Rythu Bandhu Funds: అసెంబ్లీ సమావేశాల ముందు మరో దఫా 'రైతుబంధు' పథకం నిధులను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం, మార్చి 20 వరకు కొనసాగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
ఇదే విషయంపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి.....
Hyderabad, March 6: తెలంగాణ రైతాంగానికి పంట పెట్టుబడి సహాయం కోసం 'రైతు బంధు' పథకం (Telangana Rythu Bandhu Scheme) కింద అందించే నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. యాసంగి కోసం రెండో విడతగా రూ. 333.39 కోట్లు విడుదల చేస్తూ పరిపాలనా అనుమతులను ప్రభుత్వం మంజూరు చేసింది. 2019-20కి గానూ ఇప్పటికే 1350.61 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం, తాజాగా విడుదల చేసిన నిధులను కలిపితే మొత్తంగా రూ. 1683.90 కోట్లు విడుదల చేసినట్లయింది.
శుక్రవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 2020 (Telangana Assembly Budget Session 2020) ప్రారంభమయ్యాయి. తొలి రోజు గవర్నర్ ప్రసంగం తర్వాత సభ శనివారానికి వాయిదా పడింది. ఇక శనివారం నుంచి అసలైన చర్చలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం రైతుబంధు పథకం నిధులను విడుదల చేయడంలో ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ముందు కూడా రాష్ట్ర ప్రభుత్వం 'రైతుబంధు' పథకం విడుదల చేసినప్పటికీ, సాంకేతిక కారణాల చేత చాలా రోజుల వరకు ఆ నిధులు రైతుల ఖాతాల్లోకి చేరలేదు. ఇదే విషయంపై ప్రతిపక్షాలు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రణాళికలు రచిస్తున్న సమయంలో ఒక వారం కిందట ఆ నిధులన్నీ రైతుల ఖాతాల్లోకి చేరిపోయాయి. పెండింగ్ లో ఉన్న మిగతా కొద్ది రైతుబంధు నిధులను సైతం ప్రభుత్వం ఇప్పుడు విడుదల చేసేసింది. దీంతో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు కొత్త దారులు వెతుక్కుంటున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 20 వరకు జరగనున్నాయి. మార్చి 08న సభలో వార్షిక బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. మార్చి 9,10, 15 తేదీల్లో సభకు సెలవులు. మార్చి 11 మరియు 12 తేదీల్లో సాధారణ బడ్జెట్ పై చర్చ, అలాగే మార్చి 13, 14, 16, 18, మరియు 19 తేదీలలో బడ్జెట్ పద్దులపై చర్చ జరుగుతుంది. మార్చి 20వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ, బడ్జెట్ ఆమోదం అనంతరం బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి.