతో కొత్తవారిని నియమించుకునే అవకాశం లేకపోవడంతో వైద్య సేవలు, విద్యార్థులపై ప్రభావం పడకూడదనే ఉద్దేశంతో అధ్యాపకుల వయోపరమితి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని వెల్లడించారు.
తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎస్ బీపాస్ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపిన అనంతరం ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ (IT Minister KTR) మాట్లాడారు. భారతదేశంలోనే శరవేగంగా పట్టణీకరణ చెందుతున్న రాష్ర్టాల్లో భారతదేశంలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. దాదాపుగా రాష్ర్టంలో 42 శాతం జనాభా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు.
ఈ క్రమంలో పట్టణాల్లో సరైన మౌలిక వసతులు కల్పించాలని లక్ష్యం పెట్టుకున్నాం. పురపాలనలో సమూల మార్పులు తేవాలనే ఉద్దేశంతో నూతన పురపాలక చట్టాన్ని 2019లో తీసుకువచ్చాం. పౌరుడు కేంద్రంగా పారదర్శకంగా సేవలందించాలని రాష్ర్ట ప్రభుత్వం పెట్టుకుంది. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతి మున్సిపాలిటీకి జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు.
రాష్ర్టంలోని యూనివర్సిటీలతో పాటు ప్రైవేటు యూనివర్సిటీలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabita Indra Reddy) స్పష్టం చేశారు. తెలంగాణ స్టేట్ ప్రయివేటు యూనివర్సిటీస్ బిల్లుపై శాసనసభలో చర్చ సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సబిత వివరణ ఇచ్చారు. తెలంగాణలో ఉన్నత విద్యను అభ్యసించే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతూ ఉంది. రాష్ర్ట విద్యార్థులు ఇతర రాష్ర్టాల వైపు మొగ్గు చూపుతున్నారు.
ఈ క్రమంలోనే విద్యార్థుల డిమాండ్ మేరకే ప్రయివేటు యూనివర్సిటీల ప్రతిపాదనను తీసుకొచ్చామన్నారు. తెలంగాణలో ప్రయివేటు యూనివర్సిటీలకు సంబంధించి మొత్తం 16 ప్రతిపాదనలు వచ్చాయని గుర్తు చేశారు. వీటిలో 8 ప్రతిపాదనలకు ప్రభుత్వం ఒకే చెప్పిందని తెలిపారు. ఇందులో 5 ప్రయివేటు యూనివర్సిటీలకు ఆమోదం తెలిపినట్లు మంత్రి సబిత పేర్కొన్నారు. మిగతా మూడింటికి త్వరలోనే ఆమోదం తెలుపుతామన్నారు. ప్రయివేటు యూనివర్సిటీల స్థానంలో దేశంలో తెలంగాణ 25వ స్థానంలో ఉందన్నారు.
సభలో ఆమోదం పొందిన బిల్లులు
1) ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లు- 2020కు అసెంబ్లీ ఆమోదం (ప్రైవేటు యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు)
2) విపత్తు మరియు ప్రజా ఆరోగ్య పరిస్థితి బిల్లు- 2020కు శాసన సభ ఆమోదం
3) ఉద్యోగుల పదవీ విరమణ వయసు క్రమబద్ధీకరణ బిల్లు- 2020కు ఆమోదం (విపత్కర వేళ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత బిల్లు )
4) తెలంగాణ కోశ బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ బిల్లు- 2020కు అసెంబ్లీ ఆమోదం (ఆర్థిక బాధ్యత, బడ్జెట్ నిర్వహణ చట్ట సవరణ బిల్లు )
5) వస్తు మరియు సేవల పన్ను సవరణ బిల్లు- 2020కు అసెంబ్లీ ఆమోదం (జీఎస్టీ చట్ట సవరణ బిల్లు)
6) తెలంగాణ రాష్ట్ర భవన అనుమతి ఆమోదం మరియు స్వీయ ధృవీకరణ విధానం (టీ ఎస్- బి పాస్) బిల్లు- 2020కు ఆమోదం
7) తెలంగాణ న్యాయస్థానాల రుసుము, దావాల మదింపు సవరణ బిల్లు- 2020కు ఆమోదం (ప్రైవేటు యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు)
8) తెలంగాణ సివిల్ న్యాయస్థానాలు సవరణ బిల్లు- 2020కు అసెంబ్లీ ఆమోదం లభించింది. (సివిల్ కోర్టుల చట్ట సవరణ బిల్లు)