CM KCR Jangaon Tour Highlights: ఖబర్ధార్ మోదీ.. ఇది తెలంగాణ అడ్డా, నిన్ను తరిమికొట్టేందుకు తెలంగాణ పులిబిడ్డ వస్తున్నాడు, ఏం చేస్కుంటావో చేసుకో. మీ సంస్కరణలను మేం అమలు చేయమని తేల్చి చెప్పిన సీఎం కేసీఆర్
Hyd, Feb 12: తెలంగాణ సీఎం కేసీఆర్ జనగామ జిల్లా పర్యటనలో ప్రధాని మోదీపై, అధికార బీజేపీ పార్టీపై విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీని తరిమికొడతాం. ఒక్క ప్రాజెక్టుకూ జాతీయ హోదా ఇవ్వలేదు. కోచ్ ఫ్యాక్టరీ లేదు. మెడికల్ కాలేజీలు ఇవ్వలేదు. లక్షల కోట్ల రుణాలు తీసుకుని, మోసం చేసిన వారిని లండన్‌కు పంపుతున్నారు. వారు అక్కడ పిక్‌నిక్‌లు చేసుకుంటున్నారు. మోదీ మాత్రం ఇక్కడ రైతులు, పేదల వెంట పడ్డారు. కరెంటు సంస్కరణలంటున్నారు. మా ప్రాణాలు పోయినా బోర్లు, బావులకు కరెంటు మీటర్లు పెట్టం. అవసరమైతే ఢిల్లీకి వస్తా (enter national politics ). ఏం చేస్కుంటావో చేసుకో. మీ సంస్కరణలను మేం అమలు చేయం’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM K Chandrashekhar Rao) విరుచుకుపడ్డారు.
పిడికెడు లేని బీజేపీ నేతలు తమ జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విద్యుత్ సంస్కరణల పేరిట రైతులను మోసం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. తమ ప్రాణం పోయినా బావుల వద్ద మోటార్లకు కరెంట్ మీటర్లు పెట్టమని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు జనగామలోని (CM KCR Jangaon Tour) యశ్వంత్‌పూర్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణను కొట్లాడి సాధించుకున్నామని తెలిపారు. తమను ముట్టుకుంటే అడ్రస్ లేకుండా చేస్తామని బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు
తెలంగాణ ప్రజలతో పెట్టుకుంటే ఢిల్లీ కోటలు బద్దలు కొడుతాం.. నరేంద్ర మోదీ జాగ్రత్త అని కేసీఆర్ హెచ్చరించారు. ఖబర్ధార్ మోదీ.. ఇది తెలంగాణ అడ్డా అంటూ నిప్పులు చెరిగారు. నీ ఉడుత ఊపులకు, పిట్ట బెదిరింపులకు భయపడేది లేదని మోదీని ఉద్ధేశిస్తూ విమర్శించారు. దేశ రాజకీయాల్లో పాత్ర పోషించాల్సి వస్తే కొట్లాడటానికి సిద్ధమని పేర్కొన్నారు. సిద్దిపేట ప్రజలు నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపితే తెలంగాణను సాధించామని, మీరందరూ పంపిస్తే ఢిల్లీ గోడలు బద్దలు కొట్టేందుకు సిద్ధమన్నారు.
‘జాగ్రత్త నరేంద్ర మోదీ.. ఇది తెలంగాణ పులిబిడ్డ. జనగామ టౌన్‌లో టీఆర్ఎస్ కార్యకర్తలను బీజేపీ వాళ్లు కొట్టారు. బీజేపీ వాళ్లను మేం టచ్ చేయం.. బీజేపీ బిడ్డల్లారా మమ్మల్ని ముట్టుకుంటే నశం నశం చేస్తాం. మేం ఊదితే మీరు అడ్రస్ లేకుండా పోతారు. రాష్ట్ర సాధన కోసం ఎంతో పోరాటం చేశాం. మీ జాగ్రత్తలా మీరు ఉండండి. మా జాగ్రత్తలా మేం ఉంటాం అని కేసీఆర్ సూచించారు.
