Rythu Bandhu Funds: రైతు బంధు పథకం కింద రూ. 5,100 కోట్లు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం, స్వాగతించిన బీజేపీ, బుధవారమే మున్సిపల్ ఎన్నికల పోలింగ్
Rythu Bandhu - Telangana Govt | (Photo-PTI)

Hyderabad, January 21: యాసంగి సీజన్ కోసం రైతులకు పెట్టుబడి సాయం కింద అందించే 'రైతుబంధు' పథకం (Rythu Bandhu Scheme) నిధులను తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) విడుదల చేసింది. రూ. 5,100 కోట్లు విడుదల చేయడానికి రాష్ట్ర వ్యవసాయశాఖ పరిపాలనా అనుమతులను మంజూరు చేసింది. త్వరలోనే రైతుల ఖాతాల్లోకి ఎకరానికి రూ. 5 వేల చొప్పున జమ కానున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు.

2019-20 ఏడాదికి రైతు బంధు పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ. 12,862 కోట్లు కేటాయించింది. ఖరీఫ్ కోసం రూ.6,862 కోట్లు జమ చేయగా, తాజాగా రబీ కోసం (Rabi Season)  రూ. 5,100 కోట్లు విడుదల చేసినట్లు వ్యవసాయ మరియు సహకార శాఖ ఒక ప్రకటనలో ప్రకటించింది.

ఇందుకు సంబంధించిన తదుపరి చర్యలు వ్యవసాయ కమీషనర్ తీసుకుంటారని ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా, మరో రూ. 900 కోట్లు ప్రభుత్వం వద్ద బ్యాలెన్స్ గా పెట్టుకుంది.

సంవత్సరానికి రెండు పంటల కోసం రైతుల పెట్టుబడి సాయం అందించడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకం ప్రవేశపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా గల మొత్తం 58.33 లక్షల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ది పొందుతున్నారు.

రైతు బంధు నిధులను విడుదల చేయడాన్ని బీజేపీ స్వాగతించింది. జనవరి 22న తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి.