Rythu Bandhu in TS: తెలంగాణలో జూన్ 15 నుంచి రైతు బంధు, ఆర్థిక సాయాన్ని రైతుల ఖాతాల్లో జమచేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు, నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచన

గత యాసంగిలో అవలంబించిన విధానాన్నే ఇప్పుడు కూడా అవలంబిస్తూ రైతుల ఖాతాల్లో (Farmers Account) డబ్బులు జమ చేయాలని సూచించారు.

Telangana CM KCR | File Photo

Hyderabad, May 29: తెలంగాణలో జూన్ 15 నుంచి 25 వ తేదీ లోపల రైతు బంధు (Rythu Bandhu) పంటసాయం కింద ప్రభుత్వం అందించే ఆర్థిక సాయాన్ని రైతుల ఖాతాల్లో జమచేయాలని సీఎం కేసీఆర్ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. గత యాసంగిలో అవలంబించిన విధానాన్నే ఇప్పుడు కూడా అవలంబిస్తూ రైతుల ఖాతాల్లో (Farmers Account) డబ్బులు జమ చేయాలని సూచించారు. ఇప్పటిదాకా ఇచ్చిన కేటగిరీల వారిగానే రైతు బంధు సాయాన్ని ఖాతాలో వేయాలన్నారు. కాగా జూన్ 10 వ తేదీని కటాఫ్ డేట్‌గా పెట్టుకోని, ఆ తేదీ వరకూ పార్ట్ బీ నుంచి పార్ట్ ఏలోకి చేరిన భూములకు రైతు బంధు (Rythu Bandhu scheme) వర్తింప జేయాలని సీఎం (CM KCR) ఆదేశించారు.

కాగా వ్యవసాయ రంగంపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రగతి భవన్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యవసాయ రంగాన్ని పునరుజ్జీవింప చేసి, స్థిరీకరించాలన్న తమ ధ్యేయం నెరవేరిందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సంతృప్తి వ్యక్తం చేశారు. మిషన్ కాకతీయతో పాటు, సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి, కోటి ఎకరాల మాగాణాగా తెలంగాణను తీర్చిదిద్దడంలో విజయం సాధించామని, వ్యవసాయ రంగ ముఖచిత్రాన్ని గుణాత్మకంగా మార్చామని పేర్కొన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, కాళేశ్వరం లాంటి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని పట్టుపట్టి పూర్తి చేశామని అన్నారు.

ముత్యాలగూడెంలో కొంపముంచిన పెళ్లి వేడుక, హాజరైన వంద మందికి కరోనా, నలుగురు మృతి, మరో జిల్లా నల్లగొండలో ధోవతి ఫంక్షన్‌‌లో పది మందికి సోకిన కరోనా

ఇక వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులోకి తేవాలని సీఎం ఆదేశించారు. కల్తీ విత్తనాల మీద ఉక్కుపాదం మోపాలని పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లాల వ్యాప్తంగా కల్తీ విత్తన తయారీదారుల మీద దాడులు జరపాలని, కల్తీ విత్తనదారులను వలవేసి పట్టుకోవాలని, ఎంత వారినైనా ఉపేక్షించ వద్దని ఆదేశించారు.

వారిపై పీడీ యాక్టు మోపి, అరెస్ట్ చేయాలని సూచించారు. చిత్తశుద్ధితో పనిచేసి కల్తీ విత్తన విక్రయ ముఠాలను పట్టుకున్న పోలీసు అధికారులకు ప్రమోషన్లు, రాయితీలు, సేవా పతకం కూడా అందజేయాలని అధికారులను కోరారు. ఈ మేరకు తక్షణమే పోలీసులను రంగంలోకి దింపాలని కేసీఆర్ ఆదేశించారు.

తెలంగాణలో కొత్తగా 2,982 మందికి కరోనా, 21 మంది మృత్యువాత, జీహెచ్‌ఎంసీ పరిధిలో 436 కేసులు, ప్రస్తుతం రాష్ట్రంలో 36,917 యాక్టివ్‌ కేసులు

ప్రగతి భవన్‌లో శనివారం వ్యవసాయరంగం, విత్తనాల లభ్యత, కల్తీ విత్తనాల నిరోధం, రైతుబంధు పంపిణీ, ధాన్యం సేకరణ మీద సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , ఎమ్మెల్సీ , రైతుబంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి , ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, బండి కృష్ణమోహన్ రెడ్డి , సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి , సీఎస్ సోమేశ్ కుమార్, సీఎం ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, కార్యదర్శులు స్మితా సబర్వాల్, భూపాల్ రెడ్డి, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు , వ్యవసాయ యూనివర్సిటీ వీసీ ప్రవీణ్ రావు, సివిల్ సప్లయిస్ కమిషనర్ అనీల్ కుమార్, సీడ్స్ కార్పోరేషన్ ఎండీ కేశవులు తదితరులు పాల్గొన్నారు