గతంలో బచ్చన్నపేటను చూస్తే బాధనిపించేది. తెలంగాణ వచ్చాక పరిస్థితి మారింది.రాష్ట్రంలో తాగునీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. ప్రతి దళిత కుటుంబానికి చేయూతగా దళితబంధు తెచ్చాం. జనగామ ఒకప్పుడు కరువు సమీగా ఉండేది. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక అభివృద్ది చేశాం. మోదీ ప్రభుత్వం మీటర్లు పెట్టాలంటోంది. మేము మీటర్లు పెట్టం. పాలకుర్తి, స్టేషన్ ఘన్‌పూర్‌లో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని, మెడికల్ కాలేజీపై త్వరలోనే జీవో ఇస్తాం’ అని కేసీఆర్ తెలిపారు
కేంద్రంపై తన పోరుకు కారణాలను ప్రజలకు వివరించారు. ‘‘నాకు గులగులపెట్టి నేను కొట్లాడ్తలేదు. కేంద్రంపై కొట్లాటకు కారణాలున్నాయి’’ అని వ్యాఖ్యానించారు. ఏడేళ్లుగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏమీ ఇవ్వడం లేదని, మోదీని వెళ్లగొట్టి.. తెలంగాణకు ఇచ్చేటోణ్ని తీసుకొస్తాం అని సీఎం స్పష్టం చేశారు. దేశంలో మనకంటే సీనియర్ రాష్ట్రాలతో పోలిస్తే.. ముందు వరుసలో ఉన్నాం. దేశ రాజకీయాల్ని ప్రభావితం చేసే పాత్ర పోషించాల్సి వస్తే కొట్లాడతా’’ అని వ్యాఖ్యానించారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిద్దామా? ఢిల్లీపై పోరాటానికి పొమ్మంటారా? అని ప్రజలను ప్రశ్నించారు.
స్త్రీలకు సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఉంది, హిజాబ్ వివాదంపై MLC కల్వకుంట్ల కవిత స్పందన..
ఈ ఏడేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ.. కేంద్రం పక్షపాత వైఖరిని ఎండగట్టారు. ‘‘రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అని ప్రధాని అన్నారు. డీజిల్ ధరలు పెంచిన్రు. దున్నేందుకు ఇప్పుడు రెండింతలు తీసుకుంటున్నారు. అడ్డగోలుగా గ్యాస్ ధరలు పెంచారు. రైతుల వ్యవసాయ పెట్టుబడిని రెట్టింపు చేశారు’’ అంటూ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. గతంలో చంద్రబాబు కూడా బాయికో మీటర్ పెట్టాలన్నారని, అంతా కలిసి ఆయనకే మీటర్ పెడతామని చెప్పామని గుర్తుచేశారు. ‘‘కేంద్రానిది ఇదేం దందా..? పండించే ధాన్యం కొనడం లేదు. వ్యవసాయానికి కరెంటు మీటర్లు పెట్టాలంటున్నారు. వాట్సా్‌ప్ లో ఇష్టమొచ్చినట్లు మెసేజీలు పెడుతున్నారు. ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత తెలంగాణ వచ్చింది. ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నాం. పేద పిల్లల పెళ్లిళ్లకు సాయం చేసుకుంటున్నాం’’అని అన్నారు.
తెలంగాణ వస్తే బాగుపడతామని చెప్పిన. వందకు వంద శాతం నేను చెప్పినట్లే జరుగుతోంది. దళితులు బాగుండకపోతే మంచిది కాదు. శరీరంలో ఏ ఒక్క భాగం బాగలేకపోయినా శరీరం బాగున్నట్లు కాదు. బయట కొందరి కండ్లు మండుతున్నాయి. 40 వేల కుటుంబాలకు దళిత బంధు ఇస్తున్నాం. రాష్ట్రంలో 17 లక్షల దళిత కుటుంబాలున్నాయి. సంవత్సరానికి 2 నుంచి 3 లక్షల కుటుంబాలకు రూ.10 లక్షల వంతున మంజూరు చేస్తాం. మార్చి తర్వాత ప్రతి నియోజకవర్గంలో రెండు వేల కుటుంబాలకు దళిత బంధు వస్తుంది. దళిత సోదరులకు మెడికల్, ఫర్టిలైజర్, ఆస్పత్రులు, హాస్టళ్లకు సామగ్రి సరఫరా చేసే కాంట్రాక్ట్, బార్, వైన్‌షాపులో రిజర్వేషన్ కల్పించాం’’ అని వివరించారు. గతంలో ఏ ఒక్క దళితుడికి బార్, వైన్‌షాపు లేదని, ఇప్పుడు 260 మంది బార్, వైన్ షాపులు నడుపుతున్నారని చెప్పారు. ఈ పరిస్థితి దేశంలో ఎక్కడా లేదన్నారు.
గతంలో ఆపద్బంధు అంటూ రూ. 50 వేలు ఇచ్చేవారు. అదికూడా ఆర్నెల్లు చెప్పులరిగేలా తిరిగితే సగం కట్ చేసుకుని రూ. 20 వేలు, రూ. 30 వేలు ఇచ్చేవారు. ఇప్పుడు రూ. 5 లక్షలు బ్యాంకులో జమ అవుతున్నాయి’’ అని కేసీఆర్ గుర్తుచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో.. ప్లానింగ్ కమిషన్ జాబితాలో తెలంగాణ వెనకబడ్డ ప్రాంతాల జాబితాలో ఉండేదని తెలిపారు. ఏడేళ్లుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నామని, ప్రస్తుతం తెలంగాణ తలసరి ఆదాయం రూ.2.37 లక్షలుగా ఉందని చెప్పారు. రాబోయే రోజుల్లో రూ. 2.70 లక్షలకు తలసరి ఆదాయం పెరుగుతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం రూ. 1.70 లక్షలుగా ఉందని వివరించారు. ఈ అభివృద్ధిని చూసి.. తెలంగాణకు వచ్చిన 11 రాష్ట్రాల సీఎంలు ముక్కున వేలేసుకున్నారన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల సచివాలయాలతో పోలిస్తే.. జనగామ కలెక్టరేట్ అద్భుతంగా ఉంది’’అని వ్యాఖ్యానించారు. వరంగల్-హైదరాబాద్ కారిడార్ రానున్నరోజుల్లో అద్భుతంగా అభివృద్ధి సాధించనుందన్నారు. రాష్ట్రం 33 అభివృద్ధి కేంద్రాలతో బంగారు తెలంగాణ కాబోతోందన్నారు.
జనగామ, బచ్చనపేటలో ఒకప్పుడు ఎకరా రూ. 2 లక్షలు, రూ. 3 లక్షలు పలికేది. ఇప్పుడు రూ. 30 లక్షలు పలుకుతోంది. రోడ్డు పక్కన ఉంటే రూ. 50 లక్షలు, డాంబర్ రోడ్డు ఉంటే రూ. 70 లక్షలుగా భూముల ధరలున్నాయి. ఈ ధరలు ఇంకా పెరగాలి’’అనిసీఎం ఆకాంక్షించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడి రైతులు తీవ్రంగా నష్టపోయారని.. 30 లక్షల బోర్లు వేసుకున్నారని, దేశంలో ఇన్ని బోర్లు మరెక్కడా లేవన్నారు. ఇప్పుడు చెరువులు బాగుచేసుకుంటున్నామని, భూగర్భ జలాలు పెరిగాయన్నారు. ‘‘స్టేషన్‌ఘన్‌పూర్‌లో డిగ్రీ కాలేజీ మంజూరు చేస్తున్నాం. జనగామకు మెడికల్ కాలేజీ ఇస్తాం. రాబోయే 2, 3 రోజుల్లో జీవో జారీ చేస్తాం. పాలకుర్తిలో డిగ్రీ కాలేజీ మంజూరు చేస్తున్నాం’’ అని కేసీఆర్ వెల్లడించారు.
రాష్ట్ర ఆదాయం పెరిగేకొద్దీ ఉద్యోగుల జీతాలు పెరుగుతాయి. ధనికులైన ఉద్యోగులు తెలంగాణలోనే ఉన్నారనే రోజు వస్తుంది. మారుమూల ప్రాంతాలకు వెళ్లేందుకు కొంత మంది ఉద్యోగులు ఇష్టపడటం లేదు. అలాంటి ప్రాంతాలకు వెళ్లే ఉద్యోగులకు ప్రత్యేక అలవెన్సులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని సీఎం స్పష్టం చేశారు. ఏడేళ్ల తెలంగాణ ప్రగతిలో ఉద్యోగుల కృషి ఎంతో ఉంది. ఇక నుంచి కూడా అదే ఉత్సాహాన్ని కొనసాగించాలి. జోన్ల ఏర్పాటుతో ఏర్పడ్డ సమస్యలు మామూలే. అవి కూర్చొని చర్చించుకుంటే పరిష్కారమవుతాయి’’అని వ్యాఖ్యానించారు. గ్రామీణ ఉద్యోగులకు ‘ప్రత్యేక అలవెన్సు’ను ప్రకటిస్తామని, దీనిపై సీఎస్‌కు ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు.
నర్మెట, జనగామ కాడ పిడికెడు లేని బీజేపీ వాడు టీఆర్‌ఎస్ కార్యకర్తను కొట్టారని పేపర్‌లో చదివా. బీజేపీ బిడ్డల్లారా మమ్మల్ని ముట్టుకుంటే నశం చేస్తాం’’అని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. ‘‘మా బలం ముందు కొట్టుకుపోతారు. టీఆర్‌ఎస్ పోరాటం చేసిన పార్టీ. వందల మంది బలిదానం చేసిన పార్టీ. ఉడుత బెదిరింపులకు బయపడేవారు ఎవ్వరు లేరు. మీ జాగ్రత్తలో మీరు ఉండండి’’అని హితవు పలికారు. మెడికల్ కాలేజీ ప్రకటించకుండా జిల్లాలో అడుగుపెట్టొద్దంటూ పలువురు ఆందోళన చేపట్టారు. పోలీసులు బీజేపీ, బీజేవైఎం నేతలను ముందస్తుగా అరెస్టు చేసినా.. పలువురు రోడ్లపై ఆందోళన చేపట్టగా.. పోలీసులు అరెస్టు చేశారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)