Ganesh Idol Immersion: హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనం కుదరదు, తాము ఇచ్చిన ఆదేశాలు పాటించాల్సిందేనని స్పష్టం చేసిన తెలంగాణ హైకోర్టు
నిమజ్జనంపై (Ganesh Idol Immersion) తీర్పును సవరించేందుకు ఏసీజే జస్టిస్ రామచంద్రరావు, జస్టిస్ వినోద్ కుమార్‌తో కూడిన ధర్మాసనం నిరాకరించింది.
Hyderabad, Sep 13: గణేశ్ నిమజ్జనంపై జీహెచ్‌ఎంసీ వేసిన రివ్యూ పిటిషన్‌పై హైకోర్టు అత్యవసర విచారణ చేపట్టింది. నిమజ్జనంపై (Ganesh Idol Immersion) తీర్పును సవరించేందుకు ఏసీజే జస్టిస్ రామచంద్రరావు, జస్టిస్ వినోద్ కుమార్‌తో కూడిన ధర్మాసనం నిరాకరించింది. హుస్సేన్‌సాగర్‌లో పీవోపీ విగ్రహాలు నిమజ్జనం చేయొద్దని గతవారం హైకోర్టు (Telangana High Court) తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును పునఃపరిశీలించాలంటూ జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ ఈ ఉదయం రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు.
పరిస్థితులను అర్థం చేసుకొని తీర్పు సవరించాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. హైకోర్టు తమ తీర్పును పునః పరిశీలించాలని జీహెచ్‌ఎంసీ కోరింది. హుస్సేన్ సాగర్, ఇతర జలాశయాల్లో పీవోపీ విగ్రహాల నిమజ్జనంపై నిషేధం ఎత్తేయాలని పిటిషన్‌లో జీహెచ్‌ఎంసీ పేర్కొంది. ట్యాంక్ బండ్ వైపు నుంచి నిమజ్జనానికి అనుమతించాలని కోరింది. హుస్సేన్‌సాగర్‌లో రబ్బర్ డ్యాం నిర్మించాలన్న ఉత్తర్వులను సవరించాలని జీహెచ్‌ఎంసీ విజ్ఞప్తి చేసింది. నిమజ్జనం తర్వాత 24 గంటల్లో వ్యర్థాలు తొలగిస్తామని జీహెచ్‌ఎంసీ పేర్కొంది.
దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. పరిస్థితులన్నీ ప్రభుత్వం సృష్టించుకున్నవేనని వ్యాఖ్యానించింది. సమస్యను గుర్తించి పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులదని..కోర్టులది కాదని స్పష్టం చేసింది. గతంలో తాము ఇచ్చిన ఆదేశాలు పాటించాల్సిందేనని (High Court rejects govt’s plea) హైకోర్టు తెలిపింది. తమ ఆదేశాలపై అభ్యంతరాలుంటే ఉత్తర్వులను చాలెంజ్ చేసుకోవాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశించింది. ఈ ఒక్క ఏడాది మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. గత ఏడాదిలోనూ నిమజ్జనంపై ఉత్తర్వులు ఇచ్చామని హైకోర్టు సమాధానం ఇచ్చింది. ఏడాది గడిచినా పాటించలేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో ఎలాంటి మార్పు లేదని హైకోర్టు స్పష్టం చేసింది.
హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనం చేసి కలుషితం చేయాలని చెప్పలేమని హైకోర్టు పేర్కొంది. గతంలో ప్రభుత్వం మూడు కౌంటర్లు దాఖలు చేసిందని హైకోర్టు గుర్తుచేసింది. కానీ ఇప్పటివరకు ఇబ్బందులపై కోర్టు దృష్టికి తీసుకురాలేదని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇబ్బందులు ఈ నెల కంటే ముందే మీ దృష్టికి వచ్చాయని ధర్మాసనం అభిప్రాయ పడింది. అన్ని ఇబ్బందులు ప్రభుత్వానికి తెలుసని, అయినా ఎందుకు మౌనంగా ఉంటుందని ప్రభుత్వానికి హైకోర్టు చురకలు అంటించింది.
నీటి కుంటల్లో నిమజ్జనం వీలు కాదని గతంలోనే ఎందుకు చెప్పలేదు? అని ప్రశ్నించింది.హైకోర్టు తీర్పు ఇచ్చాక ఇప్పుడు గుర్తించారా? అని అడిగింది. చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యత మాపై ఉందని వెల్లడించింది. చట్టాలను ఉల్లంఘిస్తారా..? అమలు చేస్తారా? ప్రభుత్వం ఇష్టమని పేర్కొంది. తీర్పులో జోక్యం చేసుకొని సవరించలేమని స్పష్టం చేసింది. పీవోపీ విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది.