TS Inter 1st Year Exams: తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ఆపలేమని స్పష్టం చేసిన హైకోర్టు, ఈ నెల 25 నుంచి యథావిధిగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్, గురుకులాలు ఓపెన్ చేసేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ఈ నెల 25 నుంచి పరీక్షలు (TS Inter 1st Year Exams) ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పరీక్షలను ఆపడం సమంజసం కాదని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.
Hyd, Oct 22: తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ఆపలేమని హైకోర్టు శుక్రవారం తేల్చి చెప్పింది. ఈ నెల 25 నుంచి పరీక్షలు (TS Inter 1st Year Exams) ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పరీక్షలను ఆపడం సమంజసం కాదని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రద్దు చేయాలన్న పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఈ విధంగా తీర్పిచ్చింది. ఇంటర్ బోర్డ్ పరీక్షలు నిర్వహించుకోవచ్చని (Telangana HC gives green signal) హైకోర్టు స్పష్టం చేసింది.
ఇప్పటికే ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసిందని, పిటిషన్ దాఖలు చేయడంలో ఆలస్యమైనందని హైకోర్టు పేర్కొంది. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పిటిషన్ వెనక్కి తీసుకోవాలని హైకోర్టు తెలిపింది. కాగా తెలంగాణలో ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 25 నుంచి ఫస్టియర్ పరీక్షలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షల రద్దు చేయాలని గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే.పేరేంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పిటిషన్ దాఖలైంది.
ఇంటర్ ఫస్టియర్ ప్రమోటైన విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించవద్దని పిటిషన్‌లో కోరారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఇంటర్ పరీక్షలను రద్దు చేయలేమని స్పష్టం చేసింది. విద్యార్థుల భవిష్యత్తు కోసం పరీక్షలను వాయిదా వేయలేమని స్పష్టంచేసింది. దీంతో పిటిషనర్ పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో 25 నుంచి ఇంటర్ పరీక్షలు యథావిధిగా జరగనున్నాయి. ముందే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అధికారులు పరీక్షలను నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల 58 మంది ఇంటర్ విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనున్నారు.
గురుకులాలు ఓపెన్ చేసేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాంఘిక సంక్షేమ, ఇతర గురుకులాలను తెరిచేందుకు హైకోర్టు అనుమతించింది. కరోనా నిబంధనలు పాటిస్తూ గురుకుల పాఠశాలలు, కళాశాలలను ప్రారంభించవచ్చని స్పష్టంచేసింది. ఇప్పటికే ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు భౌతికంగా తరగతులను నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ గురుకుల విద్యాసంస్థల్లోని విద్యార్థులకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే తరగతుల నిర్వహణకు అనుమతినిస్తున్నట్లు పేర్కొంది. కేరళ సహా పలు రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కోవిడ్ అదుపులో ఉందని.. నియంత్రణ చర్యలు బాగున్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఈ మేరకు ప్రభుత్వ గురుకులాలు తెరవరాదంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవరిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్రశర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డితో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. భౌతికంగా పాఠశాలలు, కళాశాలలు ప్రారంభించాలంటూ గత ఆగస్టు 24న ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సవాల్‌చేస్తూ అధ్యాపకుడు ఎం.బాలకృష్ణ దాఖలుచేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం మరోసారి విచారించింది.
గురుకులాల్లో కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు. ప్రైవేటు హాస్టళ్లతో పోలిస్తే ప్రభుత్వం నిర్వహిస్తున్న గురుకులాల్లో మెరుగైన సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు.
ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో తరగతుల నిర్వహణకు అనుమతినివ్వాలని కోరారు. గురుకులాలు తెరిచేందుకు తమకు అభ్యంతరం లేదని, అయితే కరోనా నిబంధనలను తప్పకుండా పాటించేలా చూడాలని, నాలుగు వారాల తర్వాత పరిస్థితిని సమీక్షించాలని పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ నివేదించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. గురుకులాల నిర్వహణపై స్థాయీ నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను నవంబర్ 29కి వాయిదా వేసింది.