Telangana Formation Day: తెలంగాణ దోపిడికి గురైంది ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భావం నుంచే, ఇప్పుడు రాష్ట్రం ఓ బలీయమైన శక్తి, తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో సీఎం కేసీఆర్

1969లోనే ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడిందని, మలిదశ ఉద్యమంలో పాల్గొనే అవకాశం తనకు దక్కిందని చెప్పారు

CM KCR (Photo-Video Grab)

Hyd, June 2: ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) ఆవిర్భావం నుంచే తెలంగాణ (Telangana) దోపిడీకి గురైందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) అన్నారు. 1969లోనే ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడిందని, మలిదశ ఉద్యమంలో పాల్గొనే అవకాశం తనకు దక్కిందని చెప్పారు. ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారని వెల్లడించారు. ఇప్పుడు దేశంలోనే బలీయమైన శక్తిగా తెలంగాణ ఎదిగిందని చెప్పారు

తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా (Telangana Decade celebrations) హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో సీఎం కేసీఆర్‌ జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం భద్రతా బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు గన్‌పార్క్‌ వద్ద అమరవీరులకు కేసీఆర్‌ నివాళులర్పించారు. సచివాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు జరిగిన పరిణామాలు గుర్తు చేశారు.

ప్రగతి భవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఆనంతరం అమర వీరుల స్థూపానికి నివాళులు

సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర సాధనకు ప్రాణాలర్పించిన త్యాగమూర్తులకు నివాళులు అర్పించారు. ఒకసారి పోరాట చరిత్ర, అభివృద్ధి ప్రస్తానాన్ని తలచుకుందామని, భవిష్యత్తు పురోగమనానికి మహోన్నతమైన ప్రేరణగా మలుచుకుందామన్నారు.

రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర విజయ ప్రస్థానానికి పదేళ్లు పూర్తి అయ్యింది. తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి. 1969లో ఉద్యమం రక్తసిక్తమైంది. శాంతియుతంగా మలిదశ ఉద్యమం జరిగింది. ఈ ఉద్యమంలో ఎన్నో వర్గాలు కదిలాయి. మలిదశ ఉద్యమంలో నాయకత్వం వహించే అవకాశం నాకు దక్కింది. రాష్ట్ర సాధనలో అమరులైనవారికి హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నా. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నాం. ఎన్నో అరవరోధాలను దాటుకుని తెలంగాణ బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగింది. దేశానికి తెలంగాణ ఇప్పుడు దిక్సూచిగా మారింది’’ అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

తెలంగాణ ప్రజలకు తెలుగులో ప్రధాని మోదీ శుభాకాంక్షలు, తెలంగాణ శ్రేయస్సు, సౌభాగ్యం కోసం ప్రార్థిస్తున్నానంటూ ట్వీట్

1969లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడి రక్తసిక్తమైంది. ఉద్యమాన్ని అప్పటి ఆంధ్రా పాలకులు కుట్రలతో అణచివేశారు. 2001 వరకు ఇంకెక్కడి తెలంగాణ? అనే నిర్వేదం జనంలో అలముకుంది. ఆ నిర్వేదం, నిశ్శబ్దాన్ని బద్దలుకొడుతూ ఉద్యమం మళ్లీ ఎగిసిపడింది. దానికి నాయకత్వం వహించే చారిత్రక పాత్ర నాకు లభించడంతో నా జీవితం ధన్యమైంది. శాంతియుత పంథాలో వివేకం పునాదిగా వ్యూహత్మకంగా సాగిన మలిదశ ఉద్యమంలోకి క్రమంగా అన్ని వర్గాలు వచ్చి చేరాయి.

ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన మేధావులు, విద్యావంతులు, ఉద్యోగ ఉపాధ్యాయులు, కవులు, కళాకారులు, కార్మికులు, మహిళలు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు విభేదాలకు తావివ్వకుండా ఏఖోన్ముఖులై ముందుకు కదిలారు. వారందరికీ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తలవంచి నమస్కరిస్తున్నాను. స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించి త్యాగధనులైన అమరులకు నివాళులర్పిస్తున్నాను.

2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి BRS ప్రభుత్వం అమరుల ఆశయాలు, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు మనసా, వాచా, కర్మణా అంకితమైంది. ప్రతి రంగంలోనూ యావద్దేశం నివ్వెరపోయేలా ఫలితాలను సాధిస్తూ ప్రగతిపథంలో పరుగులు పెడుతున్న తెలంగాణ.. నేడు పదో వసంతంలోకి అడుగుపెట్టడం ఓ మైలురాయి. స్వరాష్ట్ర అవతరణ, దశాబ్ది ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి 21 రోజులపాటు గ్రామం నుంచి రాజధాని వరకు ప్రజలంతా ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొనాలని కోరుతున్నాను’’ అని కేసీఆర్‌ పిలుపునిచ్చారు